తాజాగా ఐపీఎల్ ప్లేయర్ రిటెన్షన్ ప్రాసెస్ ముగిసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీని తమ వద్దే అట్టిపెట్టుకునేందుకు గాను ఆ ప్రాంఛైజీ రూ. 17 కోట్లు చెల్లించింది. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
కావాలంటే ఈ వీడియో చూడండి
అంతకముందు 2015లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంఛైజీ టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కోసం వేలంలో రూ. 15 కోట్లు చెల్లించింది. ఇదే ఇప్పటికే వరకు అత్యధికం.
తాజాగా గురువారం జరిగిన ప్లేయర్ రిటెన్షన్ ప్రాసెస్‌లో విరాట్ కోహ్లీ ఆ రికార్డుని బద్దలు కొట్టాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాంఛైజీ ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు అయిన విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌తో పాటు సర్ఫరాజ్ ఖాన్‌ను తన వద్దే అట్టిపెట్టుకుంది.
మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో పాటు ఢిపెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మలను ఆయా ఫ్రాంచైజీలు తమ వద్దే అట్టిపెట్టుకున్నాయి. వీరిద్దరి కూడా ఆయా ప్రాంఛైజీలు ఒక్కొక్కరికి రూ. 15 కోట్లు చెల్లించాయి. ఇక, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌లకు రూ. 12 కోట్లను ఆయా ప్రాంఛైజీలు చెల్లించాయి.
ఐపీఎల్-2016 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ సీజన్లో మొత్తం 18 మ్యాచ్‌లాడిన కోహ్లీ 81.08 యావరేజితో 973 పరుగులు చేశాడు. ఈ సీజన్లో విరాట్ కోహ్లీ నాలుగు సెంచరీలు నమోదు చేశాడు. దీంతో ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఇక, ఐపీఎల్ 10వ సీజన్లో గాయం కారణంగా తొలి నాలుగు మ్యాచ్‌లకు దూరమైన కోహ్లీ ఆ తర్వాత కేవలం పది మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఈ పది మ్యాచ్‌ల్లో 30.80 యావరేజితో 308 పరుగులు చేశాడు.