భారీ విమాన ప్ర‌మాదం భార‌త‌పైల‌ట్ తో స‌హా 169 మంది మృతి షాక్ లో ప్ర‌ధాని

326

ఇథియోపియా, కొలంబియాలో ఆదివారం ఉదయం రెండు విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో 169 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా నుంచి 157 మంది ప్రయాణీకులతో కెన్యా రాజధాని నైరోబీకి బయలుదేరిన బోయింగ్ 737 విమానం మార్గమధ్యలో కూలిపోయింది. ఈ ప్రమాదం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.44 గంటలకు చోటుచేసుకుంది. అడిస్ అబాబాకు వాయవ్య దిశగా 62 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిషోఫ్టు పట్టణానికి సమీపంలో విమానం కూలిపోయినట్టు గుర్తించారు. ప్రమాదం సమయానికి విమానంలో 157 మంది ఉండగా, వీరిలో 149 మంది ప్రయాణికులు, 8 మంది క్రూ సిబ్బంది ఉన్నారు అని తెలుస్తోంది.

Related image

ఈ ప్రమాదంపై ఇథియోపియా ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఇథియోపియా పీఎంఓ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రమాదానికి గురైన విమానంలోని ప్రయాణీకుల గురించి ఇప్పటి వరకూ ఎలాంటి ఆచూకీ లభించలేదని అన్నారు. ప్రాణాలతో ఉన్న విషయం గానీ, చనిపోయిన విషయం గురించి ఎలాంటి సమాచారం లేదని తెలిపింది.

Related image

అటు, కొలంబియాలో విమానం కూలి 12 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో తరారీయా, డోరిస్‌ గ్రామాల మేయర్‌, ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. డగ్లస్‌ డీసీ-3 విమానం శాన్‌జోస్‌ డెల్‌ గౌవైరే- విల్లావిసెన్సియా పట్టణాల మధ్య అకస్మాత్తుగా కూలిపోయినట్టు తెలియజేశారు. విమానం కూలిన వెంటనే మంటలు వ్యాపించాయని, ఇంజిన్‌ వైఫల్యమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. అయితే, కొలంబియా పౌర విమానయాన సంస్థ మాత్రం కారణాలను వెల్లడించలేదు. విమానం ప్రయాణించిన సమయంలో వాతావరణం కూడా అనుకూలంగా ఉందని అధికారులు వివరించారు. విమాన ప్రమాదంలో ఎవరూ బతికి బయటపడలేదని తెలిపారు.

ఈ క్రింది వీడియో చూడండి 

గతేడాది అక్టోబరులో ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి 189 మంది ప్రయాణికులు, సిబ్బందితో బయల్దేరిన లయర్‌ ఎయిర్‌ విమానం టేకాఫ్‌ అయిన కొద్ది క్షణాలకే కుప్పకూలిన విషయం తెలిసిందే. టేకాఫ్‌ అయిన 13 నిమిషాలకు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌తో సంబంధాలు కోల్పోయిన ఆ విమానం జావా సముద్రంలో కుప్పకూలిపోయింది. సముద్రంలో కూలిపోయిన ఈ విమానం ఆ తర్వాత 114 అడుగుల లోతుకు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో భారత్‌కు చెందిన భవ్యే సునేజా అనే పైలట్ ప్రాణాలు కోల్పోయారు.