మే 23: ఓట్ల లెక్కింపే కాదు..వైఎస్ కుటుంబంలో మ‌రో ప్రాధాన్య‌త ఉన్న తేదీ!

222

ప్ర‌పంచంలోనే అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశ‌మైన భార‌త్‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డే రోజు. దేశ ప్ర‌జ‌లంతా ఊపిరి బిగ‌బ‌ట్టుకుని ఎదురు చూస్తోన్న తేదీ అది. ఆ మాట కొస్తే.. కొన్ని ప్ర‌పంచ దేశాలు కూడా అంతే ఆస‌క్తిని చూపిస్తోన్నాయి మ‌న‌దేశ ఎన్నిక‌ల ఫ‌లితాల మీద. రెండు తెలుగు రాష్ట్రాల్లో దీనికి భిన్న‌మైన ప‌రిస్థితులేమీ లేవు. మ‌న రాష్ట్రంతో పాటు తెలంగాణ‌లో తొలిదశ‌లోనే ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముగిసిపోవ‌డంతో.. సుమారు 45 రోజుల పాటు ఫ‌లితాల కోసం ఎదురు చూడాల్సి వ‌స్తోంది. ప్ర‌త్యేకించి- ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా ముగియ‌డంతో మ‌రింత ఉత్కంఠ‌కు గురి చేస్తోంది. స‌ర్వేలు ఎలా ఉన్నా.. ఏపీలో ఏర్ప‌డే కొత్త ప్ర‌భుత్వం దేశ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషిస్తాయ‌ని, నిర్ణ‌యాత్మక శ‌క్తిగా మారుతాయంటూ జాతీయ స్థాయిలో వార్త‌లు వ‌స్తున్నాయి.

Image result for elections in india

అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఇన్నాళ్లూ ప్ర‌తిప‌క్ష పాత్ర‌ను పోషించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎన్నిక‌ల ఫలితాల కోసం ఆతృత‌గా ఉన్నాయి. ఈ రెండు పార్టీలకూ ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌గానే చెప్పుకోవ‌చ్చు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు గానీ, భార‌తీయ జ‌న‌తాపార్టీ ప్రాతినిథ్యాన్ని వ‌హిస్తున్న ఎన్డీఏ కూట‌మికి గానీ కేంద్రంలో సొంతంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి అవ‌స‌ర‌మైన స్థానాలు ద‌క్కే అవ‌కాశాలు లేవంటూ వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో- టీడీపీ, టీఆర్ఎస్‌, వైఎస్ఆర్ సీపీ వంటి ప్రాంతీయ పార్టీలు త‌మ‌ హ‌వా చలాయించ‌డానికి ఈ ఎన్నిక‌లు సువ‌ర్ణావ‌కాశంగా భావిస్తున్నారు విశ్లేష‌కులు.

Image result for elections in india

ఫ‌లితాల మాట ఎలా ఉన్నప్ప‌టికీ- వైఎస్ కుటుంబంలో మే 23వ తేదీకి మ‌రో ప్రాముఖ్య‌త ఉంది. అది విషాద‌క‌ర ఘ‌ట‌న‌తో ముడిప‌డి ఉన్న అంశం. అదే- వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తాత, దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి తండ్రి రాజారెడ్డికు హ‌త్య‌కు గురైన రోజు. మే 23వ తేదీ నాడే వైఎస్ రాజారెడ్డి దారుణ‌హ‌త్య‌కు గుర‌య్యారు. ప్ర‌త్య‌ర్థులు ఆయ‌న‌పై బాంబులు వేసి, వేటకొడ‌వ‌ళ్ల‌తో దాడి చేసి.. హ‌త్య‌కు పాల్ప‌డిన రోజు. 1998 మే 23వ తేదీన రాజారెడ్డి ఇడుపులపాయ‌లోని వ్య‌వ‌సాయ క్షేత్రం స‌మీపంలో ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు.

ఈ క్రింది వీడియో చూడండి

క‌డప జిల్లాలో తిరుగులేని రాజకీయ నాయకుడిగా ఎదిగిన వైఎస్ రాజారెడ్డి దారుణహత్యకు గురైన ఉదంతం ఈ నెల 23వ తేదీతో 21 సంవత్సరాలను పూర్తి చేసుకుంటుంది. అదే రోజు లోక్‌స‌భ, అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువడ‌బోతుండ‌టం, స‌ర్వేల ప్ర‌కారం చూస్తే.. వైఎస్ జ‌గ‌న్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ ఘ‌న విజ‌యం సాధించే అవ‌కాశాలు క‌నిపిస్తుండ‌టం కాక‌తాళీయం. 1998 మే 23వ తేదీన‌ మధ్యాహ్నం రాజారెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. రాష్ట్ర రాజ‌కీయాల్లో ఆ ఘ‌ట‌న ప్ర‌కంప‌న‌ల‌ను రేపింది. హ‌త్య జ‌రిగిన రోజు ఉద‌యం భారీగా వర్షం ప‌డింది. దీనితో- ఇడుపులపాయలోని వ్యవసాయక్షేత్రాన్ని సంద‌ర్శించ‌డానికి వైఎస్ రాజారెడ్డి త‌న అనుచ‌రుల‌తో క‌లిసి జీపులో వెళ్లారు. మధ్యాహ్నం వ‌ర‌కు అక్క‌డే గ‌డిపిన ఆయ‌న భోజ‌న సమయంలో పులివెందుల‌కు బ‌య‌లుదేరారు. అంత‌కుముందే భారీ వ‌ర్షం కుర‌వ‌డంతో క‌ల్వ‌ర్ట్ వ‌ద్ద వ‌ర‌ద‌నీరు పోటెత్త‌డంతో వైఎస్ రాజారెడ్డి ప్ర‌యాణిస్తోన్న జీపు..మార్గ‌మ‌ధ్య‌లోని వేముల మండ‌లం స‌మీపంలో ఓ కల్వర్ట్ దగ్గర నెమ్మ‌దించింది.

Image result for jagan elections in india

ఆ స‌మ‌యం కోస‌మే కాపు గాసి ఉన్న ప్ర‌త్య‌ర్థులు జీపుపై దాడి చేశారు. వెంట వెంటనే మూడు నాటు బాంబుల‌ను విసిరారు. జీపు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మరో బాంబు జీపు అద్దాలపై పడింది. మ‌రో బాంబు రాజారెడ్డిపై ప‌డింది. ఈ పేలుడులో గాయ‌ప‌డ్డ ఆయ‌న‌పై ప్ర‌త్య‌ర్థులు వేట కొడవళ్లతో దాడి చేశారు. చుట్టుముట్టి న‌రికేశారు. రాజారెడ్డి ప్రాణాలు కోల్పోయారు. అదే స‌మ‌యంలో రాజారెడ్డి అనుచరులు ప్ర‌తిదాడికి దిగారు. ఈ ఘ‌ట‌న‌లో ప్రధాన నిందితుడిగా ముద్ర‌ప‌డిన తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు పార్థసారథిరెడ్డి సోదరుడు ఉమామహేశ్వరెడ్డి తీవ్రంగా గాయపడి అనంతరం చనిపోయారు. రాజారెడ్డి హత్య విషయం తెలియడంతో కడపలో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. రాజారెడ్డి హత్య గురించి తెలియగానే జిల్లా వ్యాప్తంగా వైఎస్ కుటుంబ అభిమానులు, అనుచ‌రులు ప్రతిదాడులు చేయడానికి స‌న్న‌ద్ధం అయ్యారు.

Image result for jagan elections in india

రాజారెడ్డి హ‌త్య స‌మ‌యంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా ఉన్నారు. ఎక్క‌డా ప్రతిదాడులు జరగడానికి వీళ్లేదంటూ తన అనుచరుల‌ను ఆదేశించారు. ఆయ‌న ఇచ్చిన ఒక్క పిలుపుతో.. అనుచ‌రులు శాంతించారు. రాజారెడ్డి హ‌త్య త‌రువాత ఉమామ‌హేశ్వ‌ర రెడ్డి హ‌త్య మిన‌హా మ‌రెక్క‌డా అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోలేదు. తన తండ్రిని చంపిన వారిని చట్టానికే వదిలేస్తున్నామ‌ని వైఎస్ ఆనాడు ప్ర‌క‌టించారు. ఫ‌లితంగా- కడప జిల్లాలో పరిస్థితి అదుపులోకి వచ్చింది.రాజారెడ్డి హ‌త్య స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడే ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. తాజాగా- రాజారెడ్డి కుమారుడు వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య స‌మ‌యంలో చంద్ర‌బాబే ముఖ్య‌మంత్రిగా ఉండ‌టం గ‌మ‌నార్హం. రాజారెడ్డిని చంపిన పార్థసారథి, ఆయన అనుచరులకు చంద్రబాబు తన నివాసంలోనే ఆశ్రయం కల్పించారని అప్ప‌ట్లో పెద్ద ఎత్తున‌ ఆరోపణలు కూడా వచ్చాయి. క‌డ‌ప జిల్లా రాజ‌కీయాల‌పై ప‌ట్టు సాధించ‌డానికే రాజారెడ్డిని హ‌త్య చేయించారంటూ ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శించారు.రాజారెడ్డి హత్య కేసులో 13 మందికి అప్ప‌టి ఉమ్మ‌డి హైకోర్టు 2006లో జీవిత ఖైదు విధించింది. వారు సుప్రీం కోర్టుకు వెళ్లగా దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా హైకోర్టు తీర్పును సమర్థించింది. ఇటీవల టీడీపీ అధికారంలోకి రావడంతో హంతకులు మళ్లీ విడుదలయ్యారు. ఈ ఏడాది జనవరిలో రాజారెడ్డి హంతకులకు చంద్రబాబు ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టి విడుదల చేసింది.