ఎన్నికల్లో దొరికిన నగదును ఏం చేస్తారో తెలుసా …?

194

ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చెయ్యటానికి విపరీతంగా డబ్బును ఖర్చు చేస్తారు నాయకులు. అయితే అవి ఎవరి కంట పడకుండా జాగ్రత్తగా తరలిస్తుంటారు. ఇక అలా తరలించే నగదును పట్టుకోవటం కోసం అటు పోలీసులు, ఇటు ఆదాయం పన్ను శాఖ అధికారులు నానా హడావుడి చేస్తుంటారు . వారు ముమ్మరంగా దాడులు చేసి డబ్బు, బంగారం మొదలైనవాటిని స్వాధీనం చేసుకుంటుంటారు. ఇటువంటి కేసుల్లో సామాన్యులే ఇక్కట్లకు గురవుతుండటం కూడా తెలిసిందే…

అయితే 2014 ఎన్నికలప్పుడు కానీ, తాజాగా జరుగుతున్న ఎన్నికల్లోగానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడిపై కేసులు నమోదు కావు, ఒక వేల నమోదు చేసినా అవి అవి రుజువుకావు . తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఈనాటివరకూ మొత్తం రూ. 66.96 కోట్ల రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.6 కోట్ల విలువైన మద్యం, నాలుగున్నర కోట్ల రూపాయల విలువచేసే బంగారు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. దీనికితోడు వివిధ కేసులలో మొత్తం 3154 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇటువంటి కేసులకు సంబంధించి వివిధ జిల్లాల్లోని కోర్టుల్లో అక్కడి అధికారులు చార్జీషీటు దాఖలు చేయాల్సి వస్తుంది. అలా దాఖలు చేసే చార్జ్ షీట్ లలో ఏ ఒక్క రాజకీయ నాయకుడి పేరు ఉండదు.

దైనందిన వ్యవహారాల్లో అవసరాల నిమిత్తం అప్పులు తీసుకున్న వాళ్ళు, వ్యాపారాల నిమిత్తం ఆడబ్బు తీసుకెళ్తున్న వాళ్ళు , సామాన్యులు ఈ కేసుల్లో బుక్ అవుతుంటారు. ఇటీవల సూర్యాపేట పోస్టల్ డివిజన్‌లోని టేకుమట్ల సబ్-పోస్టాఫీసు నుంచి ఎల్కారం బ్రాంచి పోస్ట్ ఆఫీసుకు ఆఫీసు అవసరాలకు లక్ష రూపాయలను సంబంధిత సిబ్బంది తీసుకువెళుతుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. అలాగే ఒక వ్యక్తి రూ. 20 లక్షలను వ్యక్తిగత అవసరాల కోసం అప్పుగా తీసుకుని, ట్రెజరీలో కట్టేందుకు హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వెళుతుండగా మధ్యలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదేవిధంగా బంగారు, వెండిని వ్యాపారం కోసం తీసుకువెళుతున్న వ్యాపారుల నుంచి ఆయా వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్న ఉందంతాలు వినిపిస్తున్నాయి.

కాగా పెళ్లిళ్లు, భూములు, ఇళ్ల కొనుగోళ్లు, విక్రయాల సందర్భంగా నగదు చేతులు మారడం సాధారణమే.ఇటువంటి సందర్బాల్లో ఒక్కోసారి ఒకరి వద్ద అప్పు తీసుకుని వెళుతున్నపుడు వాటికి సంబంధించిన కాగితాలు ఉండకపోవచ్చు. ఇటీవలి ఇలాంటి కేసులే అధికంగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఇవి కోర్టుల్లో తేలేందుకు చాలా కాలం పడుతుంది. ఎన్నికల సమయంలో పొరబాటున తమ అవసరాల కోసం నగదు తీసుకెళ్తే అధికారులకు చిక్కామా అంతే సంగతి అని సామాన్యులు లబోదిబోమంటున్నారు .ఏదీఏమైనప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజలు తమ వ్యక్తిగత అవసరాల కోసం డబ్బు కానీ బంగారం మొదలైనవాటిని తీసుకువెళ్లలేని పరిస్థితి నెలకొంది.

ఇంత జరుగుతున్నా అసలు కలుగుల్లోని ఎలుకల్ని పట్టాలని తనికీలు చేసినా ఇటువంటి కేసుల్లో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా కనీసం నిందితుడిగా కూడా ఉండకపోవడం గమనార్హం. ఒక వేల ఉన్నా ఆ కేసులు రుజువు కావు. ఇప్పుడు ఇప్పటి వరకు దొరికిన నగదుకు సంబంధించి కూడా ఏ రాజకీయ నాయకుల పేర్లు లేకపోవటం గమనార్హం

ఎన్నికల సమయంలో అక్రమంగా తరలిస్తున్న కోట్లాది రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. సంచుల కొద్ది డబ్బును సీజ్‌ చేస్తారు. ఈ డబ్బంతా ఏమవుతుంది? ఎవరి ఆధీనంలో ఉంటుంది. ఎన్నికల
సమయంలో పోలీసులు, ఇతర స్క్వాడ్‌లు స్వాధీనం చేసుకున్న నగదుపై పోలీసులు, ఐటీ శాఖ అధికారులు విచారణ జరుపుతారు. రూ.10లక్షల లోపు పట్టుబడిన కేసులను పోలీసు శాఖ, ఆపైన పట్టుబడిన కేసులను ఐటీశాఖ విచారిస్తాయి. పట్టుబడిన సొమ్ముకు సరైన బిల్లులు, డాక్యుమెంట్లు ఉంటే ఆ నగదును విడిపించుకోవచ్చు. నగదుతో పాటు భారీ స్థాయిలో పట్టుబడిన బంగారం, వెండి, చీరలు, క్రికెట్‌ కిట్లు వంటి వాటిని కూడా సరైన బిల్లులు చూపించి తీసుకోవచ్చు. ఎలాంటి బిల్లులు, పత్రాలు చూపించకపోవడం వల్ల మిగిలిన నగదు, వస్తువులను పోలీసులు కోర్టుకి అప్పగిస్తారు. కోర్టు సూచనల మేరకు నగదును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. బంగారం, వెండి, ఇతర వస్తువులను ఎన్నికల సంఘం వేలం వేస్తుంది. వేలం ద్వారా వచ్చిన నగదును కూడా ప్రభుత్వానికి అప్పగిస్తుంది. ఈ ప్రక్రియంతా ముగియడానికి చాలా సమయం పడుతుంది. ఎన్నికల సమయంలో దొరికిన నగదును ఏం చేస్తారనే విషయంపై మీ అభిప్రాయాలను తెలియజేయండి..