ప్లీజ్ ..దండం పెడతా.. మా నాన్నను బతికించండి, కుమార్తె కళ్ల ఎదుటే మృతి

346

ఆయన నిరుపేద న్యాయవాది.. ఇద్దరు కుమార్తెలు.. ఉండేందుకు ఇల్లు కూడా సరిగా లేదు. శిథిలావస్థలో రేకులు ఊడిపోయి సగం కూలిన గోడల ఇంట్లో నివసిస్తున్నారు. కేసులు వస్తేనే ఆ రోజు పూటగడవడానికి బియ్యం తెచ్చుకుని ఇంట్లో భోజనం చేస్తారు. తాను అనుభవిస్తున్న దుర్భర జీవితాన్ని తన పిల్లలు అనుభవించవద్దని వారిని ఇంజనీరింగ్‌ చదివిస్తున్నాడు. ప్రతి రోజు మాదిరిగానే చిన్నకూతురును కాలేజీకి తన పురాతన స్కూటర్‌పై తీసుకువెళ్తున్నాడు. ఈ సమయంలో ఎదురుగా మృత్యురూపంలో వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. తన తండ్రి మృతిచెందిన విషయం తెలియక ‘‘నాన్నా కాలేజీ బస్సు వచ్చింది లే’’ అంటూ ఏడుస్తూ రక్తపుమడుగులో పడి ఉన్న తన తండ్రిని లేపుతూ రోదిస్తుంటే ఆ దారిగుండా వెళ్లే పలువురు కంటతడి పెట్టారు. ఈ ఘటన నగరంలోని నారాయణగూడ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది.

సుల్తాన్‌బజార్‌లోని జైన్‌మందిర్‌ వెనుకాల శిథిలావస్థకు చేరి సగం కూలిన గోడలు, విరిగిపోయిన రేకుల ఇంట్లో రాణాప్రవీర్‌కుమార్‌(58) నివాసం ఉంటున్నాడు. ఈయనకు భార్య అనురాధ, పెద్దకూతురు చందన, చిన్నకూతురు శివాని ఉన్నారు. రాణాప్రవీర్‌కుమార్‌ వృత్తి రీత్యా న్యాయవాది. కానీ వారి ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉంది. కేసులు వస్తేనే ఆ రోజుకు సరిపడే సరుకులు తెచ్చుకుని వండుకునే పరిస్థితి వారిది. ఇంతటి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతున్నప్పటికీ అష్టకష్టాలు పడుతూ ఇద్దరు కుమార్తెలను ఇంజనీరింగ్‌ చదివిస్తున్నాడు. చిన్నకూతురు బాచుపల్లిలోని గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్‌ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతోంది. ఈమెను ప్రతి రోజూ తన పాత ద్విచక్రవాహనంపై నారాయణగూడ వరకు తీసుకొచ్చి కళాశాల బస్సులో కాలేజీకి పంపించేవాడు. రోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం 7.30గంటలకు ఇంటి నుంచి రామ్‌కోఠి మీదుగా నారాయణగూడ జలమండలి కార్యాలయం వరకు రాగానే బస్సు కోసం ఎదురుచూస్తున్న రాణాప్రవీర్‌కుమార్‌ స్కూటర్‌ను ఎదురుగా దూసుకొచ్చిన ఓ వ్యక్తి బుల్లెట్‌ వాహనంతో బలంగా ఢీకొట్టాడు.

దీంతో స్కూటర్‌పై ఉన్న తండ్రీకూతుళ్లు రోడ్డుపైన పడిపోయారు. ఈ ప్రమాదంలో రాణాప్రవీర్‌కుమార్‌ తలకు బలమైన గాయాలు తగిలి రక్తపు మడుగులో కొట్టుకుంటూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఇదే ప్రమాదంలో ఎడమచేయికి బలమైన గాయమైన శివాని తన తండ్రిని రక్షించాలంటూ అరుపులు పెట్టింది. అక్కడే ఉన్న స్థానికులు 108, పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదానికి కారకుడైన ద్విచక్రవాహనదారుడు అక్కడి నుంచి రెప్పపాటులో వాహనంతో పారిపోయాడు. విషయం తెలుసుకున్న నారాయణగూడ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని రాణాప్రవీర్‌కుమార్‌ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. శివానిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చేతులకు కట్టుకట్టించారు. ఈ మేరకు వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.