సుష్మ స్వరాజ్ రియల్ స్టోరీ

157

సుష్మ స్వరాజ్..రాజకీయాలలో ఒక సంచలనం. 25 ఏళ్లకే రాజకీయాలలోకి వచ్చి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. కేంద్రమంత్రిగా సేవలు అందించారు. విదేశాల్లో భారతీయులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, పొరుగు దేశ ప్రజలు ప్రాణాంతక రోగాల బారిన పడి మన దేశంలో వైద్యం చేయించుకోవాలనుకున్నా.. సుష్మా స్వరాజ్ వైపు చూసేవారు. అంతలా ఆమె దేశ ప్రజలకు భరోసా ఇచ్చారు. మరి సుష్మ స్వరాజ్ ప్రస్థానం ఏమిటి..ఆమె రాజకీయ రంగంలో చేసిన సేవలు ఏమిటి..ఇలా అనేక విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బాల్యం, విద్యాభ్యాసం…
సుష్మ స్వరాజ్ 1952 ఫిబ్రవరి 14వ తేదీన సుష్మాస్వరాజ్ హర్యానాలోని అంబాలా కంటోన్మెంట్ లో జన్మించారు. సుష్మా స్వరాజ్ స్వతహాగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తండ్రి హర్ దేవ్ శర్మ ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలకంగా ఉండేవారు. సంఘ్ సంచాలక్ స్థాయిలో పనిచేశారు. సుష్మాస్వరాజ్ కళాశాల విద్య వరకు స్థానికంగా అంబాలాలోనే జరిగింది. స్థానికంగా సనాతన ధర్మ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. సంస్కృతం అంటే సుష్మాస్వరాజ్ కు పంచప్రాణాలు. ఆ భాషలోనే ఆమె తన డిగ్రీని పూర్తి చేయడం విశేషం. ఆ తరువాత పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగర్ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. హిందీ భాషలో పంజాబ్ యూనివర్శిటీ నిర్వహించిన పోటీల్లో వరుసగా మూడుసార్లు అత్యుత్తమ వక్తగా అవార్డులను అందుకున్నారు. 1970లలో విద్యార్థి దశలోనే ఆమె ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా విద్యార్థి నాయకురాలిగా ఉద్యమం నడిపారు.

Image result for సుష్మ స్వరాజ్

వ్యక్తిగత జీవితం..
1975లో సుష్మాస్వరాజ్ వృత్తిరీత్యా న్యాయవాది అయిన స్వరాజ్ కౌశల్‌ను వివాహంచేసుకున్నది. వారి సంతానం ఒక కూతురు. భర్త స్వరాజ్ కౌశల్ సుప్రీంకోర్టు న్యాయవాదిగా, మిజోరాం గవర్నరుగా పనిచేశాడు. బరోడా బాంబు పేలుళ్ళ కేసులో జార్జి ఫెర్నాండెజ్ తరఫున వాదించి గెలిపించాడు.

రాజకీయ జీవితం..
1977లో జనతా పార్టీ తరఫున హర్యానా విధానసభ సభ్యురాలిగా ఎన్నికై 1982 వరకు ఆ పదవిని నిర్వహించి మళ్ళీ 1987లో రెండో పర్యాయం భారతీయ జనతా పార్టీ తరఫున హర్యానా విధానసభకు ఎన్నికైనారు.1977 నుంచి 1979 వరకు దేవీలాల్ ప్రభుత్వంలో కార్మిక మరియు ఉపాధి కల్పన శాఖల కేబినెట్ మంత్రిగా వ్యవహరించారు. 1984లో సుష్మాస్వరాజ్ భారతీయ జనతా పార్టీలో చేరినారు. 1987 నుంచి 1990 వరకు దేవీలాల్ నేతృత్వంలోని లోకదళ్-భారతీయ జనతా పార్టీ సంయుక్త ప్రభుత్వంలో ఈమె విద్య, ఆరోగ్య మరియు సివిల్ సప్లై శాఖల కేబినెట్ మంత్రిగా వ్యవహరించారు. 1990లో సుష్మాస్వరాజ్ రాజ్యసభకు ఎన్నికై జాతీయ రాజకీయాలలో ప్రవేశించారు. అంతకు ముందు 1980, 1984, 1989లలో కార్నాల్ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి పరాజయం పొందినారు. 1996లో ఈమె దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి 11వ లోక్‌సభకు ఎన్నికైనారు. 1996లో 13 రోజుల అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించింది. 1998లో 12వ లోక్‌సభకు మళ్ళీ రెండో పర్యాయం దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికై వాజపేయి రెండో మంత్రివర్గంలో మళ్ళీ అదే శాఖను చేపట్టినారు.

Image result for సుష్మ స్వరాజ్

మార్చి 19 నుంచి అదనంగా టెలికమ్యునికేషన్ శాఖ బాధ్యతలు కూడా నిర్వహించారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో విజయం సాధించడానికి 1998 అక్టోబరులో సుష్మాస్వరాజ్‌ను భారతీయ జనతా పార్టీ అధిష్టానం కేంద్రమంత్రిమండలి నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టాడానికి పంపబడ్డారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి మహిళగా సుష్మాస్వరాజ్ రికార్డు సృష్టించిననూ, ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ పరాజయం పొందుటతో డిసెంబరులో మళ్ళీ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశీంచారు. 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సోనియా గాంధీ కర్ణాటకలోని బళ్ళారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేయుసమయంలో భారతీయ జనతా పార్టీ తరఫున బలమైన మహిళా నాయకురాలిని నియమించుటకై సుష్మాస్వరాజ్‌ను బరిలోకి దించారు. దేశ స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ పార్టీ తప్ప మరే పార్టీ ఇక్కడినుంచి విజయం సాధించలేకపోవడంతో సోనియాగాంధీ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకొంది. ఊహించినట్లుగానే సుష్మాస్వరాజ్ ఓడిపోయిననూ, సోనియాపై పోటీచేసి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. 2004 ఏప్రిల్లో సుష్మాస్వరాజ్ ఉత్తరఖండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైంది. 2000 సెప్టెంబర్ నుంచి 2003 జనవరి వరకు కేంద్రంలో సమాచార, ప్రసార శాఖ కేబినెట్ మంత్రిగా పనిచేసింది. జనవరి 2003 నుంచి మే 2004 వరకు మరో రెండూ శాఖలు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మరియు పార్లమెంటరీ వ్యవహారాలు బాధ్యతలు చేపట్టింది. 2006 ఏప్రిల్లో మధ్యప్రదేశ్ నుంచి మళ్ళీ రాజ్యసభకు ఎన్నికై ఆ పదవిలో కొనసాగారు.

ఈ క్రింది వీడియో ని చూడండి

తర్వాత 2014 లో మధ్యప్రదేశ్ లోని విదిష లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి, ఘన విజయం సాధించారు. 2014లో బీజేపీ అధికారాన్ని అందుకుంది. నరేంద్ర మోడీ క్యాబినెట్ లో విదేశాంగ మంత్రిత్వశాఖ పగ్గాలను అందుకున్నారు. ఇందిరాగాంధీ తరువాత ఓ మహిళ విదేశాంగ శాఖ మంత్రిగా నియమితులు కావడం అదే తొలిసారి. విదేశాంగ శాఖ మంత్రిగా ఆమె సుష్మాస్వరాజ్ చేసిన సేవలను పాకిస్తానీయులు సైతం ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో ఎక్కడ భారతీయులు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నా తాను ఉన్నాననే ధైర్యాన్ని ఇచ్చేవారు. ట్విట్టర్ లో అత్యంత యాక్టివ్ గా ఉండే మంత్రిగా పేరు సంపాదించుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే సంబంధిత దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయ అధికారులను అప్రమత్తం చేసేవారు. అయితే 2019 లో రాజకీయాలను విరామం ఇచ్చారు. ఎన్నికలో పోటీ చెయ్యలేదు. 2019 ఆగస్టు 6న గుండెపోటు రావడంతో చికిత్సకోసం ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. ఏది ఏమైనా దేశం ఒక గొప్ప నాయకురాలిని కోల్పోయారు. ఆమె చేసిన సేవలను గుర్తుకుతెచ్చుకుని కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఆమె ప్రజల మనసులో చిరకాలం నిలిచిపోవాలని మనసారా కోరుకుందాం.