మీరే మా నిజమైన హీరో.. సానియా మీర్జా తన దేశభక్తి చాటుకున్నట్టేనా

264

వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్.. భారత గడ్డపై తిరిగి కాలుమోపడంపై టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా స్పందించారు. మీరే మా నిజమైన హీరో అంటూ ఆమె ఓ ట్వీట్ చేశారు. పుల్వామా ఘటన తదంనతర పరిణామాలపై సానియా మీర్జా స్పందించకపోవడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభినందన్‌ను ఉద్దేశించి ఆమె ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.‘మీరు ప్రదర్శించిన ధైర్యానికి, మీ హుందాతనానికి దేశం సెల్యూట్ చేస్తోంది.. మీరు మా నిజమైన హీరో..’ అని అభినందన్‌ను ఉద్దేశించి సానియా పేర్కొన్నారు. ‘అభినందన్‌కు స్వాగతం..’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.

sania mirza

కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ముష్కర దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ వార్త తెలిసిన వెంటనే భారతీయులందరూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమ కుటుంబంలోని వ్యక్తులే మరణించినంతగా బాధపడ్డారు. ఉగ్రదాడులకు వ్యతిరేకంగా ర్యాలీలు, నిరసనలు చేపట్టారు. సోషల్ మీడియా వేదికగానూ నెటిజన్లు తమ స్పందన తెలిపారు. పుల్వామా ఉగ్రదాడికి పాక్ భూభాగంలోనే కుట్ర జరిగిందనే వార్తల నేపథ్యంలో దాయాది దేశంపై భారతీయులు మండిపడ్డారు. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని.. పాక్‌ను ఇక ఎంత మాత్రం ఉపేక్షించవద్దని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో భారత వాయుసేనకు చెందిన మిరాజ్ యుద్ధ విమానాలు పాక్ గడ్డపైకి దూసుకెళ్లి ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసి వచ్చాయి. అయితే.. పుల్వామా దాడి జరిగిన తర్వాత సెలబ్రిటీలందరూ జవాన్లకు నివాళి అర్పిస్తూ పోస్టులు చేయగా సానియా మాత్రం స్పందించలేదు. పైగా సానియా మీర్జా పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకున్న నేపథ్యంలో పుల్వామా దాడి తర్వాత నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. కొంత మంది ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

పుల్వామా దాడి జరిగిన రోజే సానియా.. ‘ఈ దుస్తుల్లో ఎలా ఉన్నా..’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టారు. దీనిపై నెటిజన్లు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పుల్వామా ఉగ్రదాడి గురించి స్పందించ‌కుండా ఇలా ఫోటోలు పోస్ట్ చేస్తావా? నీ ఫోటోలు చూసే ఆస‌క్తి మాకు లేదు. అంత పెద్ద దాడి జ‌రిగితే దాని గురించి క‌నీసం స్పందించ‌కుండా ఇలా ఫోటోలు పోస్ట్ చేస్తావా’ అంటూ నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. మరి కొంత మంది మరో అడుగు ముందుకేసి సానియాను దుర్భషలాడుతూ పోస్టులు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె సుదీర్ఘ వివరణ ఇస్తూ ట్విటర్‌లో ఓ పోస్టు చేసింది. ఉగ్రవాదానికి జాతి, మతం లేదన్నారు. తన భారతీయతను పదే పదే నిరూపించుకోవాల్సిన పనిలేదని దేశం కోసం తాను ఇప్పటికే ఎంతో సాధించానని తెలిపారు. అయినప్పటికీ పాక్ తీరుపై స్పందించాల్సిందే అంటూ కొంత మంది ఒత్తిడి తెచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా పాక్ కోడలైన సానియా మీర్జాను తొలగించాలని డిమాండ్ చేయడంతో మరింత వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలో ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్‌పై స్పందించిన సానియా తన దేశభక్తిని చాటుకునే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది.మరి సానియా మీర్జా గురించి ఆమె చేసిన ఈ ట్వీట్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.