అమ్మాయిలు జాగ్రత్త : ఒక క్లిక్ తో ఫోటో లోని అమ్మాయిలు నగ్నంగా చూపించే యాప్

417

ఏదైనా అప్లికేషన్ లేదా ఏదైనా యాప్ మార్కెట్ లోకి వచ్చిందంటే, దాని వలన ఉపయోగం ఉండాలి కానీ ఇప్పుడు వస్తున్న యాప్స్ గాని వేరే ఏ ఇతర సోషల్ మీడియా అప్లికేషన్స్ గాని యువతను పాడుచేసే విధంగా ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన కొన్ని కొత్త రకాల గేమ్స్ వలన పిల్లలు ఎంత పాడవుతున్నారో మనం కళ్లారా చూస్తూనే ఉన్నాం. అది సరిపోదు అన్నట్టు ఇప్పుడు మరొక నీచ యాప్ మార్కెట్ లోకి వచ్చింది. పోర్న్ వెబ్‌సైట్లు యువతను పాడుచేస్తున్నాయంటూ సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతుంటే ఓ అప్లికేషన్ సంస్థ మరింత హేయమైన యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘డీప్ న్యూడ్’ అనే ఈ యాప్‌తో ఫొటోల్లో ఉండే మహిళలను నగ్నంగా మార్చేస్తోంది. ఈ యాప్ మీద సర్వత్రా నిరసనలు వ్యక్తం కావడంతో ఆ సంస్థ ఆన్‌లైన్ నుంచి తొలగించింది.

యూరప్‌లోని ఎస్టోనియాకు చెందిన ఈ సంస్థ డీప్ న్యూడ్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఏఐ టెక్నాలజీ ద్వారా దుస్తులను తొలగించే ఈ యాప్‌ను భారీ సంఖ్యలో నెటిజనులు డౌన్లోడ్ చేసుకున్నారు. అంతేగాక, అమ్మాయిల ఫొటోలను విచ్చలవిడిగా నగ్నంగా మార్చేస్తూ హల్‌చల్ చేశారు. దీంతో ఏది అసలో, ఏది ఫేకో తెలియక తీవ్ర రభస నెలకొంది. ముఖ్యంగా హాలీవుడ్ హీరోయిన్ల ఫొటోలను ఈ యాప్‌‌ సాయంతో నగ్నంగా మార్చేసి ఫేక్ ఫొటోలను ట్రెండ్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద రాద్దాంతమే జరిగింది. ఈ యాప్‌పై ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా గళమెత్తింది. ఇలాంటి యాప్‌ల వల్ల రివేంజ్ పోర్న్‌లు పెరుగుతాయని, దీన్ని వెంటనే తొలగించాలంటూ డిమాండు చేసింది. దీంతో నిర్వాహకులు తోక ముడవక తప్పలేదు. యాప్‌ను గూగుల్ ప్లే తదితర యాప్ స్టోర్ల నుంచి తొలగించారు. అయితే, ఈ యాప్‌ను తాము కేవలం వినోదం కోసమే తయారు చేశామని తయారీదారులు చెప్పడం గమనార్హం. ఈ యాప్‌ను ఇప్పటివరకు 5 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారని పేర్కొంది. దీన్ని ఇంతమంది డౌన్లోడ్ చేసుకుంటారని ఊహించలేదని తెలిపారు.

మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు తయారు చేయడాన్ని నేరంగా పరిగణిస్తున్న ఈ రోజుల్లో ఆ అప్లికేషన్ సంస్థ ఇంతగా ఎలా దిగజారి ప్రవర్తించిందని అంతా తిట్టిపోస్తున్నారు. ఇలాంటి యాప్‌ల వల్ల మహిళల్లో అభద్రతా భావం ఏర్పడుతుందని, వేదింపులు పెరుగుతాయంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పటికీ ఈ యాప్‌కు సంబంధించిన కొన్ని వెర్షన్లు ఆన్‌లైన్లో ఉన్నాయని, వెంటనే వాటిని కూడా తొలగించాలని కోరుతున్నారు. యాప్‌ స్టోర్ సంస్థలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఇలాంటి చట్టవిరుద్ధమైన యాప్‌లపై నిషేదం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి యాప్‌లు వినియోగించడం చట్టరీత్యా నేరం. ఇవి చెలామణిలోకి వస్తే మహిళలు బయట ప్రపంచంలో స్వేచ్ఛగా తిరగాలంటేనే భయపడే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు సైతం ఇలాంటి యాప్‌లను నిషేదించేందుకు చర్యలు తీసుకోవాలని, లేకపోతే అసాంఘిక శక్తులు వీటిని దుర్వినియోగం చేస్తాయని పలు సామాజిక సంస్థలు కోరుతున్నాయి. కాబట్టి.. మీరు కూడా ఇలాంటి యాప్‌లకు దూరంగా ఉండండి. ఈ విషయాన్ని మీ స్నేహితులతోనూ షేర్ చేసుకుని అప్రమత్తం చేయండి. మరి ఈ యాప్ గురించి అలాగే యువతను పాడుచేస్తున్న ఇలాంటి యాప్స్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.