అమ్మ ఒడి పథకం ఈ స్కూళ్లకు మాత్రమే.. ఎవరు అర్హులు ?

218

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రలో అమ్మఒడి పథకాన్ని ప్రకటించారు. తమ మేనిఫెస్టోలో ఉన్న నవరత్నాల్లో ఒకటిగా అమ్మఒడి పథకం చేర్చారు. ఈ పథకం ద్వారా తమ పిల్లలను బడికి పంపిన ప్రతి పేద తల్లికీ జనవరి 26వ తేదీన రూ.15వేలు తమ ఖాతాలోకి ప్రభుత్వం డబ్బులు వేస్తుందని తెలిపారు. అయితే దీనిపై మొదట్లో స్పష్టత రాలేదు. ఒక్క ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థుల తల్లులకు మాత్రమే డబ్బులు ఇస్తారా లేక ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు కూడా ఇస్తారా అనేదానిపై క్లారిటీ రాలేదు. దీంతో పథకంపై పలు సందేహాలు అపోహలు తెరమీదకు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మాట్లాడుతూ… అమ్మఒడి పథకం ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపించే తల్లులకు మాత్రమే వర్తిస్తుందని చెప్పడంతో విమర్శలు వచ్చాయి. నవరత్నాల్లోని తొలిరత్నంనే జగన్ ప్రభుత్వం నీరుగారుస్తోందనే విమర్శలు ఇటు ప్రతిపక్షంతో పాటు అటు సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొట్టాయి. దీంతో ప్రభుత్వం దిద్దు బాటు చర్యలకు దిగింది.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

పేద తల్లి తమ బిడ్డను ఏ స్కూలుకు పంపినా అమ్మఒడి పథకం వర్తిస్తుందంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలో నిరక్షరాస్యత 23శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో 33శాతంగా ఉందని ప్రభుత్వం తెలిపింది. ప్రతి ఇంట్లో పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతోనే అమ్మఒడి పథకం తీసుకువచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. అమ్మఒడి పథకంలో ఎలాంటి అపోహలు లేవని..బిడ్డను బడికి పంపిన ప్రతి తల్లికి డబ్బులు చేరవేస్తామని స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వ స్కూళ్లకు మాత్రమే ఉంటుందా లేదా ప్రైవేట్ స్కూళ్లకు కూడా ఉంటుందా అనే సందేహం ఇన్ని రోజులు ఉండేది. దీనికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రైవేటు స్కూళ్లకు మాత్రమే వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లాస్థాయి అధికారులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. పాఠశాలల గుర్తింపుతో పాటుగా విద్యార్థి తల్లి బ్యాంకు అకౌంట్ నెంబరు, ఆధార్ నెంబర్ వివరాలను సేకరించాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు.

దీంతో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చదివించే ప్రతీ తల్లికి గణతంత్ర దినోత్సవం నుంచి రూ.15,000 సాయం అందించనున్నారు. అయితే ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఇదిలా ఉండగా.. ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేయాలని పలువురు విద్యావేత్తలు, మేథావులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలతోపాటుగా.. ప్రైవేటు స్కూళ్లకూ కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తే భవిష్యత్తులో ఏ ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించే అవకాశం ఉండదని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థికసాయం తీసుకుంటూ పిల్లలను ప్రైవేటు ఫాఠశాలల్లో చదివించుకుంటారని దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మరింత దిగజారే అవకాశముందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి అమ్మవడి పథకం మీద ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.