1975 లవ్ స్టోరీ: ఎమర్జెన్సీ కాలంలో సుష్మా స్వరాజ్ ప్రేమ వివాహం

81

దేశం మంచి నేతను కోల్పోయింది. ఓ మంచి వక్తను కోల్పోయింది. అన్నిటికంటే మించి ఓ గొప్ప నాయకురాలిని కోల్పోయింది. అవును సుష్మా స్వరాజ్… ఈ పేరు వింటే ఎంతో మందికి అమ్మలా సేవలందించిన గుణం గుర్తుకొస్తుంది. పాకిస్తాన్ నుంచి భారత్‌కు సురక్షితంగా గీతాసింగ్ వచ్చిందంటే అందుకు చిన్నమ్మే కారణం. పాకిస్తాన్‌కు చెందిన చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని ట్విటర్ ద్వారా తెలుసుకున్న సుష్మా స్వరాజ్ చలించిపోయారు. మానవతా దృక్పథంతో, ఓ తల్లి ప్రేమతో బిడ్డను చేరదీశారు. ప్రాంతాలతో దేశాలతో సంబంధం లేకుండా వెంటనే చిన్నారికి భారత్‌లో వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. ఆరోగ్యం కుదుటపడి పాకిస్తాన్‌కు క్షేమంగా వెళ్లాకా తమ బిడ్డకు సుష్మా స్వరాజ్ పునర్జన్మ ప్రసాదించారు అని చాలా గొప్పగా చెప్పుకున్నారు ఆ తల్లిదండ్రులు. ఇలా దేశ విదేశాల్లో కూడా మంచి పేరును సంపాదించుకున్నారు చిన్నమ్మ. అలాంటి చిన్నమ్మ జీవితంలో కూడా కొన్ని ఆటుపోట్లు ఉన్నాయి. ముఖ్యంగా ఆమెకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునేందుకు చాలా అడ్డంకులను ఎదుర్కొనాల్సి వచ్చింది.

Image result for sushma swaraj husband

సుష్మా స్వరాజ్ పెళ్లికి ముందు సుష్మాగా పిలువబడేవారు. తన వాక్చాతుర్యంతో మహామహులనే ఢీకొనగలిగే సుష్మా స్వరాజ్ జీవితంలో కూడా ఓ లవ్ స్టోరీ ఉంది. తన భర్త స్వరాజ్ కౌశల్‌ను పెళ్లి చేసుకునేందుకు చిన్నమ్మ నాడు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నారట. సుష్మా స్వరాజ్ ప్రేమకథ తన సన్నిహితులకు తప్ప ఎవరికీ తెలియదు. ఇక క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుని తన భర్తతో ఎక్కువ సమయం కేటాయించాలనుందని ఓ సందర్భంలో చెప్పినప్పుడు సుష్మా-స్వరాజ్ కౌశల్‌ల లవ్ స్టోరీ బయట ప్రపంచానికి తెలిసింది. సుష్మా స్వరాజ్ ప్రేమకథ తన కాలేజీ రోజుల్లోనే మొదలైంది. ముందుగా ఓ స్నేహితుడిగా పరిచయం అయ్యారు స్వరాజ్ కౌశల్. ఇద్దరూ ఢిల్లీలో న్యాయశాస్త్రం చదివేటప్పుడు ఒకరికొకరు పరిచయం అయ్యారు. అయితే ఇద్దరి భావజాలాలు వేరుగా ఉండేవి. సుష్మా స్వరాజ్‌ది ఆర్ఎస్ఎస్ భావజాలం కాగా… కౌశల్‌ది సోషలిస్టు భావజాలం. అయినప్పటికీ రెండు వేర్వేరు తీగలు కలిసి ఓ అద్భుతమైన ట్యూన్‌ బయటకు వచ్చినట్లు ఇద్దరి భావజాలాలు వేరైనప్పటికీ వారిమధ్య వికసించిన ప్రేమ ఇద్దరినీ ఒక్కటి చేసింది. వారిద్దరి పరిచయం కాస్త పరిణయంగా మారి వివాహానికి దారి తీసింది. అయితే పెళ్లి అనుకున్నట్లుగా చాలా సాఫీగా జరగలేదు.

సుష్మా స్వరాజ్, స్వరాజ్ కౌశల్‌లు న్యాయవాది వృత్తి చేపట్టారు. ఇద్దరూ సుప్రీంకోర్టులో న్యాయవాదులుగా రిజిస్టర్ అయ్యారు. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు జార్జి ఫెర్నాండెజ్ కేసును టేకప్ చేసిన లాయర్ల బృందంలో సుష్మా-స్వరాజ్ కౌశల్‌లు కూడా ఉన్నారు. ఎమర్జెన్సీ పరిస్థితులు తారాస్థాయిలో ఉన్నసమయంలో అంటే 1975 జూలై 13న సుష్మా కాస్త సుష్మా స్వరాజ్‌గా మారింది. అంటే స్వరాజ్ కౌశల్‌ను వివాహమాడారు. సుష్మా స్వరాజ్ చివరి శ్వాసకు కొద్ది రోజుల ముందు ఈ జంట తమ 44వ వైవాహిక వేడుకలు జరుపుకున్నారు.

Image result for sushma swaraj husband

ఇక అన్ని ప్రేమ వివాహాలకు ఉన్న అడ్డంకులే ఈ ప్రేమ జంటకు కూడా ఎదురయ్యాయి. ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. సుష్మా స్వరాజ్ సంప్రదాయ హర్యానా కుటుంబం నుంచి వచ్చారు. ఇక చేసేది ఏమీ లేక ఇద్దరూ ఒకరినొకరు వివాహం చేసుకున్నారు. తన భర్త పేరునే ఇంటిపేరుగా మార్చేసుకున్నారు సుష్మా. వీరిద్దరికీ ఓ బన్సూరి స్వరాజ్ అనే అమ్మాయి ఉంది. ఆమె కూడా తల్లి తండ్రుల్లా న్యాయవాది వృత్తి చేపట్టారు. ఇక సుష్మా స్వరాజ్ తన భర్తతో సమయం గడపాలని అందుకే క్రియాశీలక రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించగానే కౌశల్ స్వరాజ్ ఆమె నిర్ణయాన్ని స్వాగతించారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నావంటూ ట్వీట్ చేశారు. ఏది ఏమైనా ఇప్పుడు దేశం ఒక గొప్ప నేతను కోల్పోయింది.ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుందాం. మరి ఆమె లవ్ మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.