జగన్ పై దాడి చేసిన శ్రీనివాస్ సంచలన ప్రకటన…షాక్ లో పోలీసులు

422
వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై దాడి ఘటన కొత్త మలుపు తీసుకుంది. కోడికత్తితో దాడి చేయలేదని నిందితుడు శ్రీనివాసరావు చెప్పినట్లు అతని న్యాయవాది సలీం సంచలన ప్రకటన చేశారు. అదెలా వచ్చిందో కూడా తెలియదని నిందితుడు అన్నట్లుగా ఆయన చెప్పారు. విశాఖ సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న శ్రీనివాసరావుతో అతని తల్లి ఈశ్వరమ్మ, సోదరుడు సుబ్బారావుతో పాటు సలీం గురువారం ములాఖత్‌ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావుతో జరిగిన సంభాషణను ఆయన ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’కి వివరించారు. ‘జగన్‌పై పదునైన వస్తువుతో దాడి చేశాను. తర్వాత కోడికత్తి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు’ అని నిందితుడు చెప్పాడన్నారు. ‘వచ్చే ఎన్నికల్లో వైసీపీ 160 సీట్లు గెలుచుకుంటుంది. జగన్‌ సీఎం కావడం ఖాయం.

కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత చేయాల్సిన పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జగన్‌ దృష్టికి తీసుకెళ్లేందుకే దాడి చేశా’ అని నిందితుడు పేర్కొన్నట్లు చెప్పారు. అతనితో మాట్లాడిన తర్వాత.. ఇంతవరకూ మీడియాలో వచ్చిన కథనాలకు భిన్నంగా, సమాజంపై పూర్తి అవగాహన కలిగిన వ్యక్తిలా శ్రీనివాసరావు కనిపించాడన్నారు.
బెయిల్‌ వచ్చిన తర్వాత మొదట జగన్‌ను, తర్వాత అతని తల్లి విజయలక్ష్మిని కలుస్తానని చెప్పాడని సలీం తెలిపారు.‘పోలీసులు 10 రోజులపాటు మా ఇంట్లో అణువణువూ గాలించారు. మా వద్ద డబ్బు లేదా ఆస్తులున్నట్టయితే వారికి దొరికి వుండేవి కదా?’ అని ఈశ్వరమ్మ ప్రశ్నించారు.తమను బాధపడొద్దని శ్రీనివాసరావు చెప్పాడని, బెయిల్‌పై బయటకు వచ్చాక మీడియాకు అన్ని వివరాలు వెల్లడిస్తానని తెలిపాడని అతడి సోదరుడు సుబ్బారావు చెప్పారు.
https://www.youtube.com/watch?v=xA2TtyBG8jY&t=2s