కేరళలో రెడ్ అలర్ట్.. ఆరు జిల్లాల్లో వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థం..

120

కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థమైంది. ఆరు జిల్లాల్లో రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఇడుక్కి, కోజికోడ్, వయనాడ్, మలప్పురం, కన్నూర్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మణిమల జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. నదులు ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తుండటంతో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయారు. కొల్లాంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు.

Image result for heavy rains

రుతుపనాల కారణంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాసర్గాడ్ జిల్లాలో అత్యధికంగా 31సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. శబరిమలలోని అటవీ ప్రాంతంలోనూ భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. పంబానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులను అధికారులు నిలిపివేశారు. డ్యాం గేట్లు ఎత్తే అవకాశం ఉండటంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Image result for heavy rains

భారీ వర్షాలు పడే అవకాశమున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. వరద కారణంగా తిరువనంతపురంలోని మత్స్యకారుల ఇళ్లు ధ్వంసమయ్యాయి. శంఖుముఖం బీచ్లో టూరిస్టుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఇంత భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నా కేరళలో సాధారణం కన్నా 36శాతం వర్షపాతం తక్కువగా నమోదైనట్లు అధికారులు చెప్పారు. వాయనాడ్ జిల్లాలో 57శాతం అత్యల్ప వర్షపాతం నమోదైంది.

ఈ క్రింది వీడియో ని చూడండి

ఇదిలా ఉంటే నేపాల్ నుంచి వస్తున్న వరద కారణంగా ఈశాన్య రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. వరదల కారణంగా ఇప్పటి వరకు 15 మంది మరణించారు. లక్షలాది మంది గూడు కోల్పోయారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. బీహార్లోనూ భారీ వర్షాలకు పరిస్థితులు దారుణంగా మారాయి. వర్షాలు, వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, దీనిని జాతీయ విపత్తుగా గుర్తించాలని బిహార్, అసోం ప్రభుత్వాలు కేంద్రాన్ని విఙ్ఞప్తి చేస్తున్నాయి.