వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ముగ్గురు అరెస్ట్ పులివెందుల బ‌య‌లు దేరిన జ‌గన్

241

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి పోలీసులు తొలి అరెస్టు చేశారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి, వైఎస్‌ కుటుంబ సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, వంటమనిషి కుమారుడు ప్రకాశ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. పులివెందుల కోర్టులో వీరిని హాజరుపరచగా ఏప్రిల్‌ 8 వరకు రిమాండ్‌ విధించారు. కాగా.. వివేకా గుండెపోటుతో చనిపోయారంటూ ఈ నెల 15న ఉదయం ప‌లు టీవీ చానల్‌లో వార్త ప్రసారమైన సంగతి తెలిసిందే. కానీ.. వివేకాది హత్యేనన్న విషయం ఆ రోజు ఉదయమే ఈ ముగ్గురికీ తెలుసని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో స్పష్టం చేశారు.

Image result for ys vivekananda reddy

అయితే, ఆ హత్యకు సంబంధించి సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ఎర్రగంగిరెడ్డి, మూలి వెంకట కృష్ణారెడ్డి, ఎద్దుల ప్రకాశ్‌ ప్రయత్నించారని అందులో పేర్కొన్నారు. ‘‘ఈ కేసులో ఏ1.. తుమ్మలపల్లి గంగిరెడ్డి అనే ఎర్రగంగిరెడ్డి. ఇతను వ్యవసాయదారుడు. తొండూరు మండలం తుమ్మలపల్లెకు చెందిన ఈయన పులివెందులలో కాపురం ఉంటున్నాడు. ఏ2.. వెంకటకృష్ణారెడ్డి పులివెందులలో ఓ స్కూలులో అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌గా పనిచేస్తూ వివేకా పీఏగా వ్యవహరిస్తున్నారు…. ఏ3.. ఎద్దుల ప్రకాశ్‌ ఎంబీఏ చదివి నిరుద్యోగిగా ఉన్నాడు. ఇతను వంట మనిషి కుమారుడు. ఈ ముగ్గురూ వివేకా హత్యానేరానికి సంబంధించిన సాక్ష్యాలను మాయం చేసే నేరానికి పాల్పడ్డారు. వివేకాను అత్యంత కిరాతకంగా హత్య చేసి, తర్వాత సాక్ష్యాలు చెరిపేసేందుకు ప్రయత్నించినట్టు మా దర్యాప్తులో తేలింది. ఈ నెల 14 రాత్రి 11.30 నుంచి 15వ తేదీ తెల్లవారుజామున 5.30గంటల మధ్య ఈ హత్య జరగ్గా.. 15వ తేదీ 8 గంటలకు ఏ2 వెంకటకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయన ఆరోజు ఉదయం 5.30 గంటలకు వివేకా ఇంటికి వెళ్లారు. అప్పటికి వివేకా లేవకపోవడంతో అరగంటపాటు దినపత్రిక చదివి.. వివేకా భార్య సౌభాగ్యమ్మకు ఫోన్‌ చేశారు. ఆయన్ను మేల్కొలపాలా వద్దా అని అడగ్గా… రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉంటారు కాబట్టి మేల్కొలపవద్దని ఆమె సూచించారు.

Image result for ys vivekananda reddy

ఆ తర్వాత అరగంటకు వంట మనిషి లక్ష్మి, ఆమె కుమారుడు ప్రకాశ్‌ వచ్చారు. వివేకాను నిద్ర లేపాల్సిందిగా వెంకట కృష్ణారెడ్డి.. లక్ష్మిని కోరారు. ఆమె ప్రయత్నించినా.. లోపల నుంచి వివేకా స్పందించలేదు. ముగ్గురూ కలిసి తలుపు కొట్టినా తలుపు తీయలేదు. దీంతో.. వాచ్‌ మాన్‌ రంగన్న ఇంటి వెనక్కి వెళ్లి.. పక్క తలుపు తెరిచి ఉన్నట్లు పీఏకి చెప్పడంతో అక్కడి నుంచి బెడ్‌రూమ్‌లోకి వెళ్లారు. అక్కడ దాదాపు రెండు లీటర్ల రక్తం నేలపై పడి ఉంది. కానీ వివేకా అక్కడ లేరు. బాత్‌రూమ్‌లో రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉన్నారు. వారు నాడి చూసి.. ఆయన మరణించినట్లు తెలుసుకున్నారు. నుదుటిపైన, తల వెనుక భాగంలో, అరచేతిలో.. రక్తమోడుతున్న గాయాలను వారు గమనించారు. దీంతో.. గుర్తుతెలియని వ్యక్తులెవరో ఆయన్ను ఏదో ఆయుధంతో కొట్టి చంపి ఉంటారనే నిర్ణయానికి వారు వచ్చారు.’’ అని విచారణ అధికారి.. పులివెందుల డీఎస్పీ నాగరాజ రిమాండు రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు.

Image result for ys vivekananda reddy

ఘటనాస్థలిలో కొన్ని వెంట్రుకలు, బిందు స్టిక్కర్‌ (బొట్టుబిళ్ల) మరికొన్ని వస్తువులను సేకరించినట్టు డీఎస్పీ రిమాండ్‌ రిపోర్టులో తెలిపారు. కృష్ణారెడ్డి వద్ద ఉన్న వివేకా మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. బెడ్‌రూములో దొరికిన లేఖను కృష్ణారెడ్డి.. వివేకా కుమార్తె సునీతరెడ్డికి ఇవ్వగా, ఆమెకు తమకు ఇచ్చినట్టు పేర్కొన్నారు. అంతేకాదు.. సాక్షుల్లో ఒకరైన షేక్‌ ఇనాయతుల్లా నుంచి ఒక మొబైల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని, ముగ్గురు నిందితులూ సాక్ష్యాలను మాయం చేయకముందు అతడు ఆ ఫోన్‌లో ఘటనా స్థలాన్ని ఫొటోలు, వీడియోలు తీశాడని తెలిపారు. ఆసుపత్రి మార్చురీలో రక్తం అద్దిన కాటన్‌ బ్యాండేజీని స్వాధీనం చేసుకున్నామని.. వివేకా తలపై ఉన్న గాయాలకు ఈ బ్యాండేజీ క్లాత్‌ కట్టినట్లుగా గుర్తించామని వెల్లడించారు. గాయాలు కనిపించకుండా ఉండాలన్న ఆలోచనతోనే ఇలా చేశారని అభిప్రాయపడ్డారు.

ఈ క్రింది వీడియో చూడండి

వివేకా హత్యపై జరిపిన దర్యాప్తు ఆధారంగా.. ఆయనను అత్యంత కిరాతకంగా హింసించి, ప్రమాదకరమైన ఆయుధంతో తలలోపల మెదడుకు దెబ్బతగిలేలా కొట్టి దారుణంగా హత్య చేశారనే నిర్ణయానికి వచ్చినట్టు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ హత్యకు పాల్పడిన వ్యక్తి చట్టం చేతుల నుంచి తప్పించుకునేందుకు అవకాశం కల్పించేలా సాక్ష్యాలను మాయం చేసేందుకు పైన పేర్కొన్న ముగ్గురు నిందితులూ ప్రయత్నించారనేందుకు ఆధారాలు లభించినట్టు తెలిపారు. దర్యాప్తులో తేలిన అంశాలను బట్టి.. వివేకాను చంపిందెవరో ఆ ముగ్గురికీ తెలుసనిపిస్తోందని, అందుకే వారు కావాలనే సాక్ష్యాధారాలు చెరిపేసే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఈ హత్యకు సంబంధించి మరింతమందిని విచారించి మరిన్ని సాక్ష్యాలు సేకరించాల్సి ఉందని.. నిజాన్ని వెలికితీయాల్సి ఉందని పేర్కొన్నారు. నిందితులకు బెయిల్‌ ఇస్తే కేసును తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి వారు పోలీసు కస్టడీలోనే ఉండాలని స్పష్టంచేశారు.