ఏపీలో లక్షా 40 వేల రేషన్ కార్డులు క్యాన్సిల్.. మీది కూడా ఉందేమో చూసుకోండి..

176

ఏపీలో రేషన్ కార్డుల ఏరివేత మొదలైంది. ఒకటీ రెండూ కాదు రాష్ట్రవ్యాప్తంగా 1.39 లక్షల తెల్లరేషన్‌ కార్డులను క్యాన్సిల్ చేశారు.. అనర్హులకు జారీ అయినవిగా గుర్తించి వీటిని ‘యాక్టివ్‌ మోడ్‌’ నుంచి తప్పించారు. అంటే కార్డు ఉంటుంది. కానీ, సరుకులు తీసుకోవడం సాధ్యం కాదు. అనర్హుల ఏరివేతలో భాగంగా తొలుత ‘ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతూ తెల్లకార్డులు పొందిన వారిపై దృష్టి సారించారు. సీఎ్‌ఫఎంఎస్‌ ద్వారా వేతనాలు పొందుతున్న వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ తొలిదశలో ఈ జాబితాలో ఉన్న వారి తెల్లకార్డులను ‘ఇన్‌యాక్టివ్‌’గా మార్చేశారు. ఇలా అర్హత లేకుండా తెల్లకార్డులు కలిగిన వారు ఇంకా ఎవరైనా ఉంటే దశల వారీగా రద్దు చేస్తూ వెళతారు. బయోమెట్రిక్‌ ద్వారా రేషన్‌ పంపిణీ విధానం వచ్చాక నకిలీ కార్డులు పూర్తిగా తొలగిపోయాయి. కానీ, అర్హత లేనివారు చాలా మంది తెల్లకార్డులు కలిగిఉన్నారనే అనుమానాలు ఉన్నాయి. మొత్తం రేషన్‌కార్డుల వ్యవస్థను ప్రక్షాళన చేయాలని పౌరసరఫరాలశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత ప్రభుత్వ ఉద్యోగులపై దృష్టిపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగి పేరులో లేకపోయినా వారి కుటుంబంలో ఎవరి పేరుతోనైనా కార్డుకలిగి ఉంటే వాటిపైనా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఇప్పటిదాకా లక్షకు పైగా కార్డులు తొలగించారు. ఇకపై అర్హత లేని కుటుంబాలకు కార్డులపై డ్రైవ్‌ చేపట్టనున్నారు.

Image result for jagan

ఒక్కో జిల్లాలో దాదాపుగా పదివేల కార్డులు తాజా చర్యలతో తొలగించనున్నట్లు తెలిసింది. గతేడాది దరఖాస్తు చేసుకోకపోయినా 52వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు కార్డులు జారీచేసి ప్రభుత్వం తప్పులో కాలేసింది. ‘అర్హులైతే అడగకపోయినా కార్డులు ఇద్దాం’ అనే ప్రజానుకూల నినాదంతో ప్రజాసాధికార సర్వే ఆధారంగా దరఖాస్తు చేసుకోనివారికి కూడా కార్డులు జారీచేసింది. ఇందులో అనేక మంది అర్హులు ఉన్నారు. దాదాపు 60వేల మంది వరకు అనర్హులకూ అప్పట్లో కార్డులు జారీచేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు, కొందరు న్యాయమూర్తులు, కేంద్రప్రభుత్వ ఉద్యోగులు వీరిలోఉన్నారు. అడగకపోయినా కార్డులు ఇవ్వడంపై అప్పట్లో వారిలో చాలామంది అసంతృప్తి వ్యక్తంచేశారు. తప్పును గుర్తించిన ప్రభుత్వం వెంటనే వారికి కొత్తగా జారీచేసిన కార్డులను రద్దుచేసింది. ఇప్పుడు తొలగించనున్న కార్డులు చాలాకాలం నుంచి ఉన్నట్లు తెలుస్తోంది. దరఖాస్తు చేసుకున్నవారందరికీ కార్డులు జారీచేసి సరిగా పరిశీలన చేయలేదంటున్నారు. ఇలాంటి కార్డులను గుర్తించి, ప్రక్షాళన చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది.

అక్టోబరు 2న గ్రామ సచివాలయాలు ప్రారంభం అయ్యేనాటికి ఏరివేతను పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అదే రోజు నుంచి కొత్త కార్డుల జారీకి సరికొత్త విధానం తీసుకొస్తారు. ఎవరైనా కార్డు కావాలని గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే కేవలం 72 గంటల్లోనే దాన్ని పరిశీలించి ఈ విధానంలో కార్డు జారీచేస్తారు. ఈ లోగా కార్డుల వడపోతను పూర్తిచేయనున్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో ఒక కోటి 47లక్షల తెల్ల కార్డులు ఉన్నాయి. ప్రజాసాధికార సర్వే ప్రకారం రాష్ట్రంలో 1.45కోట్ల కుటుంబాలు ఉంటే అంతకంటే ఎక్కువ రేషన్‌ కార్డులు ఉండటం గమనార్హం. అయితే సంఖ్యా పరంగా ఇన్ని కార్డులు ఉన్నా అందులో దాదాపు 20లక్షల మంది కార్డుదారులు సరుకులు తీసుకోవడం లేదు. ప్రభుత్వం పోర్టబులిటీ విధానం తీసుకొచ్చినా 20 లక్షల కుటుంబాలు రేషన్‌కు దూరం కావడంపై గతం నుంచీ అనుమానాలు ఉన్నాయి.