మంత్రులు నారాయణ సోమిరెడ్డి మధ్య భగ్గుమన్న విభేదాలు..చంద్రబాబు కు షాక్…

663

తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న నారాయణ సోమిరెడ్డి మధ్య మొదటి నుంచీ ఉన్న విభేదాలు తాజాగా మరోసారి బయటపడ్డాయి..మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ వీడుతుండడంతో ఈ వివాదం రచ్చకెక్కింది..ఆత్మకూరు నియోజకవర్గం వేదికగా మంత్రులు రెండు వర్గాలుగా మోహరించారు. ఈ క్రమంలో నియోజకవర్గ పార్టీ మాజీ ఇంచార్జి కన్నబాబు జిల్లా పార్టీ ఆఫీస్ లో ఆమరణ నిరాహార దీక్షకు దిగడం సంచలనం రేకెత్తిస్తోంది. ఆనం పార్టీ వీడటంతో.. ఖాళీగా ఉన్న నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతలను వాస్తవంగా కన్నబాబుకి ఇవ్వాల్సి ఉంది. అయితే కన్నబాబు మంత్రి సోమిరెడ్డి వర్గం కావడంతో నారాయణ రంగంలోకి దిగి గుట్టుచప్పుడు కాకుండా ఆ పోస్ట్ ని ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఇప్పించుకున్నారు.

దీంతో జిల్లా రాజకీయాల్లో కలవరం మొదలైంది. మొదటినుంచీ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కన్నబాబుకి ఆశాభంగమైంది. మంత్రి నారాయణ తనను టార్గెట్ చేస్తున్నారనే విషయం అర్థమైనా ఏమీ చేయలేని పరిస్థితి. దీంతో సోమిరెడ్డి ఆశీస్సులతో కన్నబాబు జిల్లా పార్టీ ఆఫీస్ లో ఆమరణ దీక్షకు దిగారు. ఒక దశలో పార్టీకి ఆయన రాజీనామా చేస్తున్నారనే వార్తలు కూడా గుప్పుమన్నాయి. తీరా మంత్రి నారాయణ మరోసారి మంత్రాంగం నడిపి కన్నబాబుని బుజ్జగించారు. నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతలపై అధిష్టానంతో మాట్లాడతామని హామీ ఇచ్చి ఆయనచే దీక్ష విరమింపజేశారు. ఈ పరిణామాలన్నీ నారాయణ, సోమిరెడ్డి వర్గాల మధ్య ఉన్న వైరాన్ని బట్టబయలు చేశాయి.

గత ఎన్నికల్లో ముక్కీ మూలిగీ నెల్లూరు జిల్లాలో పదికి 3 స్థానాల్లో గెలిచింది టీడీపీ. గూడూరు ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించడంతో ఈ బలం 4కి చేరింది. ఎమ్మెల్సీలుగా ఉన్న నారాయణ, సోమిరెడ్డిని మంత్రులుగా చేసి, జిల్లాకు రెండు పోర్ట్ ఫోలియోలు అప్పగించారు చంద్రబాబు. కొత్తగా మంత్రి అయిన నారాయణ ప్రాభవాన్ని ఎలాగైనా తగ్గించాలని సోమిరెడ్డి మొదటినుంచీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తన వర్గాన్ని తాను కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆత్మకూరు నియోజకవర్గ విషయంలో ఇద్దరు మంత్రుల మధ్య పీటముడి పడింది. నియోజకవర్గంపై పట్టుకోసం, రకరకాల ప్రయోగాలు చేసి చివరికి అక్కడ టీడీపీకి బలమే లేకుండా చేసుకున్నారు. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఇంకా ఎన్ని జిల్లాల్లో ఇలా ముసలం పుడుతుందో చూడాలి.