మొదటి రోజే మోడీ ప్రభుత్వానికి డిప్యూటీ చైర్మన్ షాక్..!

427

రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ పదవిని పొందడానికి బిజెపి ప్రభుత్వం నానా కష్టాలు పడింది..చివరి వరకూ ఉత్కంట కలిగించిన ఈ ఎన్నికల్లో గెలవడం కోసం చాలా ప్లానింగ్ చేసింది…తమ మీద ఎప్పుడూ విమర్సలకు దిగే శివసేన పార్టీని బుజ్జగించడం, కేసిఆర్ వంటి వారిని మద్దతు కోరి తమవైపుకు తిప్పుకోవడం వంటి పరిస్థితులు నెలకొన్నాయి..ఇంత చేసినా కూడా స్వల్ప ఆధిక్యంతో గట్టెక్కింది బిజెపి ప్రభుత్వం.. మరింతలా కష్టపడి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టిన హరివంశ్ సింగ్ కేంద్రానికి చిన్నపాటి షాకిచ్చారు. ఒక ప్రైవేటు తీర్మానంపై ఓటింగ్ కు అనుమతి ఇచ్చిన ఆయన తీరుతో కేంద్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది…

అదృష్టవశాత్తు..ఆ సమయంలో రాజ్యసభలో విపక్ష సభ్యులు ఎక్కువ మంది లేకపోవటంతో ఇబ్బందికర పరిస్థితి నుంచి తృటిలో తప్పించుకున్నట్లైంది. ఇంతకీ.. ఈ పరిస్థితి ఎందుకు ఎదురైందన్న వివరాల్లోకి వెళితే.. ఒక రాష్ట్రంలో ఎస్సీ.. ఎస్టీలుగా రిజర్వేషన్ ఉన్న వారు మిగిలిన రాష్ట్రాల్లో సైతం ఎస్సీ ఎస్టీలుగా ఆ సౌలభ్యాన్ని అనుభవించేట్లు రాజ్యాంగాన్ని సవరించాలని సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎంపీ విశ్వంభర్ ప్రసాద్ నిషాద్ ఒక ప్రైవేటు తీర్మానాన్ని పెట్టారు. అయితే.. ఇది అసాధ్యమని.. ఒక కులాన్ని ఎస్సీ.. ఎస్టీ లేదంటే ఓబీసీ అనే కేటగిరిల్లో చేర్చటానికి పెద్ద ప్రక్రియ ఉంటుందని.. అలాంటి వేళ.. దేశం మొత్తానికి ఒకే విధానం అసాధ్యమని సామాజిక న్యాయశాఖామంత్రి థావర్ చంద్ గెహ్లాట్ తేల్చి చెప్పారు. అయితే.. ఈ అంశంపై ఓటింగ్ జరగాలని విపక్షాలు పట్టుపట్టాయి.

దీనికి ఓకే చెప్పిన డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సింగ్ సంచలనం సృష్టించారు. అయితే.. ఇలాంటి అనుమతి ఇవ్వటం అసాధారణమని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేసినా హరివంశ్ వినలేదు. తాను ఒకసారి రూలింగ్ ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోనని చెప్పేశారు. డిప్యూటీ ఛైర్మన్ తీసుకున్న నిర్ణయంతో ఉలిక్కిపడ్డ అధికారపక్షం.. తమ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులను సభలోకి రప్పించటానికి ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. అదే సమయంలో సభలో విపక్ష సభ్యులు ఎక్కువగా లేకపోవటంతో ఇబ్బందికర పరిస్థితి నుంచి మోడీ సర్కారు బయటపడగలిగింది. చివరకు సభలో 66-32 ఓట్ల తేడాతో ఓటింగ్ లో మోడీ సర్కారు విజయం సాధించింది. ఒకవేళ.. సభలో అధికార సభ్యుల కంటే విపక్ష సభ్యులు ఎక్కువగా ఉండి ఉంటే.. ఇబ్బందికర పరిస్థితుల్లోకి మోడీ సర్కారు దిగేది. కిందామీదా పడి హరివంశ్ ను గెలిపించి డిప్యూటీ ఛైర్మన్ ను చేస్తే.. తొలిరోజు ఇలా ఝులక్ ఇవ్వటాన్ని అధికారపక్ష సభ్యులు ఒక పట్టాన జీర్ణించుకోలేకపోతున్నారు.