చంద్రబాబు కర్నూలు నుంచి పోటీ చేయాలి..టిజి భరత్ సంచలన వ్యాఖ్యలు..

458

వ్యాపారవేత్త రాజ్యసభ ఎంపి టిజి వెంకటేష్ కుమారుడు టిజి భరత్ సంచలన వ్యాఖ్యలు చేసారు..వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు నుంచి పోటీ చేయాలని వ్యాఖ్యానించారు..చంద్రబాబు జిల్లా నుంచి పోటీ చేస్తే 14 సీట్లు తెలుగుదేశం సొంతమవుతాయని ఆయన అన్నారు..ఒకవేళ బాబు కానీ కర్నూలు నుంచి పోటీ చేయని పక్షంలో.. సర్వే ప్రకారం గెలిచే వారికే కర్నూలు సీటును కేటాయించాలంటూ పీటముడిని వేశారు. ఓవైపు కర్నూలు అసెంబ్లీ స్థానాన్ని ఎస్వీ మోహన్ రెడ్డికి ఇవ్వనున్నట్లు ప్రకటించిన తర్వాత కూడా ఇలా కెలకటం బాగోలేదన్న వాదన వినిపిస్తోంది. అంతేకాదు.. తమ లోకల్ రాజకీయాల్లోకి నేరుగా బాబునే తీసుకురావటంపై విస్మయం వ్యక్తమవుతోంది…

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కర్నూలు జిల్లాలో అంతంత మాత్రంగానే టీడీపీ బలం ఉంది. ఒకవేళ బాబు కానీ కర్నూలు బరిలో దిగితే.. తుది ఫలితం ఏమవుతుందన్న సందేహం లేకపోలేదు. నిన్న మొన్నటివరకూ మోడీతో జతకట్టిన బాబును.. కర్నూలు పాతబస్తీలోని మైనార్టీలు క్షమిస్తారా? అన్నది ప్రశ్న. అంతేకాదు.. భరత్ చెప్పినట్లుగా బాబు పోటీ చేసిన తర్వాత కూడా కర్నూలులో అనుకున్న సీట్లు గెలవని పక్షంలో దానికి బాధ్యత వహించాల్సిన భారం బాబు మీదే ఉంటుంది. సొంత నియోజకవర్గమైన కుప్పంను వదిలేసి.. కర్నూలులో పోటీ చేస్తే.. స్థానికంగా వ్యతిరేకత రావటమే కాదు.. బాబు తీరుపై విమర్శలు వెల్లువెత్తటం ఖాయం. ఇలా ఎన్నో సమస్యలు తలెత్తేందుకు వీలున్న అంశంలోకి తనను తీసుకువస్తున్న టీజీ భరత్ తీరుపై బాబుకు ఒళ్లు మండటం పక్కా అని చెబుతున్నారు.