RX100 సినిమా ఎఫెక్ట్.. ఇద్దరు కుర్రాళ్ళు ఒకే అమ్మాయిని ప్రేమించారు.. చివరికి దారుణం..

115

ఇద్దరిది ఒకే స్కూల్‌! ఒకే తరగతి! ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు! ఈ విషయంలోనే ఆ స్నేహితుల మధ్య చెడింది. అమ్మాయి ప్రేమ విషయంలో.. నువ్వు తప్పుకో అంటే నువ్వే తప్పుకో అంటూ గొడవకు దిగారు. ఇదే చివరికి వారి ప్రాణాలను తీసింది! తాగిన మత్తులో ఇద్దరూ గొడవపడ్డారు. పెట్రోలు మంటల్లో చిక్కుకొని ప్రాణాలు విడిచారు. ఒకరిపై మరొకరు పెట్రోలు చల్లుకొని.. నిప్పంటించుకున్నారని భావిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా కేంద్రం విజయపురి కాలనీలో నివసిస్తున్న కూసరి మహేందర్‌, విద్యానగర్‌లో కుందారపు రవితేజ స్నేహితులు. ఇద్దరూ విద్యానగర్‌లోని ఓ స్కూల్లో టెన్త్‌ చదువుతున్నారు. మహేందర్‌ ఓసారి ఇల్లు వదిలి హైదరాబాద్‌కు పారిపోయాడు. రవితేజ మత్తు కోసం వుడ్‌ ప్రైమర్‌ను అలవాటు చేసుకోవడంతో తల్లిదండ్రులు అతడికి పోలీసులతో కౌన్సెలింగ్‌ ఇప్పించారు.

కాగా మహేందర్‌, రవితేజ ఒకే అమ్మాయిని ప్రేమిస్తుండడంతో ఆ విషయంలో తరచూ గొడవ పడుతుండేవారు. ఆదివారం మహేందర్‌, రవితేజ మరో స్నేహితుడితో కలిసి పట్టణంలోని మిషన్‌ కాంపౌండ్‌లో మద్యం సేవించారు. తాగిన మైకంలోఇద్దరూ గొడవ పడినట్లు సమాచారం. అది ముదరడంతో ఒకరిపైన మరొకరు పెట్రోలు చల్లుకొని నిప్పంటించుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం వారి స్నేహితుడు అక్కడి నుంచి పారిపోయాడు. మంటల్లో చిక్కుకుని మహేందర్‌ ఘటనాస్థలిలోనే ప్రాణాలు విడిచాడు. రవితేజను జగిత్యాల ఆస్పత్రికి అక్కడి నుంచి కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ రవితేజ మృతి చెందాడు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాలురిద్దరూ ఒకరిపై మరొకరు పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్నారా? ఈ ఘటనలో ఎవరైనా మూడో వ్యక్తి ప్రమేయం ఉందా? లేదంటే.. అమ్మాయిని వేధిస్తున్నారంటూ మరెవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అని అనుమానిస్తున్నారు. పోలీసులు ఈ కోణాల్లోనే దర్యాప్తు చేస్తున్నారు. ఘటన తర్వాత అక్కడి నుంచి పారిపోయిన స్నేహితుడు ఇప్పటివరకు దొరకలేదు. అతడిని పట్టుకుంటే.. ఘటనపై పూర్తి వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు.