ముత్తులక్ష్మీ రియల్ స్టోరీ

107

మహిళలను కొన్ని దశాబ్దాల క్రితం అసలు బయటకు కూడా అడుగుపెట్టనిచ్చేవారు కాదు, కొన్ని కార్యక్రమాలకు మాత్రమే భర్తతో భార్య వెళ్లేది, కాని నేటి సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయి, వీటికి చాలా కారణాలు ఉన్నా, నాటి నుంచి కొందరు మహిళలు చేసిన త్యాగాలు కష్టాల వెనుక నేటి మహిళలకు ఈ స్వేఛ్చాప్రపంచంలో అనేక హక్కులు కలిగాయి అని చెప్పాలి… అలాంటి రోజుల్లో ఆమె మొక్కవోని దీక్షతో అనుకున్నది సాధించింది, అలాంటి ఓ భారత వనిత గురించి కచ్చితంగా నేడు మనం తెలుసుకోవాలి. ఇంతకి ఆమె ఎవరు ? ఆమె ఏం చేశారు ఇఫ్పుడు తెలుసుకుందాం.

Image result for ముత్తులక్ష్మి

ఆడపిల్లలను అడుగు బయట పెట్టనివ్వని కాలంలోనే ఆమె దేశంలో తొలి హౌజ్ సర్జన్. మహిళలకు ఓటు హక్కు లేని కాలంలోనే ఆమె దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యే. ఆమె ముత్తులక్ష్మి రెడ్డి. ఎ లేడీ ఆఫ్ మెనీఫస్ట్స్’ అనే పదానికి ముత్తులక్ష్మి రెడ్డి పర్యాయ పదంగా నిలుస్తారు. ఇవాళ(జులై-30,2019)ముత్తులక్ష్మి రెడ్డి 133వ జయంతి సందర్భంగా ఆమెను గుర్తుచేస్తూ గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఓ డూడుల్ను రూపొందించింది. ముత్తు లక్ష్మీ జయంతి సందర్భంగా ప్రతి ఏటా జులై-30న హాస్పిటల్ డే సెలబ్రేషన్స్ జరుపుతామని తమిళనాడు ప్రభుత్వం సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే.

Related image

జులై-30,1886న తమిళనాడులోని పుదుక్కోటై లో దేవదాసీ కుటుంబంలో ముత్తులక్ష్మీ జన్మించారు. నారాయణ సామి మరియు చంద్రమ్మాళ్ దంపతులకు ముత్తులక్ష్మీ జన్మించారు. బాల్యంలో అనేక కష్టాలను ఎదుర్కొంటూనే చదువుకున్నారు. తల్లి చంద్రమ్మాళ్ దేవదాసిగా ఎదుర్కొన్న కష్టాలను చూసిన ముత్తులక్ష్మిరెడ్డికి ఎలాగైనా ఈ దురాచారాన్ని రద్దు చేయాలని అనిపించింది. ఇది ఆమె ఆ దిశగా అడుగులు వేసేలా చేసింది. ఆడపిల్లల చదువులపై ఆంక్షలున్న ఆ కాలంలోనే ముత్తులక్ష్మి 13 ఏళ్ల వయసులోనే 10వ తరగతి పూర్తి చేశారు. ముత్తులక్ష్మి తొలిసారిగా బాయిస్ స్కూల్లో అడ్మిషన్ పొందిన ఘనత దక్కించుకున్నారు.

1912వ సంవత్సరంలో మద్రాస్ వైద్య కళాశాల నుండి వైద్య పట్టా అందుకున్నారు. కాలేజీ రోజుల్లో సరోజినాయుడు ఏర్పాటు చేసే సమావేశాలకు ముత్తులక్ష్మి రెడ్డి హాజరయ్యేవారు. అక్కడ మహిళల హక్కులు, వారి సమస్యలపై చర్చించేవారు. అలాగే.. గాంధీ, అనిబిసెంట్ల ప్రభావం ముత్తులక్ష్మిపై ఎక్కువగా ఉండేది. హౌజ్ సర్జన్గా కొంతకాలం చేశాక ఆమె ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్లారు. అదే సమయంలో విమెన్స్ ఇండియా అసోసియేషన్ (డబ్య్లూఐఏ) అభ్యర్థన మేరకు మళ్లీ భారత్ వచ్చి రాజకీయాల్లో చేరారు. శ్రీమతి సరోజిని నాయుడు గారి ప్రేరణతో స్త్రీల సామాజిక, ఆర్ఠిక, రాజకీయ ఉన్నతికై ఆమె పోరాడారు.

Related image

ముత్తులక్ష్మీ సేవలను మెచ్చి నాటి మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వము శాసన మండలి సభ్యురాలిగా 1927వ సంవత్సరంలో ఆమెను నియమించింది. ఆ విధంగా భారతదేశపు మొట్ట మొదటి మహిళా శాసన సభ్యురాలయ్యారు. శాసన మండలి సభ్యురాలిగా దేవదాసీ విధాన రద్దు, కనీస వివాహ వయసు పెంపు, నిర్బంధ వ్యభిచారం రద్దు, బాలల హక్కుల రక్షణ తదితర విషయాలపై పోరాడారు. 1931వ సంవత్సరం అఖిల భారత మహిళల సదస్సు (ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్) కు అధ్యక్షత వహించారు. ఈ సదస్సు తరపున మహిళల ఓటు హక్కుకై పోరాడారు.

ఈ క్రింద వీడియో చూడండి

గాంధీ ఉప్పు సత్యాగ్రహ పిలుపుతో శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్వాతంత్ర్య ఉద్యమంలోనూ ముత్తులక్ష్మి పాల్గొన్నారు. ముత్తులక్ష్మి రెడ్డి గొప్ప సంఘ సంస్కర్త, విద్యావేత్త, రాజకీయ వేత్త, స్త్రీ హక్కుల ఉద్యమశీలి. ఈమె మహిళాభ్యుదయం కొరకు “స్త్రీధర్మ” అనే పత్రికను నడిపారు. దీనిలో ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళం నాలుగు భాషలలో రచనలు ఉండేవి.

ప్రస్తుతం భారతదేశంలోనే అగ్రగామి కాన్సర్ వైద్యశాలగా వెలుగొందుతున్న అడయార్ కాన్సర్ వైద్యశాలను ముత్తులక్ష్మి రెడ్డి 1954వ సంవత్సరంలో ప్రారంభించారు. భారత ప్రభుత్వం ముత్తులక్ష్మిని 1956లో పద్మభూషన్ పురస్కారంతో గౌరవించింది. 1968 జూలై 22న ముత్తులక్ష్మిరెడ్డి కన్నుమూశారు.అలాంటి గొప్ప వనితని మనం స్మరించుకోవాల్సిందే.