ఒక వ్యభిచారిణి బిడ్డ కథ… ఆమె జీవితం పూలపాన్పు కాదు..

314

ప్రతీవ్యక్తి తన కలలను, ఆశయాలను నిజం చేసుకోడానికి అనేక కష్టాలు పడి అన్ని అడ్డంకులూ అధిగమించాలి. ఇదేం కొత్త లేదా వింతైన విషయం కాదు. నిజానికి ఇవే ఒకరకంగా మన కలల వద్దకు మనల్ని చేరుస్తాయి. నిజాయితీగా చెప్పాలంటే, ఒక వేశ్య కూతురిగా చిన్నారి అశ్విని పడ్డ కష్టాలు అంతా ఇంతా కాదు. ప్రపంచానికి అసలు బాధ, కష్టం అంటే ఏంటో తెలిపేలా వుంది ఆ అమ్మాయి పడ్డ తపన, కష్టాలు. న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో ఆమె స్కాలర్ షిప్ పొందడానికి ఎంపికయ్యింది. ఇవేవీ సులభంగా జరిగినవి కావు. చిన్నవయస్సులోనే ప్రపంచానికి తన కథను ధైర్యంగా చూపగలిగిన అశ్విని కథ, ఆమె మాటల్లోనే..

Image result for prostitute

నా జీవితం మొత్తం జీవితం నుంచి పారిపోతూనే వచ్చాను. నాకు ఐదేళ్లప్పుడు, సెక్స్ వర్కర్ అయిన అమ్మ నుంచి పారిపోయాను. చిన్న చిన్న విషయాలకి ఆమె నన్ను భయంకరంగా చావబాదేది. నాకు అమ్మ గుర్తున్న కొన్ని జ్ఞాపకాలలో ఒకటి…నేను నా స్నేహితులతో దాగుడుమూతలు ఆడుకుంటున్నప్పుడు, ఒక భవంతి కింద పెట్టిన బైక్ లను అనుకోకుండా పడదోసాను. వాచ్ మెన్ మమ్మల్ని అక్కడే బంధించి, మా అమ్మలకి ఫిర్యాదు చేయటానికి వెళ్ళాడు. నాకు గుర్తుంది అమ్మ నా వైపు చీపురుకట్ట తీసుకుని పరిగెత్తుకురావటం…అంతే నాకు చాలా భయం వేసి, అక్కడినుంచి ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా పారిపోయాను. ఎనిమిదేళ్ళప్పుడు, అమ్మ నన్ను ఎన్జీవో ఆశ్రయ గృహానికి పంపించింది. అక్కడ టీచర్ దెబ్బలనుంచి ఎన్నో ఏళ్ళపాటు పారిపోతూ వచ్చాను. అదో క్రిస్టియన్ వసతిగృహం. అక్కడ ఒక్క నియమం పాటించకపోయినా, తిండిలేకుండా, దెబ్బలతో రోజులకి రోజులు ఆకలితో మాడ్చేవాళ్ళు. ఆ సమయంలోనే మా అమ్మ చనిపోయింది. అలా పదేళ్ళు వెళ్ళటానికి మరోచోటు లేక అక్కడే ఆ హింసను భరించాల్సి వచ్చింది. కొంతమంది స్నేహితులు అమ్మాయిల సంరక్షణాలయం క్రాంతి అనే చోటికి మా ఈ కూపం నుంచి పారిపోగలిగారు…వారు అక్కడి మెరుగైన జీవితం గురించి చెప్పి నన్ను కూడా వచ్చేయమన్నారు. ఇక ఒకరోజు ధైర్యం చేసి అక్కడికి పారిపోయాను. అదే నా జీవితాన్ని మార్చేసింది.

ఈ క్రింది వీడియో చూడండి

క్రాంతి సంస్థలో నాకు ప్రతివారం థెరపీ చికిత్స జరిగేది. ఇంకా చిత్రలేఖనం, డాన్స్ వంటి అనేక విషయాలు ఆ చికిత్సలో భాగం. ఇవన్నీ నేర్చుకున్నాక, అక్కడికొచ్చే మిగతా పిల్లలకి వాలంటీర్ గా పనిచేసేదాన్ని. నాకు వాలంటీర్ గా పనిచేసేప్పుడు జరిగిన, నచ్చిన అత్యుత్తమ విషయం టాటా మెమోరియల్ ఆస్పత్రిలో సేవ చేసే అవకాశం రావటం. అక్కడ క్యాన్సర్ చికిత్సకై వచ్చే పిల్లలకి వివిధ కళలను నేర్పించే బాధ్యత ఎంతో ఆనందాన్ని కలిగించింది. మేము అందరం కలిసి ఆర్ట్ ప్రాజెక్టులు నిర్వహిస్తూ పిల్లలు తమ భయాలు, సమస్యలు, కలలు ఆశయాల వంటి వాటిని వ్యక్తీకరించేట్లు చేయటం ఆ ప్రాజెక్టుల ముఖ్యోద్దేశం. గత రెండు సంవత్సరాల నుంచి నేను దేశమంతా పర్యటించాను. పశ్చిమ బెంగాల్ లో నాటకరంగ మెళకువలు నేర్చుకుంటూ, హిమాచల్ లో ఫోటోగ్రఫీ తరగతులు, గుజరాత్ ఎన్జీవోలలో స్వచ్చందసేవ, ఢిల్లీలోని దళితవాడలలో పనిచేయటం… ఇలాంటివన్నీ నా జీవితంలో భాగమైపోయాయి. నా అనుభవాల వల్ల నాకు అర్థమైనది నేను ఆర్ట్ థెరపిస్ట్ అవ్వాలనుకుంటున్నానని. ఇకపై నా జీవితాన్ని భావాలను వ్యక్తీకరించలేని వారికి సాయపడటంలో గడపాలనుకుంటున్నాను. న్యూయార్క్ విశ్వవిద్యాలయానికి ధరఖాస్తు చేసాను. నా కళాశాల ఫీజంతా సరిపోయేంత స్కాలర్ షిప్ తో ప్రవేశం దొరికింది. ఇది నా జీవితంలో అతిపెద్ద విజయం. పారిపోయిన హాస్టల్ కి తిరిగి లాక్కెళ్ళడానికి పోలీసులు ఇంకా నా గురించి వెతుకుతున్నప్పుడు, నా కలల విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ దొరకటం, నాకు నచ్చిన చదువు, జీవితాన్ని సాధించుకోగలిగే అవకాశం రావటం నా జీవితంలో పెద్ద మార్పును తీసుకొచ్చాయి. ఇక నేను పరిగెత్తాలనుకోవట్లేదు. పారిపోవాలనుకోవట్లేదు. రేపటి మీద కొత్త ఆశ చిగురించాక, నా శరీరం, మనస్సు, నా ప్రపంచంలో ఇన్నాళ్ళకి శాంతిని, స్థిరత్వాన్ని పొందాను… జీవితంలో రెండవ అవకాశం సరికొత్తగా బ్రతకడానికి మాత్రమే కాదు, వర్తమానం నుంచి పారిపోకుండా జీవించటానికి కూడా.