బ్రహ్మానందం కొడుకు నటించిన మను సినిమా రివ్యూ

438

చిత్రం: మను
నటీనటులు: రాజా గౌతమ్‌, చాందినీ చౌదరి, జాన్‌ కోట్లే, అభిరామ్‌, మోహన్‌ భగత్‌ తదితరులు
సంగీతం: నరేష్‌ కుమారన్‌
ఛాయాగ్రహణం: విశ్వనాథ్‌రెడ్డి
కూర్పు: ఫణీంద్ర నరిశెట్టి
నిర్మాణం: ది క్రౌడ్‌
దర్శకత్వం: ఫణీంద్ర నరిశెట్టి
సమర్పణ: నిర్వాణ సినిమాస్‌

కొత్త తరహా ఆలోచనలకు, కథలకు పెద్ద పీట వేస్తున్న కాలమిది. ప్రయోగాలకు పట్టం కడుతున్నారు. చిన్న సినిమా అయినా… ‘బాగుంది’ అనిపిస్తే చాలు వసూళ్లు కురిపిస్తున్నారు. ఔత్సాహిక దర్శకులకు తగిన సమయం ఇదే! అయితే కొత్తదనం పేరుతో మితిమీరిన ప్రయోగాలు కూడా చేయకూడదు. మనం చెబుతున్న, చెప్పబోతున్న కథ ప్రేక్షకులకు అర్థం అవుతుందా, లేదా? వాళ్లని కన్‌ఫ్యూజన్‌లో పడేస్తున్నామా? అనే విషయాలూ ఆలోచించుకోవాలి. లేదంటే… వ్యవహారం ‘మను’లా తయారవుతుంది.

కథేంటంటే: మను (రాజా గౌతమ్‌) ఓ చిత్రకారుడు. ఏదో విషయంలో తనలో తానే మధనపడుతుంటాడు. నీల (చాందినీ చౌదరి) మనుని ఇష్టపడుతుంది. తన కళని ఆరాధిస్తుంది. అయితే అనుకోని పొరపాటు వల్ల మనుని అపార్థం చేసుకుంటుంది. దాన్ని తెలుసుకుని మనుకి దగ్గరయ్యే క్రమంలో ఆమె జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. అవేంటి? మను, నీల కలశారా? వీరిద్దరికీ ఓ వజ్రానికీ ఉన్న సంబంధం ఏమిటి? అనేది తెరపై చూడాలి.

ఎలా ఉందంటే: కథగా చెప్పుకోవాలంటే చిన్న లైన్‌. ఓ వజ్రం కోసం ముగ్గురు దొంగలు ఎంత అఘాయిత్యానికి పాల్పడ్డారు? దాని వల్ల ఇద్దరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి? అనేది కథ. దానికి థ్రిల్లర్‌, హారర్‌ జోనర్‌ని జోడించాడు దర్శకుడు. నిజానికి ఇదో దెయ్యం కథ. అలాగని ఇప్పటి వరకూ చూసిన దెయ్యం కథలా ఉండదు. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో భయపెట్టడం, జుట్టు విరబోసుకుని, తెల్ల దుస్తుల్లో అటూ ఇటూ తిరగడం లాంటి రొటీన్‌ సన్నివేశాలు కనిపించవు. దెయ్యాలు కూడా మామూలు మనుషుల్లానే ఉంటాయి. వాటి పగను తీర్చుకుంటాయి. ఆ పాయింట్‌కి దర్శకుడు తన భావుకత జోడించాడు. అండమాన్‌ లాంటి దీవి నేపథ్యాన్ని ఎంచుకుని ఈ కథకి కొత్త కలరింగు ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ట్విస్టులు కూడా ఆశ్చర్యపరుస్తాయి. కథనాన్ని నడిపించిన తీరు కూడా కొత్తగానే ఉంటుంది. నిజానికి సినిమా ప్రారంభమైన కాసేపటికి ఇదో క్రైమ్‌ థ్రిల్లర్‌ అనిపిస్తుంది. ఆ తరవాత హారర్‌ కోణం మొదలవుతుంది.

 

ద్వితీయార్ధంలో ప్రేమకథ, రివేంజ్‌ డ్రామాలు కనిపిస్తాయి. ఒకే కథలో ఇన్ని రకాల జోనర్లు ఉండడం ఓ కొత్త అనుభూతికి గురి చేస్తుంది. అయితే స్క్రీన్‌ప్లే పరమైన ప్రయోగాలు ఈ సినిమా నడకని దెబ్బతీశాయి. ప్రేక్షకుల్లో కొత్త కన్‌ఫ్యూజన్లను మొదలవుతాయి. అసలు ఎవరు దెయ్యామో, ఎవరు కాదో, ఏ కథ ముందో, ఏది తరవాతో… అర్థం అవ్వదు. సైన్స్‌ గురించి చెప్పే మాటలు, ఆ పద్ధతిలో శత్రు సంహారం ఇవన్నీ అంత తేలిగ్గా బుర్రకు ఎక్కే విషయాలు కావు. కథానాయకుడి పాత్ర కవితాత్మకంగా, గంభీరంగా మాట్లాడుతుంటుంది. ఆ భావాలు అర్థం చేసుకుంటే బాగుంటుంది. అర్థం కాకపోతేనే అయోమయానికి గురవుతాం. సినిమా తీత కూడా అలానే ఉంది. దర్శకుడి ఉద్దేశం మంచిదే కావొచ్చు. కొన్ని దృశ్యాలు అంత తేలిగ్గా జీర్ణం కావు. చివర్లో శవాలకు నల్ల రంగు పూయడం, రేడియం అద్దడం… ఇలాంటి దృశ్యాలు కాస్త కంగారు పెడతాయి.

ఎవరెలా చేశారంటే..: రాజా గౌతమ్‌ చాలా కాలం తర్వాత చేసిన సినిమా ఇది. ఈ పాత్ర కోసం మూడేళ్లు కష్టపడినట్టు చెప్పాడు. అయితే… ఈ సినిమా కోసం అంత కష్టం ఎందుకూ? అనే అనుమానం వేస్తుంది. గడ్డం పెంచి కొత్తగా కనిపించాడు. తన డిక్షన్‌ కూడా బాగుంది. తీక్షణమైన సన్నివేశాల్లో బాగా నటించాడు. చాందిని కూడా ఆకట్టుకుంటుంది. మిగిలిన వాళ్లంతా కొత్తవాళ్లే. వాళ్ల నుంచి దర్శకుడు తనకు కావల్సిన నటన రాబట్టుకున్నాడు. తక్కువ బడ్జెట్‌లో తీసిన సినిమా ఇది. అయితే ఆ విషయం ఎక్కడా తెలీదు. లొకేషన్లు, ఆ ఇల్లు అన్నీ కొత్తగా కనిపిస్తుంటాయి. నేపథ్య సంగీతం, కెమెరా పనితనం ఆకట్టుకుంటాయి. దర్శకుడిలో చాలా భావాలున్నాయి. అవన్నీ పేర్చాలని, ఏదో చెప్పాలని తాపత్రయపడ్డాడు. అయితే ఎక్కువ విషయాలు చెప్పేయాలన్న తొందరలో ఏదేదో చెప్పాడు. ఈ కథని ఫ్లాట్‌ నేరేషన్‌లోనూ చెప్పొచ్చు. అలా చెబితే తన తెలివితేటల్ని ప్రదర్శించే వీలు ఉండదని.. ఓ కొత్తతరహా స్క్రీన్‌ప్లే ఎంచుకున్నాడు. అదే అసలు గందరగోళానికి కారణమైంది. మాటలు చాలా పొదుపుగా వాడాడు. కానీ, వాటిలో పదును కనిపిస్తుంది. కొన్ని అర్థం అవుతాయి. ఇంకొన్ని ప్రశ్నలుగా మిగిలిపోతాయి.

బలాలు
+ ట్విస్టులు
+ లవ్‌ ట్రాక్‌

బలహీనతలు
– స్క్రీన్‌ ప్లే నిడివి

చివరిగా: మను ప్రయోగాన్ని అర్థం చేసుకోవడం కాస్త కష్టమే!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.