గణేష్ నిమజ్జనంలో ఈ యువతీ చేసిన పనికి అందరూ హ్యాట్సఫ్ చెప్తున్నారు

393

హైద‌రాబాద్ లో గ‌ణేష్ నిమ‌జ్జ‌నం అంగ‌రంగ వైభ‌వంగా ఉంతో శోభీయ‌మానంగా జ‌రిగింది.. తొమ్మిదిరోజుల పాటు భ‌క్తుల పూజ‌లు అందుకున్న గ‌ణ‌నాధుడు గంగ‌మ్మ‌చెంత‌కు చేరాడు, ట్యాంక్ బండ్ లో వేలాది విగ్రహాలు నిమ‌జ్జ‌నం అయ్యాయి.గణేశ్‌ నిమజ్జనం చేస్తుంటే ఏమరపాటులో ఏదైనా ప్రమాదం జరిగితే నీటిలో పడాల్సిందే..! ఈత వచ్చిన్నవారైతే తాడు అందిస్తే బయటకు వచ్చే అవకాశముంది. మరీ ఈత రానివాళ్ల పరిస్థితేంటి..? అలాంటి వారిని రక్షించాలంటే గజఈతగాళ్లే పెద్ద దిక్కు. సాధారణంగా గజ ఈతగాళ్లంటే అందరూ పురుషులే ఉంటారని అందరూ భావిస్తారు. కానీ గజఈతగాళ్లలో మహిళలు సైతం ఉంటారు. నీటిలో పిల్లలు ఎవరు పడిపోయినా వారిని ఓ యువతి కాపాడుతోంది. ఈ విషయంలో పురుషులకు దీటుగా పనిచేస్తూ అందరి మన్ననలు అందుకుంటోంది. నదులు, చెరువుల్లో ఈదగల్గడమే గాకుండా ఎవరినైనా రక్షించే సామర్థ్యం కలిగిన ఆ యువతి హైదరాబాదీ కావడం విశేషం. నగరంలో వారం రోజులుగా జరుగుతున్న నిమజ్జన వేడుకల్లో విధులు నిర్వహిస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

నగరంలోని చాదర్‌ఘాట్‌కు చెందిన మద్దెల ప్రభాకర్‌ దివ్య ప్రస్తుతం నారాయణగూడలోని నవ చైతన్య డిగ్రీ కాలేజీలో బీకామ్‌ ఫైనలియర్‌ చదువుతోంది. అడ్వెంచర్‌ స్విమ్మింగ్‌లో ఆరితేరిన దివ్యకు నీటిలో ఎన్నో ఫీట్లను చేయగలిగే సామర్థ్యం ఉంది. దీంతో పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అడ్వెంచర్‌ స్విమ్మింగ్‌ పోటీల్లో పాల్గొని అనేక పతకాలు, బహుమతులు గెలుచుకుంది. ప్రీ వరల్డ్‌క్‌పలో వాటర్‌ పాలింగ్‌ డ్రాపింగ్‌ 280 అడుగుల విభాగంలో పాల్గొని పతకాన్ని కైవసం చేసుకుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లోనూ శిక్షణ తీసుకున్నారు. అడ్వెంచర్‌ కోచ్‌ శ్రీనివాస్‌ నేతృత్వంలో శిక్షణ తీసుకుంటున్న ఆమె గజఈతగాళ్ల స్థాయికి ఎదిగి హుస్సేన్‌సాగర్‌లో జరుగుతున్న నిమజ్జన వేడుకల్లో జీహెచ్‌ఎంసీ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ తరపున స్వచ్ఛందంగా విధులు నిర్వహించేందుకు ముందుకొచ్చింది.

హుస్సేన్‌సాగర్‌లో ప్రతీ ఏడాది నిర్వహించే నిమజ్జన వేడుకల సందర్భంగా నీటిలో ఎవరైనా పడిపోతే రక్షించేందుకు గజ ఈతగాళ్లను జీహెచ్‌ఎంసీ డిజాస్టార్‌ మేనేజ్‌మెంట్‌ ఆధ్వర్యంలో ఏర్పా టు చేశారు. 120మందితో ఏర్పాటు చేసిన గజ ఈతగాళ్ల టీంల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందినవారితో పాటు ఏపీ, ఒడిశా, ఛత్తీస్ ఘడ్‌ తదితర రాష్ట్రాలకు చెందినవారు సైతం ఉన్నారు. అయితే 120 మంది గజ ఈతగాళ్లలో 119మంది మగవారు కాగా, నగరానికి చెందిన మద్దెల ప్రభాకర్‌ దివ్య మాత్రమే మహిళ కావడం విశేషం.

దివ్య చిన్నతనంలో తండ్రి చనిపోగా తల్లి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయాగా పనిచేస్తూ పిల్లలను చదివిస్తోంది. దివ్యకు ఇద్దరు అక్కలు. తల్లి తన ముగ్గురు కూతుళ్లను ఉన్నతంగానే చదివించింది. అయితే తనను కూతురులా గాకుండా కొడుకులా తన తల్లి పెంచిందని, పలు క్రీడల్లో తనకు ఇష్టముంటే తన తల్లే ప్రోత్సహించిందని దివ్య తెలిపింది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన 120మంది గజ ఈతగాళ్లలో తానొక్కదాన్నే మహిళ కావడం గర్వంగా ఉందని దివ్య తెలిపింది. ఎనిమిదో తరగతి నుంచే ఎన్‌సీసీలో పాల్గొంటూ ఇప్పటికీ అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నానని, అడ్వెంచర్‌ స్విమ్మింగ్‌తో పాటు క్రికెట్‌, క్యాచ్‌బాల్‌ ఆటల్లోనూ జాతీయస్థాయిలో రాణిస్తున్నట్లు చెప్పారు. అయితే హుస్సేన్‌సాగర్‌ నెక్లెస్‌ రోడ్‌లో విధి నిర్వహణలో ఉన్న దివ్యను విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిజాస్టార్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ కాంపాటి అభినందించారు. ఆమెని చూసి నిమ‌జ్జ‌నానికి వ‌చ్చిన వారు కూడా ఆనందించారు ఆమె తెలివితేటలు దైర్యం చాలా ఉన్నాయి అని ఆమెని అభినందించారు.