స్కూల్లో టీచర్ చెప్పిన ట్రిక్ తో అగ్నిప్రమాదం నుండి 16మందిని రక్షించిన పదేళ్ల చిన్నారి.

442

ముంబైలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఎలక్ట్రికల్‌ వైరింగ్‌లో లోపం వల్ల 17 అంతస్తుల భవనంలోని 12వ అంతస్తులో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసందే.. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా 16 మంది గాయపడ్డారు. అయితే ఈ 16 మంది ప్రాణాలతో బయటపడటానికి కారణం పదేళ్ల చిన్నారి.పిల్లల్ని బట్టి చదువులకి అలవాటు చేస్తున్న నేటి తరుణంలో అగ్నిప్రమాదం సంభవిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని టీచర్ చెప్పిన పాఠాన్ని గుర్తుకు తెచ్చుకుని ,సమయస్పూర్తితో వ్యవహరించిన చిన్నారి అందరికి ఆధర్శంగా నిలుస్తుంది.మరి ఆ చిన్నారి ఎలా కాపాడాడో చూద్దామా.

ముంబైలోని క్రిస్టల్‌ అపార్ట్‌మెంట్‌లో నివసించే పదేళ్ల చిన్నారి జెన్‌ సదావర్తేను ఆమె తల్లి ఉదయాన్నే చాలా కంగారుగా నిద్రలేపింది. జెన్ నిద్రలేచి చూస్తే చుట్టూ మంటలు దట్టమైన పొగ ఆ వెంటనే అరుపులు, ఆర్తనాదాలు సాధారణంగా నిద్ర లేవగానే ఎవరైనా ఇలాంటి దృశ్యాలను చూస్తే షాక్‌ అవుతారు.ఏం చేయాలో,ఎలా బయటపడాలో ఏమి అర్దం కాదు.అలాంటి పరిస్థితిలోనే జెన్ ఇంట్లో పెద్దవాళ్లందరూ టెన్షన్ పడుతుంటే పదేళ్ల జెన్ మాత్రం అస్సలు కంగారు పడకుండా తరగతి గదిలో తన టీచర్ చెప్పిన పాఠాలను వెంటనే గుర్తుచేసుకుంది.వాటిని తక్షణమే అమల్లో పెట్టింది. ఎంతో మనో నిబ్బరంతో కిటీకీలను తెరిచింది.అంతేకాదు తమ పొరుగు వారికి అవే సూచనలను చేసింది.దట్టమైన పొగతో జెన్ కుటుంబ సభ్యులకు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది.కంగారు పడుతున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లిన చిన్నారి జెన్ వారికి నీటితో తడిపిన రుమాలును అందించింది.దాన్ని ముక్కుకు, నోరుకు అడ్డుగా పెట్టుకోవాలని సూచించింది.

ముక్కుకు అడ్డంగా దూది కూడా పెట్టుకోవాలని చెప్పింది. వాటి ద్వారా కార్బన్‌ డయాక్సైడ్‌ ఊపిరితిత్తుల్లోకి చేరదని చెప్పింది. తన వద్ద ఉన్న కొన్ని బట్టలను చించి పొరుగున ఉన్నవారికి కూడా అందించి అలా చేయాలని చెప్పింది.నీటిలో తడిపిన రుమాలు నోటికి అడ్డుపెట్టుకొమ్మని చెప్పడమే కాదు ఆ సమయంలో జెన్ మరిన్ని సూచనలు కూడా చేసింది.మంటలు ఎగసిపడుతుండటంతో అపార్ట్‌మెంట్లలో నివాసం ఉంటున్నవారు లిఫ్టుల వైపు పరుగులు పెడుతుండగా జెన్ వారిని వారించింది.అలాంటి ప్రమాద సమయాల్లో లిఫ్ట్‌లు ఉపయోగించడం మంచిది కాదని చెప్పింది. దీంతో పాటు అందరూ గుంపుగా ఏర్పడటం వల్ల ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుందని వివరించింది.దాంతో అందరు కలిసి మెట్ల నుంచి కిందికి దిగేశారు.అలా 16 మంది ప్రాణాలను కాపాడింది.ఇంత మందిని ఒక చిన్నారి కాపాడింది అని తెలిసి మీడియాల్ కూడా షాక్ అయ్యింది.

దీని గురించి మీడియా ఆ చిన్నారిని అడిగింది.దానికి ఆ చిన్నారి స్పందిస్తూ..‘ప్రమాదం జరిగిన వెంటనే నాకు మా టీచర్‌ చెప్పింది గుర్తుకొచ్చింది. ఇలాంటి విపత్కర సమయంలో ఊపిరి తీసుకోవడం, ఏమాత్రం కంగారు పడకుండా పరిస్థితిని గమనించడం చేయాలని చెప్పింది. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ఎలా స్పందించాలో వివరించింది. మా టీచర్ చెప్పినట్లే నేను చేశా’ అంటూ మీడియాతో చెప్పింది జెన్‌ సదావర్తే.. అగ్నిమాపక సిబ్బంది చేరుకునే వరకు మొత్తం 18 మంది చిన్నారి జెన్ చెప్పినట్లే చేశారు. అధికారులు వారిని సురక్షితంగా కిందకు తీసుకొచ్చి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించేలోగా వారిలో ఇద్దరు మరణించగా మిగిలిన 16 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వీరంతా జెన్‌ తో పాటు,వాళ్ల టీచర్ కి కూడా థాంక్స్ చెప్పారు.చూశారుగా టీచర్ చెప్పిన పాఠంను గుర్తుకు ఉంచుకుని అంత మంది ప్రాణాలను ఎలా కాపాడిందో.