ఫ్లాష్‌ బ్యాక్‌: వై.ఎస్‌. మృతదేహాన్ని ఎలా తీసుకొచ్చారో తెలుసా..?

632

2009, సెప్టెంబర్‌ 3..అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉత్కంఠగా ఎదురు చూసిన రోజు. ఆ రోజు ప్రతిక్షణం ఉద్వేగమే. ప్రతి క్షణం ఉత్కంఠ భరితమే. అంతకుముందురోజు రచ్చబండ కోసం హెలికాప్టర్ లో బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆచూకీ కనిపించకపోవడమే అందుకు కారణం. ఎంత వెతికినా కూడా ఆయన ఆచూకి లభించలేదు. దాంతో సుఖోయ్ యుద్ధ విమానం సహాయం తీసుకున్నారు. తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో సుఖోయ్ యుద్ధవిమానంతో గాలింపు చేపట్టారు. గాలింపు చేపట్టిన కొద్ది గంటల్లొనే కర్నూలు-ప్రకాశం జిల్లా సరిహద్దులో ఉన్న వెలుగోడుకు సమీపంలో పావురాల గుట్టపై హెలికాప్టర్ శకలాలను గుర్తించిన వైమానిక సిబ్బంది ప్రధానమంత్రి కార్యాలయానికి సమాచారం చేరవేసింది. హెలికాప్టర్ పావురాలగుట్ట సమీపంలో కూలిందని తెలిసింది. సెప్టెంబర్ 3 వ తారీఖు ఉదయం 11 గంటల సమయంలోనే ఇక ముఖ్యమంత్రి మనకు లేరన్న వార్త వెల్లడైంది. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించినప్పటికీ ఆ ప్రాంతానికి వెళ్లడానికి పోలీసులు, మీడియా, రాజకీయ నాయకులు, స్థానికులు, చెంచులు చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. ప్రమాదం జరిగిన ప్రాంతం అత్యంత దట్టమైంది కావడమే అందుకు కారణం. కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని నల్లకాలువ గ్రామం మీదుగా 16 కిలోమీటర్ల దూరంలోని రుద్రకోడూరు గ్రామానికి దట్టమైన అటవీ మార్గంలో వెళ్లాల్సి ఉంది.

అక్కడికి ప్రమాద స్థలి మరో 16 కిలోమీటర్లు దూరం. కాలినడకన వెళ్లేందుకు ప్రయత్నించిన విలేకరులు, ఫొటోగ్రాఫర్లు, పోలీసులు కూడా దారి తప్పారు. వైమానిక సిబ్బంది కూడా 1.30 గంటల వరకు ప్రయత్నించి సాధ్యం కాక, హెలికాప్టర్ల ద్వారా కిందకు దిగి మృతదేహాలను తాళ్లతో కట్టి తరలించాలని నిర్ణయించారు. వైమానిక దళ కమెండోలు, చెంచులు తాళ్ల సహాయంతో కిందకి దిగి మృతదేహాల శకాలను సేకరించారు. చెల్లా చెదురుగా పడివున్న మాంసపు ముద్దలను ఏరి గుడ్డ సంచులలో చేర్చి తాళ్ల ద్వారానే హెలికాప్టర్లలోకి చేర్చారు. మధ్యాహ్నం 2.20 గంటలకు భారత వైమానిక దళం హెలికాప్టర్లలో ముఖ్యమంత్రి వైఎస్ పార్థివదేహంతో పాటు పైలెట్లు, భద్రతా అధికారుల భౌతికకాయాలను కర్నూలుకు తీసుకువచ్చారు. కర్నూలులో ముఖ్యమంత్రి వైఎస్ మృతదేహానికి పోస్టుమార్టం, కర్నూలు రెండో బెటాలియన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో శవపరీక్షలు నిర్వహించారు. ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాల వరకు వైఎస్ సహా ఐదుగురు బతికే ఉన్నారని, తీవ్ర షాక్ కారణంగా కన్ను మూశారని ఫొరెన్సిక్ నిపుణులు తెలిపారు. దుర్ఘటనలో మృతుల శరీర భాగాలు బాగా కాలిపోయినట్లు, కొన్ని నిమిషాలు కొట్టుమిట్టాడి మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో ధ్రువీకరించారు.

ఈ క్రింద వీడియో చూడండి

సాయంత్రం 4.30 గంటలకు కర్నూలు నుండి హైదరాబాదుకు బయలుదేరిన ప్రత్యేక హెలికాప్టర్లు ఐదు గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నాయి. తరువాత బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయానికి మృతదేహన్ని తరలించారు. ఆయన భౌతికకాయానికి కడపలోని ఆయన వ్యవసాయక్షేత్రం ఇడుపులపాయలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయన అంతిమయాత్ర, ఖనన క్రియలో పాల్గొన్నారు. ఆయన మరణాన్ని తట్టుకోలేక పలువురు అభిమానులూ మరణించారు. వైఎస్ మరణంతో రాష్ట్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గాంధీభవన్‌తో సహా ప్రతివీధిలోనూ సీఎం చిత్రపటాలతో సంతాప సభలు ఏర్పాటు చేసి ప్రజలు నివాళులు అర్పించారు. ఇలా ఒక గొప్ప నేత మన అందరిని వదిలివెళ్ళిపోయారు. మరి వైఎస్ మరణం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.