ఒడిశాలో ఘోరం: వంతెన పైనుంచి నదిలో పడిన బస్సు 12 మంది మృతి ,42 మందికి గాయాలు

302

ఒడిశా రాష్ట్రం కటక్‌ నగరంలో మంగళవారం మహానది వంతెన పైనుంచి ప్రైవేటు బస్సు నదిలో పడిపోయింది. పన్నెండు మంది మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్‌కు రెండు కాళ్లూ విరిగిపోయాయి. బస్సు కింద మరెవరైనా ఉండే అవకాశముందనే అనుమానంతో రాత్రి పదిగంటలు దాటాక క్రేన్‌ సాయంతో దాన్ని పైకి లేపేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణిస్తున్నారు.

బస్సు పడిన ప్రాంతంలో నీరు లేకపోవడంతో ఇసుకలో కూరుకుపోయింది. అనుగుల్‌ జిల్లా తాల్చేరు ప్రాంతం నుంచి కటక్‌ బయలుదేరిన ఈ బస్సుకు మహానది వంతెన వద్ద గేదె అడ్డం వచ్చింది. దానిని ఢీకొన్న బస్సు అదుపు తప్పి వంతెన పైనుంచి నదిలోపలికి సుమారు 50 అడుగుల కిందకు పడిపోయింది. ఇది ఏసీ బస్సు కావడం.. అద్దాలు మూసి ఉండడంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తదితర సహాయ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. కటక్‌లోని శ్రీరామచంద్రభంజ్‌ వైద్య కళాశాల అత్యవసర వైద్యుడు భువనానంద మహరాణా మాట్లాడుతూ..‘ఇప్పటికి పన్నెండు మంది మృతి చెందారు. 42 మంది చికిత్స పొందుతున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది’ అని చెప్పారు.