వణికిస్తున్న ప్రైవేట్ డ్రైవర్లు.. పలువురి మృతి, ప్రయాణికుల్లో ఆందోళన

179

తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె పెద్ద ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 13 రోజులు కావస్తున్నా కూడా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల విషయంలో ఎక్కడ తగ్గడం లేదు. వారి డిమాండ్స్ ను నెరవేర్చేందుకు సిద్ధంగా లేదు ప్రభుత్వం. అందుకే కార్మికులు కూడా సమ్మె విరమించేది లేదని తెగేసి చెప్తున్నారు. అయితే ప్రజలు ఇబ్బంది పడుతుండడంతో ప్రభుత్వం ప్రయివేట్ డ్రైవర్స్, కండక్టర్లను పెట్టి బస్సులను నడిపిస్తుంది. అయితే ఈ ప్రైవేట్‌ డ్రైవర్లు ప్రయాణికులను, బైకర్లను బెంబేలెత్తిస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని జనం అందోళన చెందుతున్నారు. హైదరాబాద్ నగరంలో, రాష్ట్రంలోని పలుచోట్ల డ్రైవర్ల నిర్లక్ష్యంతో ఆర్టీసీ బస్సులు ప్రమాదాల బారిన పడ్డాయి. ఈ ఘటనలలో పలువురు దుర్మరణం పాలయ్యారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు పెద్ద సంఖ్యలో డ్రైవర్లను, కండక్టర్‌లను డిపోలకు తరలిస్తున్నారు. హెవీ డ్రైవింగ్‌ లైసెన్సు ఉంటే, పెద్దగా అనుభవం, నైపుణ్యం లేకపోయినా బస్సులను అప్పగిస్తున్నారని యాజమాన్యంపై ఆరోపణలు వస్తున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని వివిధ డిపోల్లో సుమారు 1500 మంది తాత్కాలిక డ్రైవర్లు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ శాతం లారీలు, ట్రాక్టర్‌లు, తదితర సరకు రవాణా వాహనాలను నడిపిన వారే కావడం గమనార్హం.

అంబర్ పేట్ పోలిస్ స్టేషన్ పరిధిలో చే నెంబర్ చౌరస్తాలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బైకర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. అతడిని ఘట్కేసర్‌కు చెందిన శ్యామ్‌గా పోలీసులు గుర్తించారు. కాచిగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కోఠి నుంచి ఉప్పల్ వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అలాగే నిజామాబాద్ లో ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యంతో ఘోర విషాదం చోటు చేసుకుంది. నిజామాబాద్‌ నగరంలోని ఎన్టీఆర్‌ చౌరస్తా వద్ద బుధవారం ఓ ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందింది. నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన అబీబా బేగం (45) ఇంటి నుంచి మార్కెట్‌ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా.. అదే సమయంలో నందిపేటనుంచి నిజామాబాద్‌ వైపు వచ్చిన ఆర్టీసీ బస్సు ఎన్టీఆర్‌ చౌరస్తా వద్ద అబీబా బేగంను ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. బస్సు డ్రైవర్‌ కర్షక్‌ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అనుభవం లేని డ్రైవర్‌ బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

ఆర్టీసీ బస్సుల ప్రమాద ఘటనలపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సిటీ బస్సులు నడిపేందుకు ప్రత్యేక నైపుణ్యం, శిక్షణ అవసరమని, అలాంటి శిక్షణ కొరవడిన వ్యక్తులు బస్సులు నడపడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆర్టీసీ తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్‌ ఆరోపించారు. తాత్కాలిక డ్రైవర్ల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల మద్యం సేవించి బస్సులు నడపడం, అదుపు తప్పి డివైడర్‌లకు ఢీకొట్టడం లేదా ముందు బస్సులను ఢీకొట్టడం లాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్‌లోని హయత్‌నగర్, కూకట్‌పల్లిలో జరిగిన ప్రమాదాలు ప్రయాణికులను, వాహనదారులను భయాందోళనకు గురి చేశాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ప్రైవేట్ డ్రైవర్స్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఆర్టీసీ చేస్తున్న సమ్మె మీద, ప్రైవేట్ డ్రైవర్స్ చేస్తున్న రోడ్డు ప్రమాద ఘటనల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

ఈ క్రింద వీడియో చూడండి