రంగస్థల నటుడు హఠాన్మరణం.. షాక్ లో సినీ ఇండస్ట్రీ

189

సినీ రంగంలో వరుస విషాద ఛాయలు అలుముకుంటున్నాయి.సినీ ప్రముఖులు వరుసగా ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు.ఇప్పుడు మరొక ప్రముఖ నటుడు చనిపోయాడు.మరి ఆయనెవరో ఎలా చనిపోయాడా తెలుసుకుందామా.

‘స్ఫూర్తి’ సాంస్కృతిక సేవా సంస్థ వ్యవస్థాపకుడు, రంగస్థల, సినీ నటుడు, దర్శకుడు డాక్టర్‌ చుండి మధుసూదన్‌(48) ఇకలేరు. సోమవారం ఉదయం హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని తన సోదరి నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. నెల్లూరు జిల్లా కావలిలో పుట్టిపెరిగిన మధుసూదన్‌.. నాటక రంగంపై మక్కువతో 18వ ఏటనే హైదరాబాద్‌ వచ్చారు. ప్రముఖ నటుడు, నట శిక్షకుడు డీఎస్‌ దీక్షితులు వద్ద శిష్యుడిగా చేరి… తెలుగు విశ్వవిద్యాలయంలో రంగస్థల, జానపద కళలపై పీహెచ్‌డీ పూర్తి చేశారు. జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ సినారె ఆశీస్సులతో ‘స్ఫూర్తి’ సాంస్కృతిక సేవా సంస్థను మధు స్థాపించారు.సంస్థ ఆధ్వర్యంలో నాటకరంగానికి విశేష కృషి చేశారు. వేటూరి సుందరరామ్మూర్తి, గిడుగు వెంకటరామ్మూర్తి పంతులు, దుర్గాభాయ్‌ దేశ్‌ముఖ్‌ వంటి ప్రముఖుల జయంతి ఉత్సవాలను హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా నిర్వహించారు. నాటక రంగమే జీవితంగా బ్రహ్మచారిగా గడిపిన మధును అందరూ ‘మెగా’ మధు అని పిలిచేవారు.

మెగాస్టార్‌పై అభిమానంతో హైదరాబాద్‌ బాట పట్టిన ఆయన ఎందరో యువ నటులకు, దర్శకులకు స్ఫూర్తిగా నిలిచారు. ప్రస్తుతం సినీ పరిశ్రమ లో ఉన్న కొందరు యువ సినీ హీరోలకు డీఎస్‌ దీక్షితులు సారథ్యంలో ఆయన శిక్షణ కూడా ఇచ్చారు. రంగస్థల నటుడిగా మధు వేసిన వేటూరి ప్రభాకరశాస్ర్తి పాత్ర, సుబ్బయ్యశెట్టి పాత్రలు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.పలు సినిమాల్లోను నటుడిగాను ఆయన కనిపించారు. ఓ సినిమాకు దర్శకత్వం వహించే పనిలో ఉండగా హఠాన్మరణం చెందారు. మధు మరణం నాటకరంగానికి తీరని లోటని నట శిక్షకుడు డీఎస్‌ దీక్షితులు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను’ అని అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయ అధ్యాపక, విద్యార్థి బృందం కూడా ఓ ప్రకటనలో సంతాపం తెలిపింది. మధుసూదన్‌ అంత్యక్రియలు మంగళవారం ఉదయం 10 గంటలకు పంజాగుట్ట శ్మశానవాటికలో నిర్వహించనున్నట్టు ఆయన బావ మోహన్‌ తెలిపారు.పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి నివాళి అర్పించారు.మనం కూడా కామెంట్ రూపంలో ఆయనకు నివాళి అర్పిద్దాం.