చంద్రుడిపై దిగడానికి నాసాకు 4 రోజులు పడితే…ఇస్రోకు 48 రోజులెందుకు..?

37

కోట్లాదిమంది భారతీయుల ఆశలు, కలలను తన వెంట మోసుకెళ్లిన చంద్రయాన్ – 2.. చిట్ట చివరి నిమషంలో గతి తప్పింది. విఫలమైంది. చంద్రుడి ఉపరితలానికి సుమారు 2.1 కిమీ దూరంలో ఉన్న సమయంలో దారి తప్పింది. మరి కొన్ని క్షణాల్లో చంద్రుడి ఉపరితలంపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ నుంచి ఎలాంటి సంకేతాలు అందకుండా పోయాయి. దీంతో చంద్రుడిపై భారత్ జెండా ఎగరవేద్దాం అనుకున్న భారతీయుల ఆశ నెరవేరలేదు. 2019 జులై 22న షార్ అంతరిక్ష కేంద్రం నుంచి నిప్పులు చిమ్ముకుంటూ చంద్రయాన్ 2 నింగికెగిసింది. అయితే ఇక్కడే ఓ చిన్న ప్రశ్న కొందరిలో తలెత్తుతోంది. అదేంటంటే.. సరిగ్గా 50 ఏళ్ల కిందట అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పంపిన అపోలో 11 అనే శాటిలైట్ నాలుగు రోజుల్లో గమ్యాన్ని చేరుకుని చంద్రుడి మీద ల్యాండ్ అయింది. కానీ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 2 మాత్రం చంద్రుడిని చేరుకోడానికి 48 రోజులు పట్టింది. 50 ఏళ్ల కిందటే అంత వేగంగా చేరుకోగలిగినప్పుడు ఇస్రో పంపిన చంద్రయాన్ ఇంకా వేగంగా వెళ్లగలగాలి కదా. కానీ ఎందుకు ఆలస్యంగా వెళ్తోంది అన్నదే సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్న. దీని గురించి ఇప్పుడు పూర్తీగా తెలుసుకుందాం.

చంద్రయాన్ 2

1969 జులై 16న అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి శాటరన్ ఫైవ్ ఎస్ఏ506 రాకెట్ సాయంతో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్విన్ ఈ ఆల్డ్రిన్, మైఖెల్ కొల్లిన్స్ అనే ముగ్గురు వ్యోమగాముల్ని చంద్రుడిపైకి పంపింది. జులై 16 ఉదయం 8గంటల 32 నిముషాలకు నింగిలోకి దూసుకెళ్లిన అపోలో 11, 102 గంటల 45 నిముషాలకు గమ్యాన్ని చేరుకుని, చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయింది.. అంటే కేవలం నాలుగు రోజుల ఆరు గంటల్లోనే వారు గమ్యం చేరుకున్నారు. ఆపై వ్యోమగాములు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్‌లు చంద్రుడిపై దిగి, అక్కడి మట్టి, రాళ్లను సేకరించారు. జులై 21న భూమ్మీదకు తిరుగు ప్రయాణం ప్రారంభించిన అపోలో 11 వ్యోమగాములున్న మాడ్యూల్ జులై 24న నార్త్ ఫసిఫిక్ సముద్రంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అంటే భూమ్మీద నుంచి చంద్రుడి మీదకు వెళ్లి, అక్కడ పరిశోధనలు చేసి, తిరిగి భూమ్మీదకు రావడానికి వాళ్లకు కేవలం ఎనిమిది రోజుల 3 గంటలు మాత్రమే పట్టింది. కానీ ఇస్రో చంద్రుడి మీద పరిశోధనల కోసం కేవలం ఆర్బిటర్, ల్యాండర్‌లను మాత్రమే పంపించింది. అయినా అవి చంద్రుడిని చేరుకోడానికి 48 రోజులు ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. ఇంత ఆలస్యం వెనుక చాలా పెద్ద కథే ఉంది.

చంద్రయాన్ 2

చంద్రయాన్ 2 సుదీర్ఘ ప్రయాణం వెనుక సాంకేతికంగా చాలా కారణాలున్నాయి. 1969లో నాసా ప్రయోగించిన అపోలో 11 రాకెట్ బరువు ఇంధనంతో కలిపి దాదాపు 2800 టన్నులు. కానీ ఇస్రో ప్రయోగించిన జీఎస్ఎల్వీ మార్క్ త్రీ రాకెట్ బరువు ఇంధనంతో కలసి 640 టన్నులే. సాధారణంగా శాటిలైట్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లే పీఎస్ఎల్వీ రాకెట్లు ఇంత బరువు ఉండవు. ఎందుకంటే అవి కేవలం శాటిలైట్లను తీసుకెళ్లి జియో సింక్రనైజ్డ్ లేదా జియో స్టేషనరీ ఆర్బిట్లలో ప్రవేశ పెడతాయి. కానీ చంద్రయాన్ ఇందుకు విభిన్నం. ఎందుకంటే చంద్రుడి దగ్గరకు వెళ్లాల్సిన వాహక నౌకలో ఇంధనంతో పాటు చాలా పరికరాలు ఉంటాయి. అందుకే ఇలాంటి ప్రయోగాలకు అత్యంత శక్తిమంతమైన రాకెట్లను వినియోగిస్తారు. ఈ విషయంలో కూడా నాసా ప్రయోగించిన రాకెట్ల బరువు అధికమే. భూకక్ష్యను దాటిన తర్వాత చంద్రుడి వైపు ప్రయాణించిన అపోలో వ్యోమనౌక బరువు 45.7 టన్నులు. ఇందులో 80 శాతానికి పైగా ఇంధనమే. అంటే అపోలో 11లో ఈగిల్ అనే ల్యాండర్ చంద్రుడి మీద దిగి, వ్యోమగాములు చంద్రుడి మీద దిగి, పరిశోధనలు చేశాక, తిరిగి ఆ ల్యాండర్ ఆర్బిటర్‌ను చేరుకుని, అది భూమ్మీదకు రావడానికి ఇంత ఇంధనం అవసరం. అపోలో 11 ప్రయోగానికి ఉపయోగించిన రాకెట్ శాటరన్ ఫైవ్ ఎస్ఎఏ506 అత్యంత శక్తిమంతమైనది. అంత భారీ ఇంధనం, అంత భారీ రాకెట్ కాబట్టే అపోలో 11 కేవలం నాలుగు రోజుల్లో నేరుగా ప్రయాణించి చంద్రుడిని చేరింది.

ఉపగ్రహ ప్రయోగం

ప్రస్తుతం ఇస్రో దగ్గరున్న అత్యంత శక్తిమంతమైన రాకెట్ జీఎస్ఎల్వీ మార్క్ త్రీ. జులై 22న చంద్రయాన్ 2ను తీసుకుని నింగిలోకి దూసుకెళ్లినప్పుడు ఆ రాకెట్ మొత్తం బరువు 640 టన్నులు. ఈ రాకెట్ గరిష్టంగా నాలుగు టన్నుల బరువున్న శాటిలైట్లను మోసుకెళ్లగలదు. అంటే నాలుగు టన్నుల బరువైన చంద్రయాన్ 2ను జీఎస్ఎల్వీ మార్క్ త్రీ అంతరిక్షంలోకి తీసుకెళ్లి దానిని భూకక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. అక్కడి నుంచి చంద్రయాన్ 2 తనంతట తాను ప్రయాణించి చంద్రుడిని చేరుకోవాలి. 50 ఏళ్ల కిందట నాసా చేపట్టిన అపోలో 11 ప్రయోగంలో ఇలా అంతరిక్షం నుంచి దూసుకెళ్లిన రాకెట్ బరువు 45 టన్నులకు పైమాటే. కానీ చంద్రయాన్‌లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్, ఇంధనంతో కలిపి మొత్తం బరువు 4 టన్నుల లోపే ఉంది. అంటే అతి తక్కువ ఇంధనంతో చంద్రుడి దగ్గరకు చేరుకోవాలి. ఇందుకోసమే ఇస్రో ఓ వినూత్న ఆలోచన చేసింది. ఈ విధానంలో రాకెట్ నేరుగా చంద్రుడి మీదకు దూసుకెళ్లడానికి బదులుగా భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతూ, క్రమంగా తన అపోజీని పెంచుకుంటూ వెళ్లేలా ఏర్పాటు చేశారు. ఆపై భూ కక్ష్య నుంచి బయటపడి చంద్రుడి వైపు ప్రయాణం చేసి, అక్కడ నుంచి చంద్రుడి చుట్టూ ఇదే దీర్ఘవత్తాకార కక్ష్యలో తిరుగుతూ క్రమంగా తన అపోజీని తగ్గించుకుంటూ, చివరికి చంద్రుడి వైపు ప్రయాణించి, ఆ ఉపరితలంపై దిగుతుంది.

ఈ క్రింద వీడియో చూడండి

ఈ విధానంలో జులై 22న అంతరిక్షంలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ 2, 23 రోజుల పాటు భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతూ దాని పరిధి పెంచుకుంటూ పోయింది. 23వ రోజు భూ కక్ష్య నుంచి విడిపోయి చంద్రుడి వైపు ప్రయాణం ప్రారంభించింది. అలా ఏడు రోజులు నేరుగా చంద్రుడి వైపు ప్రయాణించిన తర్వాత 30వ రోజున అంటే ఆగస్ట్ 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఇలా చంద్రుడి గురుత్వాకర్షణ పరిధిలోకి ప్రవేశించడాన్నే లూనార్ ఆర్బిట్ ఇన్‌సర్షన్ అంటారు. అక్కడి నుంచి చంద్రుడి చుట్టూ 13 రోజులు పరిభ్రమిస్తూ అపోజీ తగ్గించుకుని, చంద్రుడి మీదకు దిగేలా ప్రోగ్రామ్ చేశారు. ఇలా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన 13వ రోజు చంద్రయాన్ 2లోని ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయి చంద్రుడి ఉపరితలం వైపు ప్రయాణించి, 48వ రోజు ల్యాండర్ చంద్రుడి మీద దిగి, పరిశోధనలు చేసేలా ఇస్రో ముందుగానే ప్రోగ్రామ్ చేసింది. ఒక్కసారి చంద్రయాన్‌లో ల్యాండర్ చంద్రుడి ఉపరితలం మీద దిగిన తర్వాత, అందులో వివిధ రకాల సెన్సర్లు చంద్రుడిపై పరిశోధనలు చేసి, ఆ సమాచారాన్ని భూమ్మీదకు పంపేలా ఏర్పాట్లు చేశారు. ఇక ల్యాండర్ నుంచి బయటకు వచ్చే రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడి మీద తిరుగుతూ అక్కడి నేలను విశ్లేషించడంతో పాటు, మరిన్ని పనులు చేస్తుంది. ఇలా ఇస్రో తన దగ్గరున్న రాకెట్ సామర్థ్యంతో, అతితక్కువ ఇంధనంతో విజయవంతంగా చంద్రుడిని చేరుకోడానికే ఇలాంటి విధానాన్ని ఎంచుకుంది. ఈ విధానం వల్లే అతి తక్కువ ఖర్చుతో ఇస్రో తన ప్రయోగాలు చేస్తోంది. కానీ మన దురదృష్టం ఇప్పుడు ఈ చంద్రయాన్ 2 సక్సెస్ కాలేకపోయింది. ఒకవేళ సక్సెస్ అయ్యి ఉంటె చరిత్ర స్పృష్టించేవాళ్ళం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి చంద్రయాన్ 2 ప్రయోగం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.