ఏపీ మంత్రి ఇంట్లో తీవ్ర విషాదం!

325

రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు సోదరుడు ప్రముఖ పారిశ్రామికవేత్త శిద్దా వెంకట్రావు(83) అనారోగ్యంతో మృతి చెందారు. చెన్నైలోని అపోలో అస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం అర్ధరాత్రి మృతి చెందారు. సోమవారం సాయంత్రం ఒంగోలులో అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రి శిద్దాకు అన్న అయిన ఆయన గ్రానైట్‌ రంగంలో పేరుమోసిన పారిశ్రామికవేత్త. కృష్ణసాయి గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ అధినేత శిద్దా వెంకటేశ్వరరావుతోపాటు ఆ కంపెనీలో భాగస్వాములుగా ఉండడమే గాక ఇతరత్రా వ్యాపార రంగంలో ప్రముఖులుగా ఉన్న శిద్దా హనుమంతరావు, సూర్యప్రకాశరావులకు ఆయన తండ్రి.

కొంతకాలం నుంచి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం రాత్రి మృతి చెందగా సోమవారం ఉదయానికి ఆయన పార్థీవ దేహాన్ని ఒంగోలు తీసుకొచ్చి లాయరుపేటలోని వెంకటేశ్వరరావు స్వగృహం వద్ద ఉంచారు. అధికార, అనధికార ప్రముఖులతోపాటు చీమకుర్తి ప్రాంతానికి చెందిన ప్రజలు వారి కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పార్థీవదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

సోమవారం సాయంత్రం ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. పలువురు ప్రముఖులు మంత్రి శిద్దాను, దివంగత వెంకటరావు కుమారులను కలిసి సంతాపం తెలియజేశారు. శాసనమండలి సభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి, కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ స్వామి, సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే బిఎన్‌ విజయకుమార్‌, జిల్లా కలెక్టర్‌ వాడరేవు వినయ్‌చంద్‌, జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు, అటవీఅభివృద్ధి సంస్థ చైర్మన్‌ దివి శివరాం, నెడ్‌క్యాప్‌ చైర్మన్‌ ఎరిక్షన్‌ బాబు, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ నూకసాని బాలాజీ, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట సుబ్బయ్య, ఒంగోలు, కందుకూరు ఆర్డీవో పెంచల కిషోర్‌, కేఎస్‌ రామారావు, వివిధ శాఖల అధికారులు డాక్టర్‌ బీ రవి, సింగయ్య, దర్శి, గుడూరు డీఎస్పీలు నాగేశ్వరరావు, రాంబాబు తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శిద్దా కుటుంబానికి చెందిన శిద్దా వెంకటేశ్వర్లు, శిద్దా కృష్ణారావు, శిద్దా సుబ్బారావు, శిద్దా పాండురంగారావు, శిద్దా వెంకటేశ్వరరావు, శిద్దా సూర్యప్రకాశరావు, శిద్దా సుధీర్‌ తదితరులు వెంకట్రావు మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.