ధోని రనౌట్ ఐన బంతి నోబాల్.. ఫీల్డ్ అంపైర్ తప్పిదంతోనే ధోనీ ఔట్..? సాక్షాలివిగో

173

ఈసారి ఎలాగైనా వరల్డ్ కప్ కొట్టి ధోనీకి ఘనంగా వీడ్కోలు పలకాలని టీమిండియా ఆటగాళ్లు భావించగా.. సెమీఫైనల్లో ఓడిన భారత్.. వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. 240 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో కోహ్లిసేన 221 పరుగులకే పరిమితమైంది. నాకౌట్ మ్యాచ్‌ల్లో చేధించాల్సిన లక్ష్యం స్వల్పమైనా.. అది ఎంతటి ఒత్తిడికి గురి చేస్తుందో తాజా మ్యాచ్ ద్వారా మరోసారి రుజువైంది. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌ నుంచి సెమీస్‌లో ఓడటం ద్వారా భారత్ జట్టు ఇంటిబాట పట్టింది. అయితేఈ మ్యాచ్ లో ఓడిపోడానికి ముఖ్య కారణం ఫీల్డ్ అంపైర్ తప్పిదమే అని తేలింది.

న్యూజిలాండ్‌తో మాంచెస్టర్ వేదికగా బుధవారం ముగిసిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 240 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 49.3 ఓవర్లలో 221 పరుగులకి ఆలౌటైంది. ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ (1), కేఎల్ రాహుల్ (1), విరాట్ కోహ్లి (1) ఆరంభంలోనే ఔటవగా అనంతరం వచ్చిన దినేశ్ కార్తీక్ (6) తేలిపోయాడు. ఈ దశలో రిషబ్ పంత్ (32: 56 బంతుల్లో 4×4), హార్దిక్ పాండ్య (32: 62 బంతుల్లో 2×4) కాసేపు నిలకడగా ఆడినా ఈ ఇద్దరి ఔట్‌తో భారత్ జట్టు 30.3 ఓవర్లు ముగిసే సమయానికి 92/6తో పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. భారత్ జట్టు తీవ్ర ఒత్తిడిలో నిలిచిన దశలో రవీంద్ర జడేజా (77: 59 బంతుల్లో 4×4, 4×6)తో కలిసి మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (50: 72 బంతుల్లో 1×4, 1×6) బాధ్యతాయుత ఇన్నింగ్ ఆడాడు. ఈ ఇద్దరూ కలిసి ఏడో వికెట్‌కి అభేద్యంగా 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ శిబిరంలో మళ్లీ గెలుపు ఆశలు చిగురించాయి. కానీ ఈ దశలో జడేజా ఔటవగా ఆఖర్లో ధోనీ కూడా రనౌటవడంతో భారత్ పోరాటం ముగిసింది.

Image result for dhoni run out

వాస్తవానికి ధోనీ రనౌటైన సమయంలో న్యూజిలాండ్ జట్టు ఫీల్డింగ్ నిబంధనల్ని అతిక్రమించినట్లు తాజాగా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. భారత్ విజయానికి 10 బంతుల్లో 25 పరుగులు చేయాల్సిన దశలో పవర్‌ప్లే-3 అమలులో ఉంది. దీంతో నిబంధనల ప్రకారం 30 యార్డ్ సర్కిల్‌ వెలుపల ఐదుగురు ఫీల్డర్లని మాత్రమే అనుమతిస్తారు. కానీ ధోనీ ఔటైన సమయంలో ఆరుగురు ఫీల్డర్లు సర్కిల్ వెలుపల ఉన్నారు. ఫీల్డ్ అంపైర్లు ఈ తప్పిదాన్ని గుర్తించింటే..? ఆ బంతి నోబాల్ అయ్యేది. ఆ తర్వాత బంతికి ఫ్రీ హిట్ వచ్చే అవకాశం ఉండటంతో ధోనీ కూడా పరుగు కోసం ప్రయత్నించి ఉండకపోవచ్చని అభిమానుల వాదన. ఇలా ఫీల్డ్ అంపైర్ చేసిన తప్పిదం భారత్ కొంపముంచింది. మొత్తంగా ధోనీ రనౌట్ మ్యాచ్‌ని పూర్తిగా భారత్ నుంచి చేజార్చింది. ఏది ఏమైనా భారత్ కప్ గెలుస్తుంది అని అనుకున్న ప్రతి ఒక్కరు దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు. మరి భారత్ ఓటమి గురించి అలాగే ఫీల్డ్ అంపైర్ తప్పిదం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.