సుష్మా స్వరాజ్‌ చనిపోయే ముందు చేసిన పని తెలిస్తే షాక్

87

ఆహార్యంలో నిండైన భారతీయత.. ప్రత్యర్థులను సైతం మెప్పించే వాక్పటిమతో దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన నాయకురాలు.. బీజేపీ సీనియర్‌ నేత.. విదేశాంగ శాఖ మాజీ మంత్రి.. సుష్మా స్వరాజ్‌ ఇక లేరు. మంగళవారం రాత్రి గుండె ఆగి (కార్డియాక్‌ అరెస్ట్‌) మరణించారు. రాత్రి 9.30-10 గంటల సమయంలో ఆమె తనకు నలతగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఐదుగురు వైద్యులతో కూడిన బృందం ఎమర్జెన్సీ వార్డులో ఆమెకు అత్యవసర చికిత్స చేసేందుకు సిద్ధమైంది. కానీ, ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే కార్డియాక్‌ అరెస్ట్‌ కారణంగా ఆమె తుదిశ్వాస విడిచారని.. ఎయిమ్స్‌లో అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సుష్మను ఎయిమ్స్‌కు తరలించిన విషయం తెలియగానే కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, హర్షవర్ధన్‌, ఎస్‌ఎస్‌ ఆహ్లూవాలియా అక్కడికి చేరుకున్నారు.

Image result for సుష్మా స్వరాజ్‌

ఆమె ఇక లేరన్న వార్త తెలియడంతో పలువురు కేంద్రమంత్రులు, విపక్ష నేతలు ఎయిమ్స్‌ ఆస్పత్రికి చేరుకుని కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. సుష్మాస్వరాజ్‌కు భర్త స్వరాజ్‌ కౌశల్‌, కుమార్తె బన్సూరి ఉన్నారు. చాలాకాలంగా మధుమేహంతో బాధపడతున్న ఆమె కిడ్నీలు దెబ్బతినడంతో కొన్నాళ్లపాటు డయాలసిస్‌ చేయించుకున్నారు. 2016 డిసెంబరులో మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనారోగ్యం కారణంగానే 2019 ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేయలేదు. అయితే ట్విటర్‌లో మాత్రం చురుగ్గానే ఉన్నారు. మంగళవారం తుదిశ్వాస విడవడానికి రెండు గంటల ముందు కూడా ఆమె.. కశ్మీర్‌పై కీలక నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోదీని అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. రాత్రి భోజన సమయం వరకూ కూడా ఆమె టీవీ చూస్తూ గడిపినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Image result for సుష్మా స్వరాజ్‌

సుష్మాస్వరాజ్‌ ఆకస్మిక మరణవార్త తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. సేవే లక్ష్యంగా జీవించిన ఆమెను ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారన్నారు. ప్రజలతో చెరిగిపోని బంధాన్ని ఏర్పరుచుకున్న సుష్మ మరణం దేశానికి తీరని లోటన్నారు. సుష్మాస్వరాజ్‌ మృతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆమె మరణంతో భారత రాజకీయాల్లో ఓ గొప్ప అధ్యాయానికి తెరపడిందని అభివర్ణించారు. పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకుపోయే గొప్ప పార్లమెంటేరియన్‌ సుష్మాస్వరాజ్‌ ఇక లేరనే విషయం తెలిసి చాలా బాధ కలిగిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ అన్నారు. సుష్మాస్వరాజ్‌ మృతి బీజేపీకి, దేశ రాజకీయాలకు తీరని లోటని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్‌షా అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలందరి తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. సుష్మాస్వరాజ్‌ మృతిపట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

భారత రాజకీయాలలో ఒక ఉజ్వల అంకం ముగిసింది. గొప్ప నేత మృతికి నేడు భారత్‌ మొత్తం విలపిస్తోంది. సుష్మాజీ గొప్ప వక్త. అద్భుతమైన పార్లమెంటేరియన్‌. జీవితాంతం ప్రజా సేవకు, పేదల అభ్యున్నతికి ఆమె కృషి చేశారు. పార్టీలకు అతీతంగా అంతా ఆమెను అభిమానిస్తారు’ అని మోదీ ట్వీట్‌ చేశారు. బీజేపీ సిద్ధాంతాలు, ప్రయోజనాల విషయంలో ఆమె ఎల్లప్పుడూ రాజీలేని పోరాటమే చేశారని మోదీ గుర్తు చేశారు. కేంద్రమంత్రిగా పనిచేసిన అన్ని శాఖల్లోనూ అద్భుత పనితీరును కనపర్చారని, విదేశాంగ మంత్రిగా పలు దేశాలతో భారత్‌ సంబంధాలను మరో ఎత్తుకు తీసుకువెళ్లారని వరుస ట్వీట్లలో కొనియాడారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.