తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది, ఇక ఎన్నికలగంట మోగింది అనే చెప్పాలి. ఇక ఈసీ కూడా ఎన్నికల షెడ్యూల్ పై కీలక ప్రకటన చేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను డిసెంబర్ 7న నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు విడుదల చేయనున్నట్లు పేర్కొంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ శాసనసభల ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మిజోరం, మధ్యప్రదేశ్‌లలో నవంబర్ 28న ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశలలో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించగా.. నవంబర్ 12న తొలి విడత, నవంబర్ 20న రెండో విడత పోలింగ్ జరుగుతుంది.
తెలంగాణలో ఇదివరకే ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఈ నాలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓం ప్రకాష్ రావత్ తెలిపారు. డిసెంబర్ 15 నాటికి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు రావత్ ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ రద్దయిన ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే తెలంగాణ ఓటర్ల తుది జాబితాను 8న ప్రకటించాల్సి ఉందన్నారు రావత్. అయితే హైకోర్టుకు తుది జాబితా సమర్పించిన తర్వాత, 12న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నట్లు వివరించారు.
తెలంగాణ, రాజస్థాన్‌లలో డిసెంబర్ 7న ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్ల దాఖలకు తుది గడువు నవంబర్ 20 అని చెప్పారు , అలాగే నామినేషన్ల పరిశీలన నవంబర్ 20న జరుగుతుంది, ఇక నామినేషన్ల ఉప సంహరణకు తుది గడువు నవంబర్ 22 అని రావత్ వెల్లడించారు. ఇక తెలంగాణలో ప్రజాఆశీర్వాధ సభలు నిర్వహిస్తూ కేసీఆర్ సభలతో ముందుకు వెళుతున్నారు. ఇక జోగులాంబ ఆలయంలో పూజలు మొదలు పెట్టి కాంగ్రెస్ కూడా ఎన్నికల పోరును మొదలు పెట్టింది.. డిసెంబర్ 11న ఎవరిది గెలుపు అనేది తేలిపోనుంది.