జగన్ పాలనపై సంచలన వాఖ్యలు చేసిన రోజా

137

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తన మొదటి బడ్జెట్‌లోని ప్రతి రూపాయిని ప్రజలకు అందించేలా చర్యలు తీసుకుందని, ప్రజా సంక్షేమమే ప్రాధాన్యంగా రూపొందిన ఈ బడ్జెట్‌కు సంబంధించిన ద్రవ్యవినిమయ బిల్లును మనసాక్షి కలిగిన ఎవరూ వ్యతిరేకించబోరని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్‌ శ్రీమతి ఆర్కే రోజా స్పష్టం చేశారు. ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను గుర్తించి.. ప్రజా పథకాలను ప్రవేశపెట్టిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని అభినందించారు.

Image result for roja ys jagan

పదేళ్ల కిందట దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అకాల మృతి గురించి ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే రోజా ఉద్వేగంగా మాట్లాడారు. దేశం గర్వించే పథకాలను ప్రవేశపెట్టి.. తెలుగువాడి పాలనా దక్షతను చాటిన వైఎస్సార్‌ కోట్లాది ప్రజల మధ‍్య నుంచి ఆకస్మికంగా కనుమరుగైపోయారని, తాను ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి పేదవాడికీ అందుతున్నాయో? లేదా తెలుసుకోవడానికి వెళ్లి.. అంతర్ధానమయ్యారని, ఆయన మృతితో తమ భవిష్యత్తు కూలిపోయిందని తెలుగు ప్రజలు కుమిలిపోయారని అన్నారు. అన్నం పెట్టిన రాజన్న, చదువు చెప్పిన రాజన్న, ఆరోగ్యాన్ని ఇచ్చిన రాజన్న ఇకలేరని తెలిసి తెలుగు ప్రజలు గుండెలవిసేలా ఏడ్చారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఇన్నాళ్లకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూసి మళ్లీ రాజన్న రాజ్యం వచ్చిందని, ప్రజల రాజ్యం వచ్చిందని ప్రతి ఒక్కరూ గుండెమీద చేయి వేసుకొని ధైర్యంగా చెప్తున్నారని కొనియాడారు. చరిత్రలోనే మొదటిసారి రైతులు, విద్యార్థులు, అవ్వతాతలు, ప్రైవేటు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆటో డ్రైవర్లు, బట్టలు కుట్టే ట్రైలర్లు, మత్స్యకారులు, నాయి బ్రాహ్మణాలు ఇలా అన్ని వర్గాలు ప్రజలు.. ఐదుకోట్లమంది ఇది మా బడ్జెట్‌ అని సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ఇందుకుగాను సీఎం వైఎస్‌ జగన్‌కు, ఆయన సూచనల మేరకు బడ్జెట్‌ రూపొందించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి అభినందనలు తెలిపారు.

Image result for roja ys jagan

ఇప్పటివరకు హైకమాండ్‌ ఆడించే సీఎం, సీల్డ్‌కవర్‌ సీఎం, ప్రజలను ఛీటింగ్‌ చేసే సీఎంను చూశాం కానీ, మొట్టమొదటిసారిగా మాట మీద నిలబడే సీఎం ఇప్పుడే చూస్తున్నామని, పాదయాత్రలో ఇచ్చిన ప్రతి మాటను సీఎం వైఎస్‌ జగన్‌ నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్‌ లేరనే బాధతో చనిపోయిన కుటుంబాలకు ఇచ్చిన మాట కోసం.. వైఎస్సార్‌ ఆశయ సాధన కోసం తెలుగు ప్రజల పక్షాల నిలబడి.. రాజకీయ రాబంధులను, ఢిల్లీ పెద్దలను, ఇక్కడే ఉన్న కొన్ని గద్దలను ఎదురించి.. కడవరకు నిలబడి పదేళ్లు పోరాడిన ఏకైక వీరుడు వైఎస్‌ జగన్‌ అని అన్నారు. ఏ ప్రజల కోసమైతే పోరాడారో.. ఆ పోరాట ఫలితాలను ఈ బడ్జెట్‌ ద్వారా ప్రజలకు అందేలా చేశారని ప్రశంసించారు. ఇంతలా మాట కోసం నిలబడ్డారు కాబట్టే ఎవరికీ సాధ్యం కానిరీతిలో వైఎస్‌ జగన్‌కు 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు, 50శాతం ఓట్లు, 86శాతం సీట్లు.. కట్టబెట్టారని, ప్రజలు ఒక నాయకుణ్ని నమ్మితే ఇంతలా నమ్ముతారా? అనేరీతిలో వైఎస్‌ జగన్‌ చరిత్ర సృష్టించారని అన్నారు.

Image result for roja ys jagan

ప్రధానుల కొడుకుల్ని చూశాం, ముఖ్యమంత్రుల కొడుకుల్ని చూశాం కానీ, వైఎస్సార్‌ కొడుకులాంటి కొడుకుని ఇక చూడం. చూడబోమని అన్నారు. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు, ఆయన కొడుకు 123 ఎమ్మెల్యేలు ఉన్న పార్టీని 23 ఎమ్మెల్యేలకు తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. చివరకు తన సొంత కొడుకునీ గెలిపించుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారని ధ్వజమెత్తారు. తన సీటును తాను గెలుచుకోలేని లోకేశ్‌.. అడ్డదారిలో వచ్చిన ఎమ్మెల్సీ పదవితో రాజకీయ పబ్బం గడుపుకుంటూ మళ్లీ తమకే ప్రశ్నలు వేస్తున్నాడని, అతని అమాయకత్వానికి నవ్వాలో, ఏడ్వాలో అర్థం కావడం లేదన్నారు. వైఎస్సార్‌ కొడుకు మాత్రమే ప్రజల విశ్వాసం పొందారని, రాజకీయాల్లో విశ్వసనీయత అనే పదానికి అర్థం తెలిపిన ఒకే ఒక నాయకుడు వైఎస్‌ జగన్‌ అని పేర్కొన్నారు. ప్రజలకు మాట ఇచ్చి తప్పిన నాయకుడు, విశ్వసనీయత లేని నాయకుడు ఇంకా ప్రతిపక్షంగా ఉండటం అవసరమా? 600 హామీలు ఇచ్చి ఆరు హామీలూ నెరవేర్చలేని చంద్రబాబుకు ప్రతిపక్ష నేతగా ఉండే అర్హత ఉందా? అసలు చంద్రబాబుకు రాజకీయాల్లో కొనసాగే అర్హత ఉందా అనే చర్చ జరగాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటే శాసనంగా, మ్యానిఫెస్టోనే పవిత్రగ్రంథంగా భావిస్తున్న వైఎస్‌ జగన్‌ నాయకత్వ శకం ఇక మొదలైందన్నారు.

ద్రవ్య వినిమయ బిల్లులో లోపాలేమీ లేకపోవడంతో ఎక్కడ పొగడాల్సి వస్తుందోననే భయంతోనే చంద్రబాబు పారిపోయారని, ఆయన తీరు చూస్తుంటే.. ఉడకవే ఉడకవే ఓ ఉల్లిగడ్డ.. నువ్వెంతో ఉడికినా నీ కంపు పోదంట అన్నట్టుగా ఉందన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో తానుచేయలేని సంచలన చట్టాలు, విప్లవాత్మక పథకాలు.. 45 ఏళ్ల యువకుడు చేస్తుంటే.. చంద్రబాబు ఏ మొహం పెట్టుకొని ఎలా తిరుగుతారని, అందుకే ఆయన అసెంబ్లీలో పారిపోయారని ఎద్దేవా చేశారు. పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు మా లోకల్‌ చంటీగాళ‍్లకే అంటే.. ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోసం చేసిన చంద్రబాబు పారిపోక ఏం చేస్తారని నిలదీశారు. వైఎస్‌ జగన్‌ అమలుచేస్తున్న చరిత్రాత్మక పథకాలతో చంద్రబాబు శాశ్వతంగా రాజకీయాల నుంచి పారిపోక తప్పదని వ్యాఖ్యానించారు. వైఎస్‌ జగన్‌ తన తొలి బడ్జెట్‌లో రైతులకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చారని, గత ప్రభుత్వ విధానాలతో అంపశయ్య మీద ఉన్న వ్యవసాయానికి ఆయుష్షు పోశారని కొనియాడారు. వ్యవసాయం దండగ అన్న గత పాలకుల ముందే వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నారని ప్రశంసించారు.