డి శ్రీనివాస్ తనయుడిపై నిర్భయ కేసు… చెక్ పెట్టేందుకేనా…

480

మాజీ పిసిసి అధ్యక్షుడు, రాజ్య సభ సభ్యుడు అయిన తెలంగాణ నేత డి శ్రీనివాస్ తనయుడు సంజయ్ పై ఆ రాష్ట్ర పోలీసులు నిర్భయ కేసు నమోదు చేసారు..తమను లైంగికంగా వేదిస్తున్నాడంటూ 11 మంది కాలేజీ విద్యార్దినులు ఆ రాష్ట్ర హోం మంత్రి నాయని నరసింహా రెడ్డి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసారు..ఆయన సొంతంగా నిర్వహిస్తున్న నర్సింగ్‌ కళాశాలలోని విద్యార్థినులే ఈ ఆరోపణలు చేయడంతో పరిస్థితి సీరియస్‌గా ఉంది. విద్యార్థినులను బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేసినట్లు చెప్పారు. పీవోడబ్ల్యు సంధ్య నాయకత్వంలో పదకొండుమంది విద్యార్థినులు మంత్రిని, డీజీపీని కలిసి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు..

హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 342, 354, 506, 354ఎ(నిర్భయ చట్టం) కింద సంజయ్‌పై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో సంజయ్‌ను అరెస్టు చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లగా.. ఇంట్లో లేరు. దీంతో ధర్మపురి సంజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిజానికి ధర్మపురి శ్రీనివాస్ తెరాస రాజ్యసభ సభ్యుడు. ఆయన ఇటీవల తెరాసపై అలిగి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకోవాలని భావించారు. దీనిపై తీవ్రస్థాయిలో చర్చ కూడా జరిగింది. గ్రూపు రాజకీయాలతో పాటు తనకు ఏమాత్రం గౌరవ మర్యాదలు లేకపోవడంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ, తెరాస సీనియర్ నేతలు బుజ్జగించడంతో పార్టీలో కొనసాగుతున్నారు. డీఎస్‌కు చెక్ పెట్టేందుకే ఆయన తనయుడిపై నిర్భయ కేసు నమోదైందన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.