అమ్మవారి ముక్కుపుడకను తాకిన వరద నీరు.

299

మొన్నటి వరకూ వాన జాడ లేని రెండు తెలుగు రాష్ట్రాలు ఇఫ్పుడు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. వరద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గ్రామాలను ముంచెత్తుతోంది. పోలవరం నిర్వాసితులు ముందు నుంచి అనుకుంటున్నట్టే కాఫర్‌ డ్యామ్‌ తమను నట్టేట ముంచిందని లబోదిబోమంటున్నారు. దేవీపట్నంలో వరద అర్ధరాత్రి నుంచి పెరగడంతో అనేక గ్రామాలు నీటి మునిగాయి. గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ఎటూ పోలేని పరిస్థితి తలెత్తింది. చేతికందిన సామాన్లు సద్దుకుని, ప్రాణాలు అరచేత పెట్టుకుని పడవల కోసం ఎదురుచూశారు. ఒక్కసారిగా వచ్చిన వరద ఉధృతికి పిల్లలను వెంటబెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు నానా అవస్థలూ పడ్డారు.

Image result for heavy rains

విలీన మండలాల్లో గోదావరి, శబరి పొంగి ప్రహించడంతో జనజీవనం స్తంభించింది. చత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి, తెలంగాణలోని తాలిపేరు ద్వారా వస్తున్న వరద నీటితో విలీన మండలాలకు ఎగువన ఉన్న భద్రాచలంలో గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహిస్తోంది. రాత్రి ఏడు గంటలకు భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 46.6 అడుగులు ఉండగా 50 అడుగుల వరకు చేరే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. వరద వల్ల కూనవరం, ఎటపాక, వీఆర్‌ పురం, చింతూరు మండలాల్లోని సుమారు 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని చిడుమూరు వద్ద జాతీయ రహదారిపై వరద నీరు చేరడంతో ఆంధ్రా నుంచి చత్తీస్‌గఢ్‌ ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సమయంలో గండిపోశమ్మ ఆలయంలో భారీగా చేరిన వరద నీరు, నేడు ఏకంగా అమ్మవారి ముక్కుపుడకను తాకింది. దీంతో భక్తులు భయాందోళనలో ఉన్నారు. అమ్మవారి ముక్కుపుడకను తాకేలా గోదావరి ప్రవహించలేదని.. ఇది ఎలాంటి అపశకునం అవుతుందా అని గ్రామస్తులు భయపడుతున్నారు. దేవీపట్నంలో భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. ఓ పక్క వరద మరో పక్క భారీ వర్షం కుండపోతతో జనాలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు.

అలాగే భద్రాచలం వద్ద 41 అడుగులు ఉన్న వరద ఈ తెల్లవారుజాముకు మొదటి ప్రమాదహెచ్చరిక చేసే సమయానికి 43 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి వరద క్రమేపీ పెరుగూతూ వచ్చి సాయంత్రం 7 గంటలకు 46.4 అడుగులు నమోదైంది. రాత్రికి 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఇప్పటికే ఎటపాక మండలంలోని మురుమూరు వద్ద రహదారిపైకి వరదనీరు చేరడంతో భద్రాచలం నుంచి కూనవరం వెళ్లేందుకు సాయంత్రం నుంచే రహదారి సౌకర్యం నిలిచిపోయింది. వీరాయిగూడెం, బొట్లకుంట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Image result for heavy rains

డ్రెయిన్ల నుంచి నీరు గోదావరిలోకి దిగే చోట అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌లు, వాటి షటర్లు దెబ్బతినడంతో ముంపునీరు ముంచెత్తుతోందని రైతులు వాపోతున్నారు. తూర్పుడెల్టాలో తాళ్లరేవు, కాజులూరు, కె.గంగవరం, రామచంద్రపురం, కరప, మధ్య డెల్టాలో ముమ్మిడివరం, అమలాపురం, అల్లవరం, కాట్రేనికోన, ఐ.పోలవరం, మామిడికుదురు, అయినవిల్లి, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో ముంపునీరు డ్రైన్ల ద్వారా దిగే అవకాశం లేకుండా పోతోంది.తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 11.5 మిల్లీ మీటర్ల సగటున వర్షం కురిసింది. దేవీపట్నంలో పోశమ్మకు వరదనీరు తాకడంతో గోదారమ్మకు శాంతి పూజలు చేస్తున్నారు అక్కడ ప్రజలు.