48 గంటల్లో అమరావతికి పెను ముప్పు

37

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు లేవు కాని వరదలు మాత్రం తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి…. కృష్ణా న‌ది వ‌ర‌ద‌లతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప‌లు గ్రామాల‌తో పాటు విజ‌య‌వాడ న‌గ‌రంలోని అనేక ప్రాంతాలు జ‌ల‌మ‌యమ‌య్యాయి.. ప్ర‌భుత్వం స‌హాయ చ‌ర్య‌ల కోసం రంగంలో దిగింది. విప‌క్ష నేత‌లు కూడా బాధితుల‌ను ప‌రామ‌ర్శిస్తున్నారు. పెరిగిన వ‌ర‌ద తాకిడితో అనేక చోట్ల వ‌ర‌ద బాధితులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు.ప్ర‌కాశం బ్యారేజ్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక నీటి విడుద‌ల రికార్డ్ 2009లో న‌మోద‌య్యింది. ఆ త‌ర్వాత ఇదే అత్య‌ధికం అని ఇరిగేష‌న్ అధికారులు చెబుతున్నారు.తాజాగా శ‌నివారం సాయంత్రం 6 గంటలకు న‌మోద‌యిన నీటిమ‌ట్టం 17 మీట‌ర్లుగా ఉంది. దాని కార‌ణంగా దిగువ‌కు 7 ల‌క్షల క్యూసెక్కుల నీటిని వ‌దులుతున్నారు. రెండో ప్ర‌మాద హెచ్చ‌రిక కొన‌సాగిస్తున్నారు.ఇప్ప‌టికే అమ‌రావ‌తి రాజ‌ధాని ప‌రిధిలోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర‌ద నీరు చేరింది. అమ‌రావ‌తి, తుళ్లూరు, తాడేప‌ల్లి మండ‌లాల ప‌రిధిలోని 12 గ్రామాల్లో వ‌ర‌ద స‌హాయ‌ చ‌ర్య‌లు ప్రారంభ‌మ‌య్యాయి.

Image result for heavy rains

జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని రెండు మండ‌లాల్లో కూడా వ‌ర‌ద తాకిడి తీవ్రంగా ఉంది. స‌హాయ చ‌ర్య‌ల్లో భాగంగా కంచిక‌చ‌ర్ల వ‌ద్ద నాటు ప‌డ‌విలో వాగు దాటిస్తున్న సమయంలో గౌత‌మి అనే 11 ఏళ్ల బాలిక నీటిలో గ‌ల్లంతైంది. గాలింపు చేపట్టగా ఆమె మృత‌దేహం ల‌భించింది. వ‌ర‌ద తాకిడితో విజ‌య‌వాడ న‌గ‌రం విల‌విల్లాడుతోంది. ప‌లు ప్రాంతాల్లో వ‌ర‌ద నీరు ఇళ్ల‌లోకి చేరింది. దాంతో బాధితుల‌ను పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 48 పున‌రావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన‌ట్టు అధికారులు ప్ర‌క‌టించారు. విజ‌య‌వాడ ప‌రిధిలోని భ‌వానీపురం, కృష్ణ‌లంక‌, రాణీగారి తోట ప్రాంతాల్లో వ‌ర‌ద కార‌ణంగా వంద‌ల సంఖ్య‌లో ఇళ్లు నీటిపాల‌య్యాయి.

Image result for heavy rains

గుంటూరు జిల్లాలోని అనేక మండ‌లాలు వ‌ర‌ద ముప్పులో ఉన్నాయి. దాచేపల్లి ప్రాంతంలో సుమారుగా 6,500 ఎకరాల్లో పత్తి, మిరప పంటలు వ‌ర‌ద తాకిడికి గుర‌య్యాయి.కొల్లిపర మండలంలోని ప‌లు గ్రామాల‌కు రాక‌పోక‌ల‌కు నిలిచిపోయాయి. అరటి, పసుపు, కంద, జామ నిమ్మ, కూరగాయల తోటల్లోకి నీరు చేరిన‌ట్టు అధికారులు చెబుతున్నారు. కొల్లూరు, దుగ్గిరాల మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి.గుంటూరు జిల్లా వ్యాప్తంగా 12 మండలాలు, 39 గ్రామాల్లో 537 కుటుంబాలు, 709 మంది ప్రజలకు వరద ముప్పు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలో 8 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 1619 మంది తరలించారు. ప‌లు చోట్ల రోడ్డు ర‌వాణా స్తంభించింది. అనేక చోట్ల విద్యుత్ స‌ర‌ఫ‌రాకి అంత‌రాయం ఏర్ప‌డింది. రాజ‌ధాని ప‌రిధిలోని మూడు మండ‌లాల్లో 6,887 స‌ర్వీసుల‌కు విద్యుత్ స‌దుపాయం నిలిచిపోయిన‌ట్టు ట్రాన్స్ కో ప్ర‌క‌టించింది.

Related image

అనూహ్యంగా పెరిగిన వ‌ర‌ద‌ల తాకిడితో బాధితుల‌ను ఆదుకునేందుకు అధికార యంత్రాంగం రంగంలో దిగింది.ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వ‌ర్షాల కార‌ణంగా వ‌ర‌ద‌లు రావ‌డంతో ముందస్త చ‌ర్య‌ల్లో జాప్యం జ‌రిగిన‌ట్టు విపక్షాలు, బాధితులు ఆరోపిస్తున్నారు. వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు ప‌ర్య‌టిస్తున్నారు. గుంటూరు జిల్లాలో మంత్రి మోపిదేవి వెంకటరమణ, విజ‌య‌వాడ‌లో మంత్రులు అనిల్ కుమార్, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంప‌ల్లి శ్రీనివాస్ బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు.

ఈ క్రింద వీడియో చూడండి

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను గవర్నర్ బిశ్వ‌భూష‌ణ్ హరిచందన్‌ ఏరియల్‌ సర్వే ద్వారా పర్యవేక్షించారు.కృష్ణా నదిలో వరద ప్రవాహం, నీట మునిగిన లంక గ్రామాలను పరిశీలించారు. వరద నివారణ చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.48 గంటలు ఇలాగే వరద నీరు వస్తే మరిన్ని ప్రాంతాలు నీట మునుగుతాయని తెలుస్తోంది, , రాజధాని అమరావతి ప్రాంతం అంతా వరద ముంపులో ఉంది, పలు ప్రాజెక్టు పనులకు ఆటంకం ఏర్పడింది.