15 రోజుల వ్యవధి లోనే తండ్రి కొడుకులు మృతి..కారణం తెలిస్తే కన్నీళ్ళు ఆగవు

397

విధి ఆడిన వింత నాటకంలో ఆ కుటుంబం బలైపోయింది. పక్షం రోజుల్లో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి కొడుకులు ఇద్దరూ మృతిచెందటంతో ఆ కుటుంబంలోని కన్నీటి పడవని ఆపే నాథుడే కరువైపోయాడు. కుటుంబానికి పెద్దదిక్కుని కోల్పోయిన బాధలో ఉన్న ఆ కుటుంబానికి మరో బాధ వచ్చిపడింది.

ఆ కుటుంబానికి తండ్రి తర్వాత పెద్దదిక్కుగా ఉండవల్సిన, చేతికి అందివచ్చిన కుమారుడు మృతి చెందటంతో ఆ కన్నతల్లి ఆవేదన అరణ్యరోదనగా మిగిపోయింది. కట్టుకున్నవాడు కట్టేలమీదకు వెళ్లి పక్షం రోజులు గడవక ముందే నవమాసాలు మోసి కడుపుచించుకు పుట్టిన బిడ్డ చేతికందివచ్చాడనే ఆనందం తీరక ముందే కట్టేలపై కాలుతుంటే ఆ దేహాన్ని చూచిన ఆ కన్నతల్లి హృదయం చలించుకు పోయింది. ఈ హృదయవిధారక ఘటన టెక్కలిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే… స్థానిక ఆర్టీసీ గ్యారేజ్‌కు ఎదురుగా ఉన్న వీధిలో నివశిస్తున్న గురువెల్లి వెంకటరమణ టెలీకాంలో విధులు నిర్వర్తిస్తూ(28.10.18) 15 రోజుల క్రితం పలాస రైల్వేస్టేషన్‌ వద్ద ట్రైన్‌ ఢీకొని మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుమారుడు గురుబెల్లి శ్రీనివాస్‌ హైదరాబాద్‌ నుంచి టెక్కలి చేరుకొని తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. అప్పటి నుంచి మానసికంగా ఆందోళనకు గురవుతున్న శ్రీనివాస్‌కు తండ్రి మృతి మానసికంగా కృంగదీసింది. ఈ క్రమంలోనే శ్రీనివాస్‌ ఆరోగ్యం క్షీనించడంతో స్థానిక వైద్యులను సంప్రదించినప్పటికీ పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళం తరలించారు. వైద్యం పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. పక్షం రోజుల వ్యవధిలోనే కుటుంబానికి మగదిక్కు లేకుండా పోవడంతో తల్లి ఉషారాణి, కుమార్తె పావని, బంధువులు ఆవేదన వర్ణనాతీతం. మృతుడు ఇంజినీరింగ్‌ పూర్తిచేసుకొని హైదరాబాద్‌లో ఉద్యోగం కోసం కోచింగ్‌ తీసుకుంటున్నాడు. తండ్రి మృతిచెందాడన్న వార్త తెలుసుకొని వచ్చి తను కూడా మృత్యువడిలోకి తండ్రికి తోడుగా వెళ్లిపోయాడు.