ఐపీఎల్‌లో ఈ రోజు కోహ్లీసేనకి ఆఖరి ఛాన్స్.

214

ఐపీఎల్ 2019 సీజన్‌లో వరుస ఓటములతో బోణి కోసం నిరీక్షిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి ఈరోజు ఆఖరి అవకాశం. సుదీర్ఘకాలంగా ఐపీఎల్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న బెంగళూరు జట్టు.. తాజా సీజన్‌లో కనీసం ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈరోజు మ్యాచ్‌లో తప్పక‌ గెలవాల్సి ఉంది. ఇప్పటికే వరుసగా ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓడిన కోహ్లీసేన.. ఈరోజు రాత్రి 8 గంటలకి మొహాలి వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఢీకొట్టబోతోంది. చావోరేవో మ్యాచ్ కావడంతో.. కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నాడు.

ఐపీఎల్ 2019 సీజన్ ఆరంభం నుంచి బెంగళూరు జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ తడబడుతూ వస్తోంది. మధ్యలో ఓ రెండు మూడు మ్యాచ్‌ల్లో కోహ్లి, డివిలియర్స్, పార్థీవ్ పటేల్ మెరిసినా.. మిగిలిన వారి నుంచి మాత్రం ఇప్పటి వరకూ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన లేదు. ఇక బౌలింగ్‌ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనే తరహాలో.. ఆ జట్టు బౌలర్లు ప్రదర్శన ఉంది. చాహల్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొడుతున్నా.. ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, నవదీప్ షైనీ ధారాళంగా పరుగులిచ్చేస్తున్నారు.

ఎంతలా అంటే..? 205 పరుగుల లక్ష్యాన్ని కూడా బెంగళూరు టీమ్ కాపాడుకోలేనంత పేలవంగా బెంగళూరు బౌలింగ్, ఫీల్డింగ్ ఉంది. అయితే.. ఈ మ్యాచ్‌లో బౌలర్ల మార్పులతో పాటు బ్యాటింగ్ ఆర్డర్‌లోనూ మార్పులు చేయాలని కెప్టెన్ కోహ్లీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ జట్టులో హిట్టర్లు ఉండటంతో.. భారీ స్కోరు ఛేదించాల్సి వచ్చినా.. లేదా తొలుతే బ్యాటింగ్ చేసినా.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడాలని బెంగుళూరు యోచిస్తున్నట్లు సమాచారం.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో ఓపెనర్ క్రిస్‌గేల్ మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నా.. భారీ స్కోర్లు మాత్రం చేయలేకపోతున్నాడు. కానీ.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్.. ఇటీవల శతకంతో మళ్లీ ఫామ్ అందుకున్నాడు. ఇక మిడిలార్డర్‌లో మయాంక్ అగర్వాల్, మన్‌దీప్ సింగ్, డేవిడ్ మిల్లర్, సర్ఫరాజ్ ఖాన్.. పంజాబ్ బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నారు. బౌలింగ్‌లో మహ్మద్ షమీ, అశ్విన్, ముజీబ్, శామ్ కరన్ నిలకడగా రాణిస్తున్నారు.

మరి ఈ రోజైనా రాయల్ చాలంజర్స్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ రేసులో నిలబడుతుందా..లేదా ఇంటిబాట పడుతుందో చూడాలి..రాయల్ చాలంజర్స్ ఫెయిల్యూర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పెట్టండి..