Breaking News:చంద్రబాబును సస్పెండ్ చేస్తూ లేఖ.. రాజకీయవర్గాల్లో ప్రకంపనలు

377

అవును మీరు చదివిన హెడ్డింగ్ నిజమే ! తెలుగుదేశం పార్టీ నుంచి నారా చంద్రబాబు నాయుడుని సస్పెండ్ చేసినట్టుగా నిరూపిస్తున్న ఓ లేఖ ఇప్పుడు సోషల్ మీడియా లో చెక్కెర్లు కొడుతోంది. దీంతో ఏంటి సంగతి టీడీపీ నుంచి అందులోనూ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన చంద్రబాబు ని సస్పెండ్ చేయడం ఏంటి అని అంతా ఆరాతీస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే..? 1995 ఆగస్టు సంక్షోభం తర్వాత నాటి ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు ఎన్‌టీ రామారావు తీసుకున్న ఈ నిర్ణయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ రాజకీయ సంచలనం అనేక పరిణామాలకు దారితీసింది. సీఎం పీఠంపై నుంచి ఎన్టీఆర్ గద్దె దిగాల్సి వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేతగా, ముఖ్యమంత్రిగా ఏకకాలంలో బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఈ లేఖ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో అసలు ఆ రోజు ఏం జరిగిందనేది అందరికి పెద్ద మిస్టరీగా మారింది.

అది 1995 ఆగస్టు.. సీఎం హోదాలో ఎన్టీఆర్ శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లారు. అదే సమయంలో హైదరాబాద్‌లో చంద్రబాబు నాయుడు క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టారు. పార్టీలో, ప్రభుత్వంలో లక్ష్మీ పార్వతి రాజ్యాంగేతర శక్తిగా మారిందని, ఆమె వల్ల ప్రమాదం ఉందని చంద్రబాబు ప్రధాన ఆరోపణ. మద్దతుదారుల సాయంతో ఒక్కో ఎమ్మెల్యేకు విషయాన్ని వివరిస్తూ తనవైపు తిప్పుకోవడం ప్రారంభించారు. ఇందుకోసం వైస్రాయ్‌ హోటల్‌ను వేదికగా చేసుకున్నారు. ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన చంద్రబాబు.. సచివాలయంలో తన కార్యాలయంలోనే పలువురితో మంతనాలు జరిపి క్యాంపు రాజకీయాలకు చేశారని ఆరోపణలున్నాయి. అప్పట్లో ప్రముఖంగా ఉన్న ఒకట్రెండు టీవీలు, పత్రికలను కూడా ఆయన మేనేజ్ చేసి తనకు అనుకూలంగా వార్తలు రాయించుకున్నారని చెబుతారు.

చంద్రబాబుకు అనుకూలంగా 120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, 140 మంది ఉన్నారంటూ వార్తలు సర్క్యులేట్ చేయించి క్రమంగా బలం పెంచుకున్నారని ఆరోపణ. దీంతో తాము ఎక్కడ వెనుకబడిపోతామో అనే భయంతో ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా బాబు గూటికి చేరారట. బాబు క్యాంపు రాజకీయాల గురించి తెలుసుకున్న కొంత మంది ఎమ్మెల్యేలు జిల్లా పర్యటన నుంచి ఎన్టీఆర్ రాగానే ఆయణ్ని కలిసి పరిస్థితిని వివరించారట. అయితే, పక్కా ప్రణాళికను అమలుపర్చిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఎన్టీఆర్‌కు నమ్మిన బంట్లుగా ఉన్నవారిని కూడా తనవైపునకు తిప్పుకున్నారని చెబుతారు.తన వెనుక ఏదో కుట్ర జరుగుతోందని భావించిన ఎన్టీఆర్.. తన చైతన్య రథంపై వైస్రాయ్ హోటల్‌కు బయలుదేరారు. లక్ష్మీపార్వతి, పరిటాల రవితో తదితరులతో పాటు మరికొందరు నేతలను వెంటబెట్టుకుని ఎన్టీఆర్ వైస్రాయ్ వద్దకు చేరుకున్నారు. ఎన్టీఆర్ వాహన శ్రేణి ట్యాంక్‌బండ్ చివరన ఉన్న వైస్రాయ్ సమీపానికి చేరగానే చంద్రబాబు మనుషులు ఎదురుదాడికి దిగినట్లు చెబుతారు. ఎన్టీఆర్ వాహనంపై రాళ్లు, చెప్పులు విసురుతూ దాడి చేసినట్లు అప్పట్లో కొన్ని పత్రికా కథనాల్లో పేర్కొన్నారు.

వైస్రాయ్ ఘటన జరిగే నాటికి బాబు వెంట 50 నుంచి 60 మందికి మించి ఎమ్మెల్యేలు లేరని కొంత మంది చెబుతారు. కానీ, అనుకూల మీడియాతో 140 మంది ఎమ్మెల్యేలు చేరిపోయారని ప్రచారం చేస్తూ.. ఎన్టీఆర్ వెంట ఉన్న ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఒత్తిడి పెంచారట. అయినా.. దాడికి వెరవని ఎన్టీఆర్ అక్కడి నుంచే పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రలోభాలకు లోనుకావొద్దంటూ ఎమ్మెల్యేలను వేడుకున్నారు. కానీ, చాలా మంది ఎమ్మెల్యేలు అప్పటికే వైస్రాయ్‌లో బందీ అయ్యారు. తన కుమారుడు నందమూరి హరికృష్ణ, పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా చంద్రబాబు వెంట ఉన్నట్లు వార్తలు విని ఎన్టీఆర్ తీవ్ర ఆవేదన చెందారు. దాడి జరిగిన మరుసటి రోజే చంద్రబాబు తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో రాజ్‌భవన్‌ వద్దకు ర్యాలీగా వెళ్లారు. తమకే బలం ఉందని గవర్నర్‌కు తెలిపారు.

సీఎం గద్దెనెక్కడానికి ముందే చంద్రబాబు నాయుడు టీడీపీని కూడా చేతుల్లోకి తీసుకున్నారు. పార్టీలో సర్వప్రతినిధుల సభ (మహానాడు) ఆమోదించి తీర్మానం చేస్తే తప్ప పార్టీ అధ్యక్షుడిని తొలగించడానికి వీల్లేదు. కానీ, చంద్రబాబు తన వర్గీయులతో కాచిగూడలో బసంత్ టాకీస్‌లో మినీ మహానాడును ఏర్పాటు చేసి అధ్యక్ష పదవి నుంచి ఎన్టీఆర్‌ను తొలగిస్తూ తీర్మానం చేయించి.. తనను అధ్యక్షుడిగా ఎంపిక చేయించుకున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ 1న చంద్రబాబు ఏపీ సీఎంగా పదవి చేపట్టారు.
చంద్రబాబు కుట్ర చేస్తున్నారని భావించిన ఎన్టీఆర్.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు సహా మరో నలుగురు నేతలపై 1995 ఆగస్టు 25న సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెన్షన్ వేటు పడినవారిలో అశోక గజపతి రాజు, విద్యాధర్ రావు, దేవేందర్ గౌడ్, ఎలిమినేటి మాధవ రెడ్డి ఉన్నారు. సస్పెన్షన్ లేఖను స్పీకర్‌ యనమలకు పంపించారు.

అయితే.. అప్పటికే చాలా ఆలస్యమైంది. అనంతరం ఆయన అవమాన భారం, ఆవేదనతో గుండెపోటుతో మరణించారు అంటూ సోషల్ మీడియాలో ఈ కధనం ట్రోల్ అవుతోంది.త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ సస్పెన్షన్ లేఖ సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది. అయితే, ఇది నాడు ఎన్టీఆర్ రాసిన లేఖేనా? కాదా అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. ఇక ఎవరు వైరల్ చేస్తున్నారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు! కానీ, ఈ లేఖ బయటకొచ్చిన నేపథ్యంలో చాలా మంది అప్పటి పరిణామాలను గుర్తు చేసుకుంటున్నారు. నాటి ఘటన గురించి తెలియని వాళ్లు వివరాలు ఆరా తీస్తున్నారు.