వైయ‌స్ వివేకా హ‌త్య పై కూతురు సునీత సంచ‌ల‌న కామెంట్లు వారే ప‌క్కా ప్లాన్ తో హ‌త్య చేశారు

300

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యపై ఆయన కుమార్తె వైఎస్‌ సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోదరుడు వైఎస్‌ అవినాశ్‌ రెడ్డితో కలిసి పులివెందుల పీఎస్‌కు వచ్చిన ఆమె… తన తండ్రి హత్యపై లోతుగా విచారణ జరిపించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం వైఎస్‌ సునీత మాట్లాడుతూ.. ‘మా నాన్న రాజకీయాల్లో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఆయన ప్రచారం చేస్తున్నారు. మా నాన్న ప్రచారాన్ని అడ్డుకునేందుకే ప్రత్యర్థులు కుట్ర పన్ని ఆయనను హత్య చేశారని అనుమానిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

కాగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వైఎస్‌ వివేకానందరెడ్డిది హత్యేనని పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైన సంగతి తెలిసిందే. ఆయన శరీరంపై ఏడు కత్తి గాయాలు ఉన్నాయని వైద్యులు తమ నివేదికలో పేర్కొన్నారు. పదునైన ఆయుధంతో వైఎస్‌ వివేకానందరెడ్డి తల, శరీరంపై ఏడుసార్లు దాడి చేసినట్లు గుర్తించారు. నుదుటిపై లోతైన రెండు గాయాలు, తల వెనక భాగంలో మరో గాయం, తొడ భాగం, చేతిపైనా మరో గాయం అయినట్లు తెలుస్తోంది. ఇక వైఎస్‌ వివేకానంద రెడ్డి హఠాన్మరణంపై ఆయన పీఏ కృష్ణారెడ్డి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే ఈ స‌మ‌యంలో..

దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి పేరిట ఓ లేఖ పెద్ద దుమారం తీసుకువస్తోంది. కారు డ్రైవరు ప్రసాద్‌ తనను చచ్చిపోయేట్లు కొట్టాడని వివేకా పేరుతో రాసిన లేఖను ఆయన బంధువులు శుక్రవారం సాయంత్రం పోలీసులకు అందించారు. ఇదే లేఖపై జగన్‌ స్పందిస్తూ గొడ్డలితో నరికి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతన్న వ్యక్తి ఎలా ఈ లేఖ రాయగలుగుతారని ప్రశ్నించారు. కారు డ్రైవరు ప్రసాద్‌, రాజారెడ్డి హత్య కేసులో నిందితుడు ఆర్‌.సుధాకర్‌రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ లేఖను పోలీసులు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపి అసలు వైఎస్‌ వివేకానే ఈ లేఖ రాశాడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గురువారం రాత్రి 11.30గంటలకు కారు డ్రైవరు ప్రసాద్‌ వివేకాను ఆయన నివాసంలో వదలి వెళ్లిపోతుండగా భోజనానికి డబ్బులివ్వగా తాను ఇంట్లోనే భోంచేస్తానని వెళ్లిపోయాడు. ఉదయం 5.30 గంటలకు పీఏ కృష్ణారెడ్డి వచ్చారు. 6.30గంటల ప్రాంతంలో వాచ్‌మేన్‌ వెనుక వైపు తలుపు తీసిన విషయాన్ని గుర్తించి కృష్ణారెడ్డికి వివరించారు. ఇద్దరూ వెళ్లి చూడగా బాత్‌రూంలో వివేకా విగత జీవుడై కనిపించాడు. అప్పుడే గుండెనొప్పితో కుప్పకూలిపోయి దెబ్బలు తగలడంతో రక్తస్రావమై వివేకా చనిపోయాడని బంధువులే పప్రాథమికంగా నిర్ధరించారు. బెడ్రూములో రక్తపు మరకలను కడిగేసినట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసులకు 6.40 గంటలకు సమాచారం రావడంతో సీఐ శంకరయ్య సంఘటన స్థలానికి చేరే సమయానికే రక్తాన్ని తుడుస్తూ కనిపించడంతో ఆయన ఇలా చేయకూడదంటూ అడ్డు తగిలారు. పోస్టుమార్టం నిర్వహించే వరకు అందరిలోనూ హఠాన్మరణం చెందినట్లుగా ప్రచారం సాగుతూ వచ్చింది. డాక్టర్లు పోస్టుమార్టం చేసేందుకు మృతదేహాన్ని పరిశీలించినప్పుడు తలపై బలమైన గాయాలు, ఒళ్లంతా గొడ్డలితో నరికిన గాట్లు కనిపించాయి. అప్పుడే హత్యకు గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది.. మొత్తానికి సిట్ దీనిపై విచార‌ణ జ‌రిపి వాస్త‌వాలు బ‌య‌ట‌పెట్టాలి అని కోరుతున్నారు ఆ కుటుంబం.