పవన్ పత్రిక వచ్చేసింది..పేరేంటో తెలుసా..!

494

రాజకీయాల్లో మీడియా పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు..ప్రతీ పార్టీకి పత్రికలు చానల్స్ సొంత డబ్బాను కొడుతుంటాయి..తెలుగుదేశం పార్టీకి ఈనాడు, ఆంధ్రజ్యోతి వైసిపి కి సాక్షి పత్రికలు కొమ్ము కాస్తుంటాయి..ఈ  తరుణంలో పవన్ జనసేన కూడా పావులు కదుపుతోంది..ఈ మధ్యనే ఒక న్యూస్ చానల్ సొంతం చేసుకున్న జనసేన తాజాగా మరో పత్రికను మార్కెట్లోకి విడుదల చేసింది..తన సోషల్ మీడియా శతఘ్ని పేరుతోనే తాజాగా పక్ష పత్రికను తీసుకొచ్చేశారు. ప్రస్తుతానికి పవన్ ప్రసంగాలతో దాన్ని నింపినా.. రానున్న రోజుల్లో పొలిటికల్ పత్రికగా రూపొందిస్తారని చెబుతున్నారు. పత్రిక పేరు కింద ట్యాగ్ లైన్ గా.. సమస్యలపై సంధించిన అక్షరాయుధం అన్నది చూస్తే.. రానున్న రోజుల్లో శతఘ్నిని ఎలా తీర్చిదిద్దుతారో ఇట్టే అర్థమైపోతుందని చెప్పాలి.

నల్ల కళ్లద్దాలతో యువత వెంట నడుస్తున్న పవన్ ఫోటోను ఫస్ట్ పేజీగా తీసుకొచ్చిన ఈ పత్రికను వెల రూ.10గా డిసైడ్ చేశారు. ప్రతి పదిహేను రోజులకోసారి ఇచ్చే ఈ పత్రిక రానున్న రోజుల్లో దినపత్రిగా చేసే వీలుందని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఒక టీమ్ను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ దినపత్రిక నుంచి తీసుకొచ్చిన ఒక ప్రముఖ జర్నలిస్టుతో పాటు.. మరికొందరు సీనియర్ జర్నలిస్టుల టీం శతఘ్నిని తీసుకొస్తారని చెబుతున్నారు.

తమ అవసరాలకు భుజానికి ఎత్తుకోవటం.. అవసరం అయ్యాక కింద పారేయటం.. కీలకమైన అంశాల్ని కనిపించకుండా ప్రచురించే పచ్చ పత్రికల తీరుతో పవన్ విసిగిపోయారని తెలుస్తోంది. దీనికి పరిష్కారంగా తమ వాదనను వినిపించేందుకు బలమైన మీడియాను తమకు తామే ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనకు తుది రూపంగా శతఘ్నిని డిసైడ్ చేసినట్లుగా చెబుతున్నారు. పవన్ ను టార్గెట్ చేసిన కత్తి మహేశ్.. శ్రీరెడ్డి ఇష్యూలలో టీవీ ఛానల్స్ అనుసరించిన వైనంపై పవన్ అసంతృప్తిగా ఉండటమే కాదు.. తన ఆగ్రహాన్ని ట్వీట్ల రూపంలో ప్రదర్శించారు కూడా. తనను కెలికితే ఎలా ఉంటుందో కొందరి విషయంలో శాంపిల్ చూపించిన పవన్.. శతఘ్నిని రాజకీయ పత్రికగా రూపొందించనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సొంత టీవీ ఛానల్ ను ఏర్పాటు చేసుకున్న పవన్.. శతఘ్నిని పూర్తిస్థాయి దినపత్రికగా మార్చే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. టీవీ ఛానల్కు ఎలా అయితే బడా బాబులు కొందరు ముందుకు వచ్చారో.. దినపత్రిక విషయంలో అలాంటి పరిస్థితే ఉందని.. కొందరు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. దినపత్రిక అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావటంతో.. శాంపిల్ గా.. పక్ష పత్రికతో మొదలెట్టి.. అంచలంచెలుగా దినపత్రిగా మార్చే వీలుందని చెబుతున్నారు.