కేరళ వరదల్లో అద్భుతం.. నిండు గర్భిణీ ఎలా డెలివరీ అయిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు

467

కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే 324 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు సజిత జబిల్. ఇప్పుడు సజిత జబిల్ ఒక్కరి గురించే ఎందుకంటే… ఆమె నిండు గర్భిణీ. అలువాకు సమీపంలో ఉండే చెంగమనడ్ ప్రాంతంలో నివాసముంటోంది. వరదలతో ఈ ప్రాంతమంతా కొట్టుకుపోయింది. సజిత మాత్రం తన ఇంటిపైకి ఎక్కి ఎవరైనా సహాయం చేయకపోతారా అని ఆశగా ఎదురుచూస్తోంది. నిండు గర్భణి కావడంతో నడవలేని పరిస్థితి నెలకొంది.

Kerala woman rescued by navy delivers baby boy

అంతలోనే నేవీ హెలికాఫ్టర్ కనిపించింది. ఆమెలో సగం ప్రాణం తిరిగి వచ్చింది.సజిత పరిస్థితిని తెలుసుకున్న నేవీ అధికారులు ఒక డాక్టరును ఇంటి పైకి దించారు. పరీక్షించిన డాక్టరు ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలించాల్సిందిగా తెలిపారు. వెంటనే సజిత బెల్టులతో జాగ్రత్తగా కట్టి హెలికాఫ్టర్‌ ఎక్కించారు. కొంచెం రిస్క్ అయినప్పటికీ ఇక వేరే ఛాన్స్ లేకపోవడంతో నేవీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమెను కొచ్చిలోని సంజీవని హాస్పిటల్‌కు నేరుగా హెలికాఫ్టర్‌లోనే తీసుకెళ్లారు. హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన అరగంటకే సజిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

Kerala woman rescued by navy delivers baby boy

ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారంటూ చెబుతూ నేవీ వారి ఫోటోలను ట్వీట్ చేసింది.ఇదిలా ఉంటే అలువ అనే ప్రాంతం ఎర్నాకుళం జిల్లాలో ఉంది. ఈ ప్రాంతం పెరియార్ నది తీరంలో ఉండటంతో అత్యంత భారీ నష్టం ఇక్కడే జరిగింది. ఈ భారీ వరదలకు రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. మెట్రో స్టేషన్ పరిసర ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో మెట్రో సర్వీసులను రద్దు చేశారు అధికారులు.

కొచ్చి ఎయిర్‌పోర్టును ఈనెల 26 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.ఇంకా వేలమంది ప్రజలు చెట్లు, ఇంటి పైకప్పులపై ఉండి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొన్ని సహాయ శిబిరాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. అయితే సహాయకచర్యలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఎర్నాకులం,పతనంతిట్ట జిల్లాలనుంచి 3వేలకు పైగా ప్రజలను సహాయశిబిరాలకు అధికారులు తరలించారు.