పవన్ దూకుడు…జనసేన లోకి లోక్ సత్తా నేతలు..

522

పవన్ కళ్యాణ్ సారధ్యం వహిస్తున్న జనసేన దూకుడు ప్రదర్శిస్తోంది…కొద్ది రోజుల కిందట మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ జనసేనకు మద్దతిస్తున్నట్టు ప్రకటించగా తాజాగా లోక్ సత్తా నేతలు జనసేన పార్టీ లోకి చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు..ఇప్పటికే ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు నడుస్తున్నట్టు తెలుస్తోంది..ఈ ఆదివారం లోక్ సత్తా నేత కటారి శ్రీనివాస రావు ఆధ్వర్యంలో తుదివిడత చర్చలు జరగనున్నాయని సమాచారం..ఆ పార్టీకి చెందిన ప్రముఖ నేతలు జనసేన లో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం..

2019 ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టారు..ఓ వైపు ప్రజలతో మమేకమవుతూ మరోవైపు పార్టీ నిర్మాణం కోసం పని చేస్తున్నారు…ఇందులో భాగంగా ఆయన పార్టీ లోని కీలక నేతలతోనే కాకుండా మహిళా నేతలతో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు…ఎన్నికలకు ఎక్కువ సమయం లేనందున అంది వచ్చిన ప్రతి అంశంతో ముందుకు వెళ్ళాలని భావిస్తున్న పవన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు..అయితే పార్టీలోకి ఎవరిని పడితే వారిని కాకుండా చిత్తశుద్ధితో, ప్రజల కోసం పని చేసే వారిని మాత్రమే తీసుకుంటానని ఆయన పదేపదే చెబుతున్నారు. ఆయన పిలిస్తే ఇతర పార్టీల నుంచి వచ్చేందుకు చాలామంది నేతలు సిద్ధంగా ఉన్నారు. కానీ ఆయన రాజకీయాల కోసం వచ్చే నేతల కోసం వేచి చూడటం లేదని అంటున్నారు.

తాను ఇరవై అయిదేళ్ల పాటు రాజకీయాల్లో ఉండేందుకు వచ్చానని, ప్రజలు తనకు ఓటు వేసినా, వేయకున్నా వారి కోసం పోరాటం మాత్రం చేస్తానని జనసేనాని చెబుతున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారం చేపట్టడం ఖాయమని తన బహిరంగ సభల్లో చెబుతున్నారు. పార్టీ నిర్మాణం కోసం పవన్ వేగంగా పని చేస్తున్నారు. చిరంజీవి అభిమానులు, లోక్‌సత్తా పార్టీ నేతలతో పాటు ప్రజారాజ్యం పార్టీలో పని చేసిన పలువురు నేతలు పవన్ కళ్యాణ్ వెంట అడుగులు వేస్తారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కొందరు నేతలు వివిధ పార్టీల్లో ఉన్నారు. గంటా శ్రీనివాస రావు జనసేనలో చేరుతారని ప్రచారం జరిగినా, ఆయన వైఖరి చూస్తుంటే అలా కనిపించడం లేదు. అయితే, ఎన్నికలు మరింత సమీపించాక.. టీడీపీ, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో టిక్కెట్లు రాని వారు తమ వైపు చూస్తే.. పవన్ వారిలో కొందరిని జనసేనలోకి ఆహ్వానించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.