మిడిల్‌క్లాస్ ఫ్యామిలీ నుంచి దేశ ప్రధానిగా.. వాజ్ పేయి జీవితం

311

భారతదేశానికి ప్రధానులుగా పనిచేసిన వారిలో ఉత్తమ ప్రధానిగా అందరి మన్ననలు పొందిన అటల్ బిహారీ వాజపేయి(వాజ్‌పాయి) మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో 1294, డిసెంబర్ 25న జన్మించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని పొందిన తొలి నాయకుడు. ఈయన ఆజన్మ బ్రహ్మచారి…

2014లో అత్యున్నత పురస్కారం భారతరత్న అందుకున్న అటల్ బిహారీ వాజపేయి.. డిసెంబర్ 25, 1924 న గ్వాలియర్‌లోని ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కృష్ణాదేవి, కృష్ణబిహారీ వాజపేయి. ఆయన తాత పండిట్ శ్యాం లాల్ వాజపేయి. వారి పూర్వీకుల నివాస ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని బటేశ్వర్ నుండి గ్వాలియర్‌లోని మొరీనాకు వలస వెళ్ళారు. ఆయన తండ్రి కృష్ణబిహారీ వాజపేయి గ్వాలియర్ ప్రాంతంలో ఒక ఉపాధ్యాయుడు, కవి కూడా. వాజపేయి గ్వాలియర్ లోని సరస్వతి శిశు మందిర్‌లో విద్యాభ్యాసం చేశారు. వాజపేయి గ్వాలియర్ విక్టోరియా కళాశాల (ప్రస్తుతం లక్ష్మీబాయి కళాశాల)లో చేరి హిందీ, ఆంగ్లము, సంస్కృతంలో అత్యంత ప్రతిభావంతునిగా పట్టభద్రుడైనాడు. ఆయన రాజనీతిశాస్త్రంలో ఎంఏ పట్టాను కాన్పూరులోని దయానంద ఆంగ్లో వైదిక కళాశాలనుండి పొందారు. ఎంఏ డిగ్రీని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనారు. వాజపేయి గ్వాలియర్లో ఆర్య సమాజపు యువ విభాగమైన ఆర్య కుమార్ సభతో తన సామాజిక కార్యశీలతను ప్రారంభించి, 1944లో ఆ విభాగానికి ప్రధాన కార్యదర్శి అయ్యాడు. ఆయన 1939లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో చేరారు. బాబా ఆమ్టే ప్రభావంతో ఆయన 1940-44 లలో అధికార్ల శిక్షణా కేంద్రానికి హాజరైనాడు. ఆయన 1947 లో పూర్తి స్థాయి సేవకుడు అనగా ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అయ్యాడు. ఆయన దేశ విభజన తర్వాత జరిగిన అల్లర్ల వల్ల న్యాయశాస్త్ర విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆపేశాడు.

ఆర్ఎస్ఎస్ విస్తారక్‌గా ఉత్తరప్రదేశ్ పంపబడ్డ వాజపేయి.. అక్కడ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నడుపుతున్న ‘రాష్ట్రధర్మ’ (హిందీ మాసపత్రిక),‘పాంచజన్య’ (హిందీ వారపత్రిక) పత్రికలు, ‘స్వదేశ్’, ‘వీర్ అర్జున్’ వంటి దిన పత్రికలలో పనిచేయటం ప్రారంభించాడు. వాజపేయి జీవితాంతం వివాహమాడకుండా బ్రహ్మచారిగా జీవించారు. నమిత అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆయనకు భారతీయ సంగీతం మరియు నాట్యం అంటే ఇష్టం. ప్రకృతి ప్రేమికుడైన వాజపేయికి హిమాచల ప్రదేశ్ లోని మనాలీ ప్రాంతమంటే ఎనలేని ఇష్టం. 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో వాజపేయి తన అన్న ప్రేమ్‌తో కలిసి 23 రోజుల పాటు అరెస్టు కాబడిన సందర్భంలో వాజపేయికి తొలిసారిగా రాజకీయాలతో పరిచయమేర్పడింది. ఏ విధమైన బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొననని, క్విట్ ఇండియా ఉద్యమ నాయకులతో ఎటువంటి సంబంధాలు నెరపనని వ్రాతపూర్వకమైన హామీ యిచ్చిన తరువాతనే ఆయనను విడిచిపెట్టారు. కాగా, 1951లో త్తగా ఏర్పడిన భారతీయ జనసంఘ్ అనే రాజకీయపార్టీలో పనిచేయడానికి, ఆర్ఎస్ఎస్ దీన్ దయాళ్ ఉపాధ్యాయతో పాటు వాజపేయిని నియమించింది. ఈ సంస్థ ఆర్ఎస్ఎస్‌తో కలిసి పనిచేస్తున్న రాజకీయ పార్టీ. ఆయన ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న పార్టీ యొక్క ఉత్తర విభాగానికి జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అనతికాలంలోనే జనసంఘ్ నాయకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ యొక్క అనుయాయిగా, సహాయకునిగా మారారు.

1954లో శ్యాంప్రసాద్ ముఖర్జీ.. కాశ్మీరులో, కాశ్మీరేతర భారతీయ సందర్శకులను చిన్నచూపు చూస్తున్నారన్న విషయమై నిరసన ప్రకటిస్తూ ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించినప్పుడు ఆయన వెంటే ఉన్నారు. కాగా, ముఖర్జీ ఈ నిరాహారదీక్షా సమయంలోనే కాశ్మీరు జైలులో మరణించారు. 1957లో వాజపేయి బల్రామ్‌ఫూర్ నియోజకవర్గం నుండి భారతదేశ దిగువ సభ అయిన లోక్‌సభకు తొలిసారి ఎన్నికైనారు. ఆయన వాగ్ధాటి మూలంగా, అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఏదో ఒకరోజు వాజపేయి దేశ ప్రధాని అవుతాడని ఊహించారు. ఈ క్రమంలో వాజపేయి తన వాగ్ధాటి, సంస్థాగతమైన నైపుణ్యాల కారణంగా జనసంఘ్ లో ముఖ్యనేతగా ఎదిగారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరణానంతరం జనసంఘ్ మొత్తం బాధ్యత వాజపేయిపై పడింది. 1968లో జనసంఘ్ జాతీయ అధ్యక్షునిగా ఎదిగారు. నానాజీ దేశ్‌ముఖ్, బాల్‌రాజ్ మధోక్, లాల్ కృష్ణ అద్వానీ లతో కలిసి జనసంఘ్‌ను జాతీయస్థాయి ప్రాముఖ్యతను సంతరించుకునే దిశగా నడిపించారు.

1975 నుండి 1977 ల మధ్య, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధాని ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన ఎమర్జన్సీ కాలంలో అనేకమంది విపక్ష నాయకులతో పాటు అరెస్టు కాబడినారు వాజపేయి. 1977 లో సంఘసంస్కర్త జయప్రకాశ్ నారాయణ్, కాంగ్రేస్ పార్టీకి వ్యతిరేకంగా సంఘటితమై పోరాడటానికి, అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు ఇచ్చిన పిలుపు మేరకు వాజపేయి జనసంఘ్ ను కొత్తగా ఏర్పడిన సంకీర్ణ కూటమి జనతా పార్టీలో విలీనం చేశారు. కాగా, 1979లో మొరార్జీదేశాయ్ ప్రధానమంత్రిగా రాజీనామా చేసిన కొద్దిరోజులకే జనతాపార్టీ కూడా విఛ్ఛిన్నమైపోయింది. జనసంఘ్ నాయకులు జనతాపార్టీని సంఘటితంగా ఉంచడానికి ప్రయత్నించినా, జనతాపార్టీలోని వివిధ వర్గాల యొక్క అంతర్గత విభేదాలవల్ల విసిగిపోయి సంకీర్ణంలోనుండి బయటకు వచ్చింది.

ఈ క్రమంలో వాజపేయి, జనసంఘ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుండి వచ్చిన తన సహచరులను, ముఖ్యంగా దీర్ఘకాల స్నేహితులైన ఎల్‌కె అద్వానీ, భైరాన్ సింగ్ షెకావత్ లను కలుపుకొని 1980 లో భారతీయ జనతా పార్టీని ఏర్పరచారు. ఆ తర్వాత వాజపేయి బిజెపి యొక్క మొట్టమొదటి అధ్యక్షునిగా ఉన్నారు. ఆయన జనతా ప్రభుత్వం తర్వాత వచ్చిన ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వానికి బలమైన విమర్శకునిగా అవతరించారు. వ్యవస్థాపక అధ్యక్షుడిగా.. 1968 నుండి 1973 వరకు జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసిన వాజపేయి.. 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. 3వ, 9వ లోక్‌సభలకు తప్పించి 14వ లోక్‌ సభ ముగిసేవరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు వాజపేయి. ఆయన రెండుసార్లు రాజ్యసభకు కూడా ఎన్నికైనారు. ప్రధానిగా తొలిసారి 13రోజులు.. 1996లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవి యోగం లభించినా.. అది 13 రోజులకే పరిమితమైంది. 1998లో రెండో పర్యాయం ప్రధానమంత్రి పదవి పొంది 13 మాసాలు పాలించారు. 1999లో 13వ లోక్‌సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు(ఐదేళ్లపాటు) పదవిలో ఉన్నారు. కాగా, అలుపెరుగని ఈ రాజకీయ నాయకుడికి 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించడం గమనార్హం. క్రియాశీల రాజకీయాలకు స్వస్తి.. 2005 డిసెంబర్ నెలలో ముంబై లోని శివాజీ పార్కులో జరిగిన భారతీయ జనతా పార్టీ సిల్వర్ జూబ్లీ ర్యాలీలో వాజపేయి క్రియాశీల రాజకీయాలనుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు.

తర్వాతి సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయనని ప్రకటించుకున్నారు. ఈ సమావేశంలో వాజపేయి ‘ఇకనుండి లాల్ కృష్ణ అద్వానీ, ప్రమోద్ మహాజన్’లు భారతీయ జనతా పార్టీకి రామలక్ష్మణుల వంటివారు’ అని ప్రకటించారు. వాజపేయి.. మొదటి కాంగ్రేసేతర ప్రభుత్వమైన మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖను నిర్వహించారు. ఆయన అనారోగ్య కారణాల వల్ల క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకున్నారు. భారతరత్నతో సహా వరించిన అవార్డులు వాజపేయి దేశానికి చేసిన విశేష సేవలకు గానూ నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం డిసెంబర్ 24, 2014లో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. కాగా, వాజపేయి పుట్టినరోజు అయిన డిసెంబర్ 25ను సుపరిపాలనా దినంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. వాజపేయికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ 2015 మార్చి 27న ప్రదానం చేశారు. అనారోగ్యంతో పూర్తిగా మంచంపై ఉన్న వాజపేయికి ‘భారతరత్న’ ప్రదానం చేయడానికి స్వయంగా రాష్ట్రపతే వాజ్‌పేయీ నివాసానికి తరలిరావడం విశేషం. వాజపేయిని వరించిన అవార్డులు – 1992, పద్మవిభూషణ్ – 1993, కాన్పూర్ విశ్వవిద్యాలయం నుంచి డీలిట్ గౌరవ పురస్కారం – 1994, లోకమాన్య తిలక్ పురస్కారం – 1994, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు – 1994, భారతరత్న గోవింద్ వల్లభ్‌పంత్ అవార్డు – 2014 : భారతరత్న