పిల్లలు ఈ గేమ్ ఆడితే వెంటనే ఆపెయ్యండి ఆడితే వారి ప్రాణాలకే ప్రమాదం

410

ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఓ న‌ల‌బై సెక‌న్లు చేసే కిక్ ఛాలెంజ్ డ్యాన్స్ గురించి చ‌ర్చ జ‌రుగుతోంది..కికి ఛాలెంజ్ గురించి చర్చ నడుస్తుండగానే మరో ప్రాణాంతక గేమ్ సోషల్ మీడియా ద్వారా వేగంగా వ్యాపిస్తోంది. ఆ కొత్త గేమ్ పేరు మోమో ఛాలెంజ్. గతేడాది వందలాది మంది ప్రాణాలను బలిగొన్న ‘బ్లూవేల్ ఛాలెంజ్’ తరహాలోనే ఈ కొత్త గేమ్ కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ డెడ్లీ గేమ్ బారిన పడి ఇప్పటికే ఒకరిద్దరూ మ‌ర‌ణించారు.. యూకే, మెక్సికో, అర్జెంటీనా, అమెరికా, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాల్లో ఈ గేమ్ విస్తృతమవుతోంది. ప్రత్యేక లింక్‌ల ద్వారా వేగంగా వ్యాపిస్తున్న మోమో ఛాలెంజ్‌ భారత్‌లోనూ అడుగుపెట్టినట్లు అనుమానిస్తున్నారు.

మోమో గేమ్‌లో భాగంగా ‘బ్లూవేల్‌’ తరహాలో కొన్ని టాస్కులు చేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన లింక్‌ ‘మోమో’ ప్రొఫైల్‌ పిక్‌ ఉన్న ఓ గుర్తు తెలియని నంబర్‌ నుంచి వస్తుంది. వారిచ్చిన పనిని పూర్తి చేయాలని ఆదేశాలు అందుతాయి. ఆ పని పూర్తి చేసి మోమో గేమ్‌లో భాగంగా సోషల్ మీడియాలో దాన్ని అప్‌లోడ్‌ చేయాలి. ఈ ఆదేశాలను ధిక్కరిస్తే కొత్త కొత్త నంబర్ల నుంచి భయంకరమైన వీడియోలు పంపడం, బెదిరింపులు రావడం మొదలవుతాయి.భయంకరమైన శరీర ఆకృతి, పెద్ద పెద్ద కళ్లతో ఉన్న ఓ విచిత్ర ఆకారం పేరే ‘మోమో’. జపాన్‌కు చెందిన ఓ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ కంపెనీ ఈ ఆకారాన్ని రూపొందించింది. అయితే.. ఆ కంపెనీకీ ఈ గేమ్‌కు ఎలాంటి సంబంధం లేదు. కొంత మంది హ్యాకర్లు ఈ ఆకారాన్ని వాడుకొని మోమో ఛాలెంజ్ రూపొందించినట్లు అనుమానిస్తున్నారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, యూట్యూబ్‌ వేదికగా ఈ గేమ్‌ ఇప్పుడు వేగంగా వ్యాప్తి చెందుతోంది. అర్జెంటీనాలో ఓ చిన్నారి ఈ ప్రాణాంతక గేమ్‌కు బలవ్వడంతో దీని గురించి చర్చ మొదలైంది

అర్జెంటీనాకు చెందిన 12 ఏళ్ల ఓ బాలిక మోమో గేమ్ ఆడుతూ ఉరేసుకొని చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆమె వాట్సాప్‌లో ఇందుకు సంబంధించిన ఫొటోలు ఉండటం చూసి నిర్ధారణకు వచ్చారు. చనిపోవడానికి ముందు ఈ గేమ్‌ ఛాలెంజ్‌కు సంబంధించిన వీడియోను తన ఫోన్‌లో చిత్రీకరించినట్లు అక్కడి స్థానిక మీడియా రిపోర్టు చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

అసలు ఈ ‘మోమో’ను ఎక్కడ నుంచి ఆపరేట్‌ చేస్తున్నారు? దీని వెనక ఎవరున్నారు? అనే వివరాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. దీని వెనక ఉన్నవారు మాత్రం ఎక్కువగా టీనేజ్‌ యువతీయువకులనే లక్ష్యంగా చేసుకొని వలలో వేసుకుంటున్నారు. గేమ్‌లో ముందుగా.. మోమోను కాంటాక్ట్‌ అవ్వడానికి వీలుగా మనకు తెలియని ఓ నంబర్‌ ఇచ్చి.. మెసేజ్‌ పంపుతూ చాట్‌ చేయాలంటూ ఛాలెంజ్‌ విసురుతారు. దానికి స్పందించడం మొదలుపెడితే పలు పనులు పూర్తి చేయాలంటూ వరసగా టాస్కులు వస్తాయి. వీటిలో ఎక్కువగా వారికి వారే హాని చేసుకునేవే ఉంటాయి.మోమో సవాల్ అందుకొని ఛాలెంజ్‌ పూర్తి చేయని వాళ్లకు బెదిరింపు సందేశాలు వస్తున్నాయి… భయంక‌ర చిత్రాలు, హింసాత్మక సందేశాలతో మెసేజ్‌లు పెడుతున్నారు. ఇప్పటివరకూ ఇలాంటి మెసేజ్‌లు ఓ ఏడు నంబర్ల నుంచి వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అవి జపాన్, లాటిన్‌ అమెరికా దేశాలకు చెందినవని తేలింది.

తెలియని నంబర్ల నుంచి మెసేజ్‌‌లు వస్తే స్పందిచకూడదు. బలవంతం చేసినా.. నో అని గట్టిగా చెప్పాలి.
కొత్త నంబర్లకు సందేశాలు పంపొద్దు.
తోటి స్నేహితులు చేస్తున్నారు కదా అని గుడ్డిగా వారి బాటలో వెళ్లకూడదు.
తేడా అనిపిస్తే వెంటనే తల్లిదండ్రులకు చెప్పాలి. దాయడం సరికాదు.
పని ఒత్తిడిలో పడి పిల్లలను అశ్రద్ధ చేయొద్దు.
తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడూ గమనించాలి.
పిల్లలు ఎక్కువగా ఫోన్‌తో గడపడం, సోషల్ మీడియాలోనే ఎక్కువసేపు గడపడం చేస్తుంటే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలి.
సోషల్ మీడియాలో పిల్లల పోస్టులపై ఓ కన్నేసి ఉంచాలి. వారు ఏమేం పోస్టులు చేస్తున్నారో జాగ్రత్తగా గమనించాలి.