రూ.210/- కడితే చాలు నెలకు రూ.5000 వస్తుంది

1136

అసంఘటితరంగ కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కోసం మోడీ ప్రభుత్వం ప్రారంభించిన పథకం అటల్ పెన్షన్ యోజన (APY). ఈ స్కీంలో చేరేందుకు కనీస వయస్సు 18 సంవత్సరాలు. గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు. ఈ స్కీంలో ఎంత తక్కువ వయస్సులో చేరితే అంత ప్రయోజనకరంగా ఉంటుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత రూ.1,000 నుంచి రూ.5,000 వరకు మనం ఎంత సెలక్ట్ చేసుకుంటే ఆ మేరకు మన నెలకు కొంత మెత్తం చెల్లించాలి. దానికి సమానంగా కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది. 18 ఏళ్ల వయస్సులో ఈ పథకంలో చేరితే నెలకు రూ.42 కడితే వృద్ధాప్యంలో నెలకు రూ.1,000, రూ.210 చెల్లిస్తే రూ.5,000 పింఛన్ వస్తుంది. 40 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు రూ.291 చెల్లిస్తే వృద్ధాప్యంలో రూ.1,000 పింఛన్ వస్తుంది. రూ.1,454 చెల్లిస్తే రూ.5,000 పింఛన్ వస్తుంది..

అసంఘటిత రంగ కార్మికుల కోసం తీసుకువచ్చిన ఈ పథకం విషయంలో 2019-20 బడ్జెట్‌లో కేంద్రం మరింత సరళతరం చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పెన్షన్ పథకంలో చేరేందుకు గరిష్ట వయస్సు 40, 60 ఏళ్ల తర్వాత వచ్చే పెన్షన్ గరిష్టంగా రూ.5,000గా ఉంది. అయితే వీటిల్లో మార్పులు చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

గరిష్టంగా పెన్షన్‌ను రూ.5,000గా ఫిక్స్ చేయడం వల్ల మరింత పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఈ పథకంలో చేరడానికి ఆసక్తి చూపించకపోవచ్చునని అంటున్నారు. అలాగే, వయస్సు 40 లిమిట్ పెట్టడం కూడా.. అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి ఇబ్బందికరంగా మారిందని భావిస్తున్నారు. 40 ఏళ్ళు దాటిన వారు ఈ పథకంలో చేరాలనుకున్నప్పటికీ ఏజ్ లిమిట్ కారణంగా దూరం జరుగుతున్నారని అంటున్నారు. APYలో షరతులు సడలించే అవకాశం ఈ నేపథ్యంలో APYలో ఈ షరతులను సడలించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఇప్పటికే ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అతారిటీ (PFRDA) ఈ అంశాలపై కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది. పెన్షన్ లిమిట్‌ను అలాగే, వయస్సు పరిమితిని పెంచాలని అందులో పేర్కొంది. ఈ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది.

PFRDA ప్రతిపాదనలకు మొగ్గు చూపితే వయో పరిమితిని 40 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచవచ్చునని తెలుస్తోంది. అలాగే, పెన్షన్ లిమిట్‌ను రెండింతలు చేయవచ్చునని అంటున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న నెలకు రూ.5,000 పెన్షన్ రూ.10,000 చేస్తారు. PFRDA ప్రతిపాదనల నేపథ్యంలో ఈ బడ్జెట్‌లో మార్పులు చేస్తే APY స్కీం మరింత ప్రాచుర్యం పొందుతుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం, 18-40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న భారతీయులు ఈ పథకంలో చేరవచ్చు. బ్యాంకు అకౌంట్ ఉండాలి. వారి అకౌంట్ నుంచి ప్రతి నెల అటోమేటిక్‌గా డబ్బులు డెబిట్ అవుతాయి. 60 ఏళ్ల వరకు ఈ పథకం కోసం కాంట్రిబ్యూట్ చేయాలి. ఆ తర్వాత నుంచి పెన్షన్ వస్తుంది. మనం సెలక్ట్ చేసుకున్న దానిని బట్టి రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ వస్తుంది.