బిజెపి లోకి ప్రముఖ మహిళా కాంగ్రెస్ నేత…!

489

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు కొంత మంది నాయకులను ఇబ్బంది పెడుతోంది..కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మహిళా నేత మాజీ మంత్రి డీకే అరుణ కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్టు సమాచారం…గత కొంత కాలంగా తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్నా పరిణామాలకు ఆమె తీవ్ర మనస్తాపానికి గురయినట్టు తెలుస్తోంది..రెండున్నర దశాబ్దాలుగా డి.కె.అరుణ కుటుంబం కాంగ్రెస్ పార్టీ కోసమే పని చేస్తోంది. అధిష్టానం కూడా ఆ కుటుంబం పట్ల ఎంతో ఆదరణ – అభిమానం చూపిస్తోంది. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత డి.కె. అరుణకు ఆయన మంత్రివర్గంలో చాలా ప్రాధాన్యమిచ్చారు. ఒకటి రెండు సార్లు కొన్ని వివాదాలు వచ్చినా వై.ఎస్.రాజశేఖర రెడ్డి మాత్రం ఆమెను మంత్రిగానే కొనసాగించారు. అలాగే ఆమె సొంత జిల్లా మహబూబ్ నగర్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఆమె కుటుంబం కంచుకోటగా ఉంది. నిజానికి ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉండేది. అలాంటి సమయంలో కూడా డి.కె.అరుణ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడింది…

అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. కాంగ్రెస్ పార్టీలోకి జిల్లాకు చెందిన కొందరు నాయకులు చేరారు. ముఖ్యంగా నాగం జనార్దన రెడ్డి – రేవంత్ రెడ్డిల చేరికతో జిల్లాలో కాంగ్రెస్ రాజకీయాలు వేడెక్కాయి. ఈ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ జాతీయ స్ధాయి నాయకుడు జయపాల్ రెడ్డి తనకు అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడితో డి.కె.అరుణ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేయాలనుకుంటున్నట్లు ఆమె సంబంధీకులు చెబుతున్నారు. జిల్లాలో డి.కె. అరుణ ప్రాధాన్యాన్న తగ్గించేందుకు నాగం జనార్ధన రెడ్డి – రేవంత్ రెడ్డిలను ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న డి.కె. అరుణ గత కొంతకాలంగా ఈ విషయాన్ని తెలంగాణ నాయకులకు చెప్పారని అయితే వారి నుంచి కూడా సరైన స్పందన రాలేదని సమాచారం. ఈ పరిణామాలతో విసుగు చెందిన డి.కె.అరుణ పార్టీలో మారాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఎన్నాళ్లుగానో కాంగ్రెస్ పార్టీలో ఉన్న తనకు అవమానం జరుగుతోందని భావించిన డి.కె.అరుణ భారతీయ జనతాపార్టీలోచేరాలనుకుంటున్నట్లుసమాచారం. దీనిపై తెర వెనుక మంతనాలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. భారతీయ జనతా పార్టీకి చెందిన అగ్ర నాయకులతో ఇప్పటికే చర్చలు జరిపిన డి.కె.అరుణ పార్టీ మారేందుకు రంగం సిద్ధమయినట్లు చెబుతున్నారు. ఆమెతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండాలని పార్టీ అధిష్టారం తెలంగాణ బిజేపీ నాయకులకు అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. డి.కె.అరుణ చేరికతో తెలంగాణలో… ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో పార్టీ పటిష్టమవుతుందని అగ్ర నాయకులు భావిస్తున్నారు. మరోవైపు డి.కె.అరుణ పార్టీ ఆలోచనపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కొందరు ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ద్రష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. తెలంగాణ నాయకులు ఆమె మాట్లాడాలని సాధ్యమైనంత వరకూ పార్టీ మారకుండా చూడాలని రాహుల్ గాంధీ సూచించినట్లు చెబుతున్నారు. అయితే డి.కె. అరుణ మాత్రం తన నిర్ణయాన్నిమార్చుకోరని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.