భారీగా చేరుతున్న వరద నీరు పోలవరం కు పెను ప్రమాదం

160

పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు కాని, అక్కడ వర్షాకాలం వస్తే ప్రజలు మాత్రం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. నిర్వాసితుల సమస్యలు వర్ణానాతీతం అనే చెప్పాలి. వర్షాకాలం నాలుగు నెలలు అక్కడ జీవితం నరకప్రాయం అంటారు ఎప్పుడు గోదావరికి వరద వస్తుందో తెలియదు రాత్రికి రాత్రి వరదపోటెత్తి గ్రామాల్లో నీరు చేరుతుంది పంటలు ఇళ్లు అన్నీ వరద నీటిలో మునిగిపోతాయి. తాజాగా పరిస్దితి అలాగే మారింది. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి పోటెత్తుతోంది. వరద ఉధృతి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో బాగా పెరిగింది .ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు వద్ద భారీగా చేరుకున్న వరదనీటి ప్రభావంతో పరిసర 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరికి భారీగా వరద నీరు చేరుతుండడంతో నిర్వాసిత గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తూరు కాజ్ వే పైకి 6 అడుగుల మేర వరదనీరు చేరుకుంది.

Image result for polavaram

తెలంగాణ రాష్ట్రంతో పాటు,మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో సీలేరు, ఇంద్రావతి, శబరి ఉపనదుల నుండి వరద నీరు గోదావరిలోకి పోటెత్తడంతో గోదావరి ఉధృతరూపం దాల్చింది. ఇక వరద ఉధృతి గంటగంటకు పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యాం దగ్గర ప్రమాదకర స్థాయిలో వరదనీరు చేరుతోంది. దీంతో అధికారులు ఎగువ కాపర్ డ్యాం ,లోయర్ కాపర్ డ్యాం ల రక్షణ కోసం బౌల్డర్ వాల్స్ వేశారు. గతేడాది పోలవరం స్పిల్ వే లో చంద్రబాబు ప్రారంభించిన గేటును తొలగించారు .వరద ఎక్కువగా వస్తే స్పిల్ వే నుంచి నీటిని మళ్లించే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.

Image result for polavaram

ఈ ఏడాది ఇరిగేషన్ అధికారుల అంచనా ప్రకారం 6-8 లక్షల క్యూసెక్కుల వరకు వరద రావచ్చు . 8 లక్షల క్యూసెక్కుల లోపు వరద ఉన్నా కాఫర్‌ డ్యాంకు ఎటువంటి నష్టం ఉండదని చెబుతున్నారు. కానీ 5 లక్షల క్యూసెక్కుల వరద దాటితే ఎగువభాగంలో నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది కాబట్టి 5లక్షల క్యూసెక్కులు దాటితే స్పిల్‌వే నుంచి మళ్లిస్తామని అధికారులు చెబుతున్నారు. అందుకే చంద్రబాబు హయాంలో బిగించిన గేటు ని తొలగించారు. ఇక వరద తీవ్రత పెరిగితే నిర్వాసిత గ్రామాలను ఖాళీ చేయించే ఆలోచనలో కూడా అధికారులు ఉన్నారు.

ఇక మరోపక్క పోలవరం పక్కన ఉన్న 19 నిర్వాసిత గ్రామాల ప్రజలు వరద పోటెత్తడంతో భయాందోళనలో ఉన్నారు . 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అధికారులు ఆ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే మూడు నెలలకు సరిపడా రేషన్ సదరు గ్రామాల్లో నిల్వ చేశామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. నిర్వాసిత గ్రామాల ప్రజలను అవసరం అనుకుంటే సహాయ శిబిరాలకు తరలించడానికి కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరద ఉధృతి వల్ల ప్రస్తుతానికి కాపర్ డ్యాం కు ఎలాంటి నష్టం లేదని అధికారులు చెప్తున్నా , కాపర్ డ్యాం నిర్మాణం వల్లే వరద గ్రామాల ను ముంచెత్తే ప్రమాదం ఉందని అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సమస్యలు తొలగాలంటే వెంటనే పోలవరం డ్యామ్ నిర్మించాలని కోరుతున్నారు అక్కడ ప్రజలు.