రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్

65

తెలుగు నేల విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన తెలంగాణతో పాటు విభజిత ఏపీలో కూడా అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరగాల్సి ఉంది. దీనిపై ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో పాటు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా చేయని యత్నమంటూ లేదనే చెప్పాలి. అయితే ఎందుకో తెలియదు గానీ… నరేంద్ర మోదీ సర్కారు అప్పుడు సీట్ల పెంపునకు నో చెప్పేసినట్టే వ్యవహరించింది. తాజా ఎన్నికలు ముగిసి – తెలంగాణలో ఓ మోస్తరులో సత్తా చాటిన బీజేపీ… ఇప్పుడు సీట్ల పెంపు అంశాన్ని తెర మీదకు తెచ్చిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీ తెలంగాణలతో పాటు జమ్మూ కశ్మీర్ – సిక్కిం రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్ల పెంపు దిశగా ఇప్పుడు మోదీ సర్కారు స్పీడ్ గా కదులుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్న బీజేపీ సర్కారు… వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కూడా వ్యూహం రచిస్తోందన్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

295 సీట్లున్న ఉమ్మడి ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోతే… ఏపీకి 175 సీట్లు పోగా – 119 సీట్లు తెలంగాణకు వచ్చాయి. ఈ సీట్ల సంఖ్యను పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఏపీ పునర్విభజన చట్టంలో ఓ క్లాజ్ ను కూడా పెట్టారు. అయితే రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ ఓడిపోవడం – అప్పటిదాకా విపక్షంలో ఉన్న బీజేపీ అధికారంలోకి రావడంతో ఈ సీట్ల పెంపు ఇతర విభజన చట్టం హామీల్లాగే మరుగునపడిపోయింది. దీనిపై రెండు రాష్ట్రాలు ఎన్ని సార్లు ప్రస్తావించినా మోదీ సర్కారు పెద్దగా స్పందించలేదనే చెప్పాలి. అయితే తాజా ఎన్నికల్లో అంచనాకు మించి బీజేపీ సత్తా చాటడం – పలు రాష్ట్రాలపై ఆ పార్టీ ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో అసెంబ్లీ సీట్ల పెంపు తమకు కలిసి వస్తుందన్న భావనతో బీజేపీ తన వైఖరిని మార్చుకుందని చెప్పక తప్పదు. ఇందులో భాగంగా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి కేబినెట్ నోట్ ను పంపిన మోదీ సర్కారు… అక్కడి నుంచి సానుకూలంగానే స్పందన వచ్చేలా వ్యూహం అమలు చేస్తోందన్న వాదన వినిపిస్తోంది.

Image result for kcr and jagan

తెలుగు రాష్ట్రాలతో పాటు కశ్మీర్ – సిక్కిం రాష్ట్రాల్లో కూడా సీట్లను పెంచడం ద్వారా తాను లాభపడొచ్చన్న భావనతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే సీట్ల పెంపునకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో పాటు న్యాయ శాఖ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ ఇప్పించేసిన మోదీ సర్కారు… ఎన్నికల సంఘంతో కూడా ఊకొట్టించేసే పనిని బీజేపీ మొదలెట్టిందట. ఇందులో భాగంగా ఇప్పటికే ఈసీకి కేబినెట్ నోట్ ను పంపిన మోదీ సర్కారు… ఈసీ నుంచి అనుమతి రాగానే… బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్దం చేస్తోందట. ఇదే జరిగితే… ఏపీలో ఇప్పుడు 175 సీట్లకు మరో 50 సీట్లు కలిసి మొత్తం 225 సీట్లు అవుతాయి. అదే సమయంలో 119 సీట్లున్న తెలంగాణ అసెంబ్లీలో 32 సీట్లు పెరిగి 151 సీట్లు అవుతాయి.