అజిత్ దోవల్ రియల్ స్టోరీ…

93

గూఢచారి అంటే ఎలా ఉంటాడు అంటే మనకు జేమ్స్ బాండ్ సినిమాలే గుర్తుకువస్తాయి. నిజంగా ఇలాంటివారు ఉంటారా అనే సందేహం కూడా మనకు కలుగుతుంది. కానీ నిజంగా ఉన్నారు. దేశ సంరక్షణ కోసం ఎందరో గూఢచారులుగా పనిచేశారు. అలాంటి వారిలో అజిత్ దోవల్ ఒకరు. దేశ రక్షణలో తనదైన ముద్రవేశాడు అజిత్. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచెక్కని అజిత్ దోవల్ జీవితం మీద ఒక చిన్న స్టోరీ మీకోసం..

Image result for అజిత్ దోవల్

బాల్యం, చదువు..
దోవల్ 1945లో ఘర్వాలీ బ్రాహ్మణ కుటుంబంలో ప్రస్తుత ఉత్తరాఖండ్ కు చెందిన ఘర్వాల్ప ప్రాంతంలోని గిరి బనేల్సున్ గ్రామంలో జన్మించారు. దోవల్ తండ్రి సైన్యంలో పనిచేశారు. అజిత్‌ కుమార్‌ దోవల్‌ 1968 బ్యాచ్‌ కేరళ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి. 23 ఏళ్లకే ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. తండ్రి సైన్యంలో పనిచేయడంతో అజ్మీర్‌లోని రాష్ట్రీయ మిలటరీ స్కూల్లో చదువుకున్నారు. ఆపైన ఆగ్రా యూనివర్సిటీ నుంచి అర్థశాస్త్రంలో పీజీ చేశారు.

Image result for అజిత్ దోవల్

ఉద్యోగ జీవితం
దోవల్ 1968లో కేరళ క్యాడర్ లో ఐపీఎస్ లో చేరారు. పంజాబ్, మిజోరంలలో తిరుగుబాటు నిరోధక చర్యల్లో పాలుపంచుకున్నారు.1999లో కాందహార్లో చిక్కుకున్న భారత ఐసీ-814 విమాన ప్రయాణికుల విడుదల కోసం సంప్రదింపులు జరిపిన ముగ్గురు సంధానకర్తల్లో దోవల్ ఒకరు. ఇంటిలిజెన్స్ బ్యూరో కార్యకలాపాల విభాగాన్ని దాదాపు దశాబ్ది కాలం నడిపించడమే కాక మల్టీ ఏజెన్సీ సెంటర్ (ఎం.ఎ.సి.), సంయుక్త నిఘా టాస్క్ ఫోర్స్ (జేటిఎఫ్ఐ) లకు సంస్థాపక ఛైర్మన్ గా పనిచేశారు. మిజో నేషనల్ ఫ్రంట్ (ఎం.ఎన్.ఎఫ్.) తిరుగుబాటు సమయంలో లాల్డెంగా నాయకులు ఏడుగురులో ఆరుగురిని తనవైపు డోవల్ తిప్పుకోగలిగారు.

Image result for అజిత్ దోవల్

సేవలు, ఆపరేషన్లు…
సర్వీసులో చేరిన నాలుగేళ్లకు ఇంటెలిజెన్స్‌ బ్యూరోకు మారారు దోవల్‌. అక్కడ పనిచేస్తూ సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేక శక్తుల పీచమణిచే చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు. తన సర్వీసులో ఎక్కువ సమయం అజ్ఞాతంలోనే ఉన్నారీయన. 1980ల్లో మిజో నేషనల్‌ ఆర్మీ (ఎమ్‌ఎన్‌ఏ)లో ఒకరిగా చేరి మయన్మార్‌, చైనా సరిహద్దుల్లో ఉంటూ క్షేత్రస్థాయిలోనే వారి పతనానికి పాచికలు వేశారు. ఆ సమయంలో ఎమ్‌ఎన్‌ఏ అధినేత బైక్చ్‌చుంగాకు ఎంతో సన్నిహితుడయ్యారు. 20 ఏళ్లపాటు సైన్యానికి తలనొప్పిగా ఉన్న ఎమ్‌ఎన్‌ఏ సమస్యకు ముగింపు పలికారు దోవల్‌. చాలామంది తమ కెరీర్‌ మొత్తంలో చేయలేని పనిని దోవల్‌ స్వల్ప వ్యవధిలో చేశారంటూ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కితాబిచ్చారు. ‘ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌’ ను అందుకున్న పిన్న వయస్కుడు దోవల్‌. 1988 ప్రాంతంలో ‘ఆపరేషన్‌ బ్లాక్‌ థండర్‌’ పేరుతో స్వర్ణదేవాలయంలో దాగున్న తీవ్రవాదుల్ని బయటకు తరిమే ఆపరేషన్‌ని ప్రభుత్వం చేపట్టినపుడు దోవల్‌ కీలక పాత్ర పోషించారు. ఒక రిక్షావాలాగా వేషం మార్చి ఖలిస్తాన్‌ తీవ్రవాదులతో మాట కలిపి తనను పాకిస్థాన్‌ ఏజెంట్‌గా పరిచయం చేసుకున్నారు. ఆపరేషన్‌ నిర్వహణకు కొద్ది రోజులు ముందు స్వర్ణదేవాలయంలోకి వెళ్లి ఉగ్రవాదుల ఆయుధ బలం, సంఖ్యా బలం, బలగాల మోహరింపుని క్షుణ్ణంగా పరిశీలించి సమాచారాన్ని భద్రతాదళాలకు అందించారు. సైన్యం ఆ ఆపరేషన్‌ చేపడుతున్న సమయంలో స్వర్ణదేవాలయం లోపలే ఉండి ఉగ్రవాదుల ఏరివేతకు విలువైన సమాచారాన్ని చేరవేశారు కూడా. దాంతో ప్రాణనష్టాన్ని తగ్గించుకోవడంతో పాటు ఆలయానికి ఎలాంటి నష్టం జరగకుండా సైన్యం ఆ ఆపరేషన్‌ పూర్తిచేయగలిగింది. ఆ ఆపరేషన్‌కుగానూ దోవల్‌ ‘ కీర్తి చక్ర’ అవార్డుని అందుకున్నారు. సైన్యంలో పనిచేసేవారికే అప్పటివరకూ ఆ అవార్డు ఇచ్చేవారు. దోవల్‌ ఆ అవార్డు అందుకున్న మొదటి పోలీసు అధికారి.

Image result for అజిత్ దోవల్

పాక్‌లో ఏడేళ్లు…
90ల్లో ఉగ్రవాదులు పేట్రేగుతున్న సమయంలో దోవల్‌ కశ్మీర్‌లో అడుగుపెట్టారు. వేర్పాటువాదిగా ఉన్న కుకా పర్రయ్‌ లొంగిపోయేలా చేయడమే కాకుండా అతడి మనసు మార్చి భారత ప్రభుత్వానికి అనుకూలంగా తయారుచేశారు. తర్వాత ఓ సంస్థను ప్రారంభించి తీవ్రవాదులకు వ్యతిరేకంగా పనిచేశాడు పర్రయ్‌. ప్రభుత్వ ఏజెంట్‌గా పనిచేయడం గురించి అక్కడ కొందరికి శిక్షణ కూడా ఇచ్చారు. మరోవైపు వేర్పాటువాద గ్రూపుల ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చలు జరిపేలా వాతావరణంలో మార్పు తెచ్చారు. రాజకీయంగానూ అదో కీలక మలుపు. ఆ చర్యలతో 1996లో జమ్ము, కశ్మీర్‌లో శాసనసభ ఎన్నికలు నిర్వహించారు. ఆ సమయంలో ఢిల్లీ వర్గాలు దోవల్‌ పనితనాన్ని ఎంతగానో కొనియాడాయి. అంతవరకూ గూఢచారిగా పేరుతెచ్చుకున్న దోవల్‌ వ్యూహకర్తగానూ గుర్తింపు సంపాదించారు. ఈశాన్య భారత్‌, పంజాబ్‌, కశ్మీర్‌… భారత్‌ వ్యతిరేక శక్తులు ఎక్కడ ఉన్నాసరే అక్కడికి వెళ్లి వారి భరతం పట్టడానికి తన ప్రతిభాపాటవాల్ని ఉపయోగించేవారు దోవల్‌. అంతేకాదు, ఏడేళ్లపాటు పాకిస్తాన్‌లో గూఢచారిగానూ ఉన్నారు. లాహోర్‌లో ఒక ముస్లిం వేషంలో ఉండేవారు దోవల్‌.

Image result for అజిత్ దోవల్

ఆ సమయంలో పాక్‌ తో పాటు, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారత్‌ అనుకూల ఏజెంట్‌లను నియమించారు. ఓసారి లాహోర్‌లో బయటకు వెళ్లినపుడు పెద్ద గడ్డంతో మత పెద్దలా ఉన్న ఒక వ్యక్తి దోవల్‌ను చూసి ‘నువ్వు హిందూ కదా!’ అని అడిగాడట. కాదని దోవల్‌ సమాధానమిచ్చినా తనతో రమ్మని రెండు మూడు సందులు తిప్పి తన గదికి తీసుకొని వెళ్లాడట ఆ వ్యక్తి. ‘నువ్వు కచ్చితంగా హిందూవే’ అని చెప్పడంతో ఎందుకలా అడుగుతున్నావని దోవల్‌ ప్రశ్నిస్తే, ‘నీ చెవికి కుట్టు ఉంది. ఈ సంప్రదాయం హిందువులదే. అలా బయట తిరగకు. దానికి ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకో. నాకు ఈ విషయం ఎలా తెలిసిందనుకుంటున్నావు, నేను కూడా హిందువునే’ అని చెప్పి, తన గదిలో ఒక మూలన దాచిన హిందూ దేవుళ్ల ప్రతిమలు చూపించాడట. తన కుటుంబాన్ని అక్కడివారు పొట్టన పెట్టుకున్నారనీ, తాను వేషం మార్చి బతుకుతున్నాననీ దోవల్‌తో చెప్పాడట అతడు. తర్వాత కొన్నాళ్లు లండన్‌లోని భారత రాయబార కార్యాలయంలోనూ పనిచేశారు దోవల్‌. క్షేత్రస్థాయిలో తానుగా లేదంటే, ఏజెంట్ల ద్వారా సమాచారం సేకరించడం, దాన్ని భద్రతా దళాలకు చేరవేసి విద్రోహ శక్తుల్ని కోలుకోలేని దెబ్బకొట్టడం దోవల్‌కు వెన్నతో పెట్టిన విద్య.

Image result for అజిత్ దోవల్

జాతీయ భద్రతా సలహాదారుగా…
మోదీ ప్రధాని అయ్యాక దోవల్‌ని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ)గా నియమించారు. వివిధ ఆపరేషన్లలో క్షేత్రస్థాయి అనుభవం ఉన్న మొదటి ఎన్‌ఎస్‌ఏ అయిన దోవల్‌కి చేతల మనిషిగా గుర్తింపు ఉంది. అప్పుడే దావూద్‌ ఇబ్రహీం తన స్థావరాన్ని కరాచీ నుంచి పాక్‌-అఫ్గాన్‌ సరిహద్దుల్లోకి మార్చుకున్నాడనీ చెబుతారు. ఇంటెలిజెన్స్‌ బ్యూరోలు సేకరించిన సమాచారాన్ని జాతీయ భద్రతా సలహాదారుతోనే పంచుకుంటాయి. దాన్నిబట్టి ఎన్‌ఎస్‌ఏగా దోవల్‌ పాత్ర ఎలాంటిదో అర్థమవుతుంది. ఎన్‌ఎస్‌ఏగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలలకే ఇరాక్‌లో ఐసిస్‌ దాడుల్లో చిక్కుకున్న 45 మంది భారతీయ నర్సుల్ని క్షేమంగా స్వదేశానికి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు దోవల్‌. 2015 జనవరిలో జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఒక తాటిపైకి తీసుకొచ్చి అన్నింటా చైనాకు వత్తాసు పలుకుతున్న అప్పటి అధ్యక్షుడు మహింద రాజపక్సను గద్దె దించడంలోనూ దోవల్‌ వ్యూహ రచన చేశారంటారు. గతేడాది మణిపూర్‌లో మన సైన్యానికి సంబంధించిన వాహనశ్రేణిపైన దాడిచేసి 18 మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న తీవ్రవాదులపైన ప్రతీకారంగా వారాల వ్యవధిలో మన సైన్యం మయన్మార్‌లోకి వెళ్లి మెరుపుదాడి చేసి 40 మంది తీవ్రవాదుల్ని హతమార్చింది.

ఈ క్రింద వీడియో చూడండి

గత అక్టోబరులో మయన్మార్‌ ప్రభుత్వం అతివాద వర్గాలతో శాంతి ఒప్పందం చేసుకున్నపుడు దోవల్‌ అక్కడే ఉండి ఆ కార్యక్రమాన్ని పరిశీలించారు. బంగ్లాదేశ్‌లో తలదాచుకుంటున్న ఉల్ఫా ప్రధాన కార్యదర్శి అనూప్‌ ఛేతియాని గత నవంబరులో ఆ దేశం మనకు అప్పగించింది. సరిహద్దు వివాదాలు పరిష్కరించుకోవడం సహా చాలా అంశాల్లో సానుకూలంగా స్పందించిన బంగ్లాదేశ్‌ మనకు సన్నిహితమైన పొరుగుదేశమంటూ బహిరంగంగానే ప్రకటించారు దోవల్‌. ఐబీ మాజీ డైరెక్టర్‌ సయ్యద్‌ ఆసిఫ్‌ ఇబ్రహీమ్‌ను 2015లో తీవ్రవాదం, ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో ప్రధానమంత్రి ప్రత్యేక రాయబారిగా పశ్చిమాసియా, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, ఆగ్నేయాసియా దేశాల ప్రభుత్వాలతో చర్చించేందుకు నియమించారు. ఇదివరకు ఇలాంటి రాయబారి హోదా లేదు. అదే సమయంలో పశ్చిమాసియా, ఆగ్నేయాసియా దేశాల్లో నిఘా వర్గాలు చురుగ్గా పనిచేసేలా దోవల్‌ మార్పులు తెచ్చారనీ, అందువల్లే ఛోటా రాజన్‌ను పట్టుకోగలిగారనీ చెబుతారు. ఊరీ తీవ్రవాద దుశ్చర్య తరువాత, మొట్టమొదటిసారిగా భారత దళాలు నియంత్రణ రేఖను దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులను విజయవంతంగా జరిపాయి.. ఈ మెరుపు దాడుల వెనుక సూత్రధారిగా అజిత్ ధోవల్ ప్రధానపాత్ర పోషించారు..ఇప్పుడు ఏకంగా కాశ్మీర్ ను పట్టిపీడిస్తున్న ఆర్టికల్ 370 రద్దు చెయ్యడం వెనుక కూడా అజిత్ దోవల్ హస్తం ఉంది. అతను భారత్ కు మరిన్ని సేవలు అందించి గొప్ప పేరు తెచ్చుకోవాలని కోరుకుందాం.